Jump to content

ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము

వికీసోర్స్ నుండి

శ్రీశ్రీధరాయనమః

శ్రీబొబ్బిలి పురాధీశ్వరులగు, మహారాజరాజశ్రీ

శ్రీ వేంకట శ్వేతాచలపతి రంగారావు బహద్దరుగారి

యాస్థాన విద్వత్కవులలో నొకరగు

బ్రహ్మశ్రీ

మండపాక పార్వతీశ్వరశాస్త్రులవారిచే

రచియింపఁబడిన

ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము

ఇది
శ్రీ "అముద్రితగ్రంథచింతామణి" యందుఁ బ్రకటింపఁబడుటకై
గ్రంథకర్తవలనఁ బంపబడి
శ్రీమత్సరస్వతీనిలయ ముద్రాక్షరశాలయందు ముద్రితమై
యముద్రితగ్రంథచింతామణి పత్రికాధిపతియగు
పూండ్ల రామకృష్ణయ్యగారిచేఁ
బ్రకటింపఁబడియె.

శ్రీమత్సరస్వతీనిలయ ముద్రాక్షరశాల,
నెల్లూరు.
1896.
వెల, రు.0-4--0

ఛత్రబంధాంతర్గతశతబంధనామావళి

సీసమాలిక.

శ్రీశతరుద్రీయసిద్ధాంతితంబగు విశ్వరూపము గల్గి వెలయుచున్న
విశ్వేశ్వరునిమూర్తి వీక్షింప దీక్షించి తల్లిదండ్రులఁ గూడి తత్పురంబు
నకుఁ బ్రమాదీచనామకవత్సరంబున నరుగుచు మార్గమధ్యంబునందు
బంధగర్భకవిత్వబంధురంబుగ నే రచించిన యనవద్యసీసపద్య
శతకంబునందలి ఛత్రబంధంబున నిమిడిన నూఱుబంధముల వినుఁడు
పద్మకోశాంకుశ పరశుఖట్వాంగత్రిశూలకాసారక పాలఖేట
మల్లాయుధవిశేష మణిశాణపట్టికా మద్గరోలూఖల ముసలతర్కు
తాఘాయోగదండతులాతులాయన సందంశకర్తరీ శలభ కలభ
శరచాపహలకుంత చామరవీజన డమరకురంగ ఘంటానిషంగ
కమఠనాగస్వర కాహళవల్మీక దండకమండలు దరమయూర
డోలికామాలికాందోళికా శిబికాగళంతికా గణికా కళాచికా వి
పంచికాకుంచికా పాదుకాకనకాలుకోర్మికాహార కేయూరమకుట
వీటికాపేటికా వృషవైజంతికా నాసికాముకుర దీనారకుతుప
కాలచక్రతరీకులాలచక్రాదర్శ శఫర గదా తాళ శకట ఖడ్గ
సింహాసనోపాంగ చిత్రవితాన బిల్వదళోపధాన గవాక్షకేళి
జలశృంగవాశికా షట్పంచకోణాహి సవ్యౌత్తరగ్రహచక్రపన్న
గాభరణవరాభయప్రదముద్రాపటీరకుటీరాల్పశారిఫలక
యాత్రికద్విశరశరాసనైకాదశరుద్రమండలవిమానాద్రిధూప
దీపనీరాజనాష్టపదమంత్రపుష్పప్రదక్షిణనమస్కారబంధ
ము లనంగ శతబంధముల గల వింకను బుద్ధిమంతులు సూక్ష్మబుద్ధిచేత
గల్పించినకొలంది గడువిచిత్రములైన బహుబంధములుగను పట్టునిందు
నివిగా ప్రాచీనకవు లేర్పఱచిన మార్గమున నవీనమార్గమున నిపుడు
పద్మబంధము నాగబంధము చక్రబంధము గ్రహచక్రబంధము మృదంగ
బంధము సర్వతోభద్రబంధము సౌధబంధము కంకణబంధ లింగ
బంధ నిశ్రేణికాబంధ గోమూత్రికాబంధంబులు తులసీబంధ పుష్ప

మాలికాబంధముల్ మఱియును లఘుసుదర్శనబంధ గురుసుదర్శ మహాసు
దర్శనబంధత్రితయము ముప్పదిరెండుదళముల పద్మబంధం బనంగ
నెగడు బంధములు గొన్ని “ప్రబంధసంబంధనిబంధనగ్రంథ”మందుఁ
దెలిపినలక్షణంబులకు లక్ష్యములుగా గురుకటాక్షమున నేఁ గూర్చినాఁడ
నిది పూర్వభాగ మిట్లింక నుత్తరభాగమున బంధలక్షణముల నొనర్తు
లక్ష్యలక్షణములు లలితబంధముల క్రింద లిఖించి కనువారి కెలమిఁ గొలుపు
విద్యాభమాను లవ్విధమున ముద్రింపఁబూనినచోఁ బంపఁబూనియుంటి
లాక్షణికులార దోషంబులకు సహించి గుణముల గ్రహించి మన్నింపఁ గోరుచుం
సంతతాన్యోన్యసామరస్యము నొసంగి మనల దయచేతఁ బురజేత మనుచుఁగాత.

ఇట్లు

మండపాక పార్వతీశ్వరశాస్త్రి

శ్రీరస్తు
శ్రీ కాశీవిశ్వనాథాయ జగద్గురు గణపతయేనమః

మండపాక పార్వతీశ్వరకవీశ్వర కృతమగు
ప్రబంధసంబంధబంధనిబంధనగ్రంథము

పూర్వపీఠిక

క.

శ్రీరసికు లెన్న బంధో
ద్ధార మొనర్పఁదగు నేర్పుఁ దనకుంబలె నా
కారూఢిం గలిగించిన
కారుణ్యమయాకృతిన్ జగత్పతి నెంతున్.

1


సీ.

శ్రీమత్పినాకినీసింధుతీరమున భాసిల్లు నెల్లూరిలో నుల్లసిల్లు
పూండ్లవంశంబునఁ బొడమి యీపుడములోఁ గవిపక్షపాతియ న్ఖ్యాతి వడయఁ
గడఁగి యముద్రితగ్రంథచింతామణియను పత్రికను బ్రకటన మొనర్చు
శ్రీరామకృష్ణాఖ్యచేఁ దనర్చు నుదారకవి గోరి వ్రాసినకారణమున


గీ.

మహితబొబ్బిలిపురి నుండు మండపాక
పార్వతీశ్వరకవి కతిపయకవిత్వ
బంధముల కొకలక్షణగ్రంథ మిపుడు
క్రొత్తగా నేర్చిన ట్లొనగూర్చె నిట్లు

2


చ.

సుకవులు బంధలక్ష్యములె చూపిరి గాని తదర్హలక్షణం
బొకరును జూపరైరని తదుద్ధరణార్థము పూండ్ల రామకృ
ష్ణకవి దృఢప్రతిజ్ఞుఁడు రసజ్ఞుఁడు గావునఁ బూనియుండెఁ గౌ
తుకమునఁ బార్వతీశ్వరుఁడు దోడ్పడఁ దత్ఫలసిద్ధి కబ్రమే.

3


చ.

కవులు నిరంకుశప్రతిభ గల్గినవా రగుటన్ స్వతంత్రులై
వివిధవిచిత్రబంధములు వృత్తనిబంధము లేక క్రొత్తక్రొ
త్తవి దమచిత్తవృత్తియె నిదానముగా మును గూర్చి రైన సూ
క్ష్మవిధి నొనర్తు లక్షణము మత్కృతలక్ష్యపురస్సరంబు గాన్.

4


చ.

అమలమతుల్ వినుం డొకరహస్యముఁ దెల్పెద సంప్రదాయసి
ద్ధములగు కొన్నిబంధములుదప్పఁ దదన్యము లెప్పుడైనఁ గ
ర్తృమహిమ నించుమించులగు నిట్టినిమిత్త మెఱింగి నాదుపొ
త్తముఁ గను నప్పు డిప్పు డిది తప్పని తప్పని దెప్పఁబోకుఁడీ.

5


ఉ.

నాల్గుతెఱంగులైన కవనంబున బంధకవిత్వ మన్నిటం
దెల్గునఁ గూర్చు టెన్నిటను దీరనికష్టము తద్విశిష్టరే
ఖ ల్గడముట్టునట్టు లొకకట్టడ పుట్టకయున్న నున్నబి
ట్ట ల్గనుపట్టు నెట్టని కడంగి తొడంగితి దీనిఁ జేయఁగాన్.

6


ఉ.

చిన్నతనంబునందె పితృసేవ యొనర్చుచు వారణాసిఁ గొ
ల్వన్నడతెంచుచుం బ్రకృతిబంధవిముక్తికిఁ జిత్రబంధముల్
మున్న విముక్తనాయకుఁడు మోదిలఁగూర్చితి నాటిబంధము
ల్గొన్ని యుదాహరింతు నిఁట లోపము లున్నను సైఁపుఁ డున్నతుల్.

7


క.

లక్షణము లేనివానికి
లక్షణము లభించెనని తలంచి యపేక్షన్
లాక్షణికులు వీక్షింతు ర
సూక్షణకు లుపేక్ష గలిఁగి చూడకయున్నన్.

8

గీ.

నలినబాంధవ కుముదబాంధవులఁ గూడి
తార లెందాఁకఁ దనరు నందాఁక మత్ప్ర
బంధసంబంధబంధనిబంధనంబు
చిత్రకవనానుబంధమై చెలఁగుఁగాత.

9


మత్కృత శ్రీకాశీవిశ్వనాథశతకమునందలి నిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధబంధురసీసపద్యము

బ్రేమ నస్మద్భవాతపపీడ లడఁప
దర్శనం బిమ్ము సీసపద్యగనిరోష్ఠ్య
బంధశతగర్భితచ్ఛత్రబంధముఁ గొని
కాశికావిశ్వనాథదుర్గాసనాథ.


ఈసీసపద్యమందున్న నిరోష్ఠ్యబంధశతగర్భితచ్ఛత్రబంధశ్లోకము


శ్లో.

రాకరాకత్రిరాకారా రాజతాగగతాజరా
రాగాసారరసాగారా రాకారాత్రికరాకరా

(ఇందలి బంధశతంబును, దీనియర్థంబును, గడపట వ్రాయంబడును. లక్ష్యముగా మాత్ర ముదాహరింపఁబడియె.)

బంధలక్షణప్రకరణము

(ఛత్రబంధలక్షణము)

చ.

ప్రథమచతుర్థపాదముల వ్రాలనులోమవిలోమగామితా
గ్రథితము లున్నరెండును సగంబునకే భ్రమకంబు లిట్లవి
శ్లథవిధి నుండ దండమున ఛత్రమునం గ్రమతన్ లిఖింపఁగాఁ
బృథివిని ఛత్రబంధమగు వృత్తము చిత్తమురీతిదే యగున్.

1

చామరబంధలక్షణము

చ.

తొలియడు గిందునం దరయఁ దుల్యము పద్భ్రమకత్వము న్నయం
ఘ్రులకు సగంబునంద యొడఁగూడును దీనికి బఙ్క్తు లాఱు పై
యలుఁగున ఖడ్గబంధమున కంఘ్రులు మూడును నాల్గుబంతులౌ
సలుపుదు రిట్టికీ లెఱిఁగి చామరబంధము చామరాదులన్.

2

ఖడ్గబంధలక్షణము

మ.

పిడికా దిందుది నాల్గునాల్గుదళముల్ పీఠాకృతిన్ నిల్పి యొ
క్కడుగం దల్గునఁ దచ్ఛిరోక్షరమె యాద్యంబంత్య మౌనట్లు పై
యడుగుల్ మూడును నాల్గుబంతులుగ వ్రాయన్ ఖడ్గబంధం బిదే
పుడమిన్ నేర్పరి గూర్పఁ జిత్రగతులం బొందున్ సుగంధ్యాదులన్.

3

పద్మబంధలక్షణము

మ.

నలసంజ్ఞల్ దళసంఖ్య నొప్ప దళవర్ణశ్రేణితోఁ గర్ణికా
తలవర్ణంబు లగించు చొప్పొకటి లేదా స్రగ్ధరాద్యంతది
గ్దళవరాళిప్రవేశనిర్గమనసాధారణ్య మొందన్ విది
గ్దళవర్ణంబులఁ గూడి యష్టదళసంజ్ఞం బద్మబంధం బగున్.

4

గ్రహచక్రబంధలక్షణము

మ.

అపసవ్యగ్రహచక్రమందు గ్రహనామైకైకముఖ్యాక్షరం
బుపయోగార్హముగాఁ గనంబడినటుల్ యోజించి పద్యాంఘ్రిగ
ర్భపరీతంబుగఁ జేసియో వసుదళాబ్జంబట్లు సంధించియో
యుపలబ్ధిన్ గ్రహచక్రబంధము బుధుఁ డూహించి కూర్పందగున్.

5

ఇదే యష్టదళపద్మబంధంబునకుఁ బక్షాంతరలక్షణం బగు.

నాగబంధలక్షణము

మ.

సరిగా నల్ నవకోష్ఠముల్ నెఱపి లో సందంశరీతింబర
స్పరరేఖల్ గదియించి పార్శ్వము లథోభాగంబుకోణంబులుం
బరివేష్ఠిపఁగఁ జుట్టి పుచ్ఛముఖముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్ర
గ్ధరయో చంపకమాలయో యొగినిడంగా నాగబంధం బగున్.

6

పుష్పమాలికాబంధలక్షణము

ఉ.

సంధి నొకక్షరంబు నలుచక్కులఱేకుల నాల్గువర్ణముల్
సంధిలునట్లు స్రగ్ధరయొ చంపకమాలికయో మిధోగ్రసం
బంధము గల్గు తత్కుసుమమండలి లోనిడఁ బుష్పమాలికా
బంధ మగుం బ్రతిప్రసవవర్ణము లేడగుం గూడఁబల్కినన్

7

చక్రబంధలక్షణము

మ.

పయిపైఁగాఁ బదిచుట్లు నాఱుదళముల్ ప్రాగ్రేఖలం దీర్చి స్వా
హ్వయపత్యాహ్వయముఖ్యచిహ్నములు గన్పట్టంగఁ బాదత్రయా
శ్రయరేఖాంత్యపదాశ్రయాదివృతిగా శార్దూలవిక్రీడితా
హ్వయవృత్తంబు యథాక్రమంబుగ లిఖింపం జక్రబంధం బగున్

8

సర్వతోభద్రబంధలక్షణము

మ.

క్రమరీతిం జతురంగచక్రమున నర్థశ్రేణుల దర్థప
ద్భ్రమకంబై ప్రథమాంఘ్రివర్ణము లథఃపాదాదులం దుల్యసం
ఖ్యముగాఁ గల్గినదై సగంబు తలక్రిందై సర్వతోభద్రబం
ధమగుం బొందిక దీని కెన్మిదవచందం బెన్నచందంబులన్

9

సౌధబంధలక్షణము

చ.

ఒకటియు మూడు మూ డొకటి యోలిగ మీదను గ్రిందం గూర్చి త్రి
త్రికములు సంధియుగ్మమునఁ దీర్చి చతుశ్శివధామభూమికా
త్రికము పొనర్చి గర్భమునఁ గ్రేవలగందముఁ గ్రిందుగా నమ
ర్చి కవుల సౌధబంధమునఁ జేర్చి రచింతురు సీసపద్యమున్

10

గోమూత్రికాబంధలక్షణము

మ.

కుటిలంబై పొడవై మిధోభిముఖమౌ గోమూత్రరేఖాకృతి
స్ఫుటరేఖాద్వయి రెండుగీట్లనడుమం బొందించియో లేక త
త్పటురేఖాంతరగేహపఙ్క్తియుగళిన్ వ్రాల్నింపి యొండొంటఁ బ
ల్కుట కర్హంబుగనో ఘటింతురు కవుల్ గోమూత్రికాబంధమున్

11

ఆందోళికాబంధలక్షణము

మ.

క్రమవక్రంబులుగాఁ గ్రమేళకముజోకన్ దండఖట్వాదిరూ
పములున్ సంధులయందుఁ జిత్రకలశద్వంద్వంబు పూబంతిమ
ధ్యమునందుం దలక్రిందుగాఁ జదువ నర్హంబైనపద్యంబు హృ
ద్యముగా నందునుఁ జేర్చి కూర్చుఁ జతురుం డాందోళికాబంధమున్

12

శిబికాబంధలక్షణము

శా.

బంధజ్ఞానము లేనివారు శిబికాబంధంబె యాందోళికా
బంధం బందురు గాని నామమును రూపం బేకరూపంబులో
సంధింపంబడు శ్లోక మేకమయినన్ సంధానసంస్థానసం
బంధం బేకము గాదు గావునఁ బృథగ్బంధంబు లౌటబ్రమో

13

మురజబంధలక్షణము

చ.

అరచదరంగపుంగదుల నంఘ్రులు నాల్గును ద్విత్రిషణ్నగా
క్షరములొ మధ్య షట్కమొ యొకండుగ నుండఁగఁ గూర్చి వ్రాయఁగా
మురజసమాఖ్యబంధ మగు మూలకు మూలకు రేఖ లుంచి పై
తెరువున వ్రాసిచూచిన నదే యగు రెంటను గామగామియై

14

కంకణబంధలక్షణము

చ.

కవి యొకదానిలో నొకటిగా వలయాకృతిగా ద్విరేఖలం
గవియునటుల్ ఘటించి కడఁకం గడియంబున నాద్యమంత్యమో
యవు నొకపద్య ముంచ నది యక్షరసంఖ్య నితస్తతోగతిం
దివియ ననేకరూపు లగు దీనిన కంకణబంధ మం డ్రిలన్

15

పద్మకోశబంధలక్షణము

ఉ.

నాళమునందె యాదిచరణంబు లిఖించి తదంతిమాక్షరం
బోలిగ నాద్యమంత్యమగునోజ ద్వితీయతృతీయపాదముల్
కీలరి కుట్మలంబున లిఖింపఁగ నంతిమ మాదిపాదమం
దే లయ మొందుఁ గ్రిందుగ నిదే యలకుట్మలబంధమై చనున్

16

లింగబంధతులసీబంధలక్షణములు

చ.

శశిహయసాయకానలనిశాకరవహ్నిశరాశ్వకోష్ఠముల్
విశదముగా నమర్చి యొకవృత్తముందుఁ బొనర్చి కుక్షిలోఁ
గుశలకవుల్ నిజేష్ట మొనఁగూర్చి యొనర్చిన లింగబంధమౌఁ
బశుపతి కింపుఁగాఁ దులసిబంధ మిదే యగు శౌరి కింపుగాన్

17

డమరుబంధలక్షణము

ఉ.

ప్రాంశువులైన సత్కవులు భాసురరేఖలు రెండు రెండు సం
దంశములీల వ్రాసి వదనంబులు రెండును రెంట మూసి గ
ర్భాంశగతాక్షరంబె మొదలై తుదయై తగునట్లు గూర్పఁగా
భ్రంశము లేకదే డమరుబంధ మగున్ ద్విముఖానుబంధమై

18

ఖేటబంధలక్షణము

చ.

అలరులు నాల్గు నాల్గు వలయంబున గర్భమునన్ లిఖించి య
య్యలరుల నాద్యమంత్య మగునంఘ్రులు రెండును ముష్టిబంధన
స్థలముల నున్న యంఘ్రులును దద్గతవర్ణము లాదులంతిమం
బులు నగున ట్లమర్చి సలుపుం గని యీగతి ఖేటబంధమున్

19

తరవారిబంధలక్షణము

చ.

తుదమొద లల్గునం బ్రథమతుర్యపదంబుల కాదిఁజేసి పై
పదములు జాళువామొసలినా పిడికట్టున జట్టుగా సగం
బదియిది సొచ్చి వచ్చి పిడికల్గునకుం గల సంధి వర్ణమం
దొదుగునటుల్ ఘటింతు రిటు లుర్విఁ గవుల్ తరవారిబంధమున్

20

త్రిశూలబంధలక్షణము

శా.

ఏమై మమ్మొనవాలుగా నలరు నట్లే రేఖలం దీర్చి యం
దామూలాగ్రముగాఁగ నాళమున నాద్యంబుం దదంత్యాక్షరం
బామూలాగ్రము లొంద శాఖలను మధ్యాంఘ్రుల్ చతుర్థాంఘ్రిక్రిం
దై ముఖ్యాంఘ్రినిఁ జేర్చి కూర్చినఁ ద్రిశూలాకారబంధం బగున్

21

పరశుబంధలక్షణము

శా.

చేపట్టందగు కాండమం దొకటి తచ్ఛీర్షంబునన్ నల్మొనల్
చూపట్టందగు ఖడ్గమందు భయమున్ సొంపొంద సంధ్యాదిగా
వేపట్టందగు తుర్య మాద్యపదసంవేద్యంబుఁ గావింత్రు మే
ధాపాథోనిధు లీవిధిం బరశుబంధంబుం బ్రబంధంబులన్

22

శరబంధలక్షణము

చ.

ప్రథమతృతీయవర్ణములు పార్శ్వములందు ద్వితీయ మగ్రమం
దధిగతమౌగతిన్ నిలిపి యమ్మునఁ బూర్వపదమ్ముఁ గూర్చి త
త్ప్రథమపదంబునం జరమపాదముఁ గ్రిందుగఁ జేర్చి యల్గునన్
బుధుం డిరుచోట్లనున్నపదముల్ వెరపన్ శరబంధమై తగున్

23

చాపబంధలక్షణము

చ.

చిలుకున నాదిపాద మిడి సింగిణిశింజిని చిల్కుతోడ సం
ధిలిన దళంబు లాదిని దుదిం దగుచందమునన్ ద్విపాదము
ల్నిలిపి చతుర్థ మాదిపదలీనముగా నొనరించి యీగతిం
జలిపినఁ జాపబంధ మగు సంగతి మార్చిన మార్చగాఁ దగున్

24

తూణీరబంధలక్షణము

శా.

గోపీచందనరేఖలట్లు శరయుక్తూణాకృతిన్ వ్రాసి త
ద్రోపాగ్రంబులు తన్ముఖస్థలము తద్రూపద్విపార్శ్వంబు ల
య్యైపాదంబుల నొందఁ దుర్యచరణ బాద్యాంఘ్రిలోఁ గ్రిందుగాఁ
దోఁపన్ దీపితరీతి నిట్లు సలుపం దూణీరబంధం బగున్

25

ఉలూఖలబంధలక్షణము

చ.

భ్రమపడఁబోకుఁడీ డమరుబంధ ములూఖలబంధ మొక్కచం
దమునఁ దనర్చునంచు నభిధానము వర్ణవిధానముం బ్రధా
నముగఁ బ్రధానిధానములు నవ్యకవీశ్వరకావ్యసంవిధా
నము విధిసన్నిధానసృజనప్రణిధానము చింత లెంతయున్

26

ముసలబంధకుంతబంధలక్షణములు

చ.

ముసలమునందు మధ్యపదముల్ కొసబంతులు రెండు కుంతమం
దు సరిగ నాల్గు ప్రాథమికతుర్యపదంబు లితస్తతోగతిం
బొసఁగును రెంటిదంటులను బుద్ధికొలందిఁ జమత్కరించి యీ
పస నెసఁగించినన్ ముసలబంధ మగుం దగుఁ గుంతబంధమున్

27

అంకుశబంధలక్షణము

శా.

కాండాదిప్రసవంబునందును దదగ్రంబందుఁ బూర్వాంఘ్రియుం
గాండాగ్రాక్షర మాద్యమంత్యముగ ఖడ్గంబందు వక్రాసియం
దండన్ రెండును దుర్యమాదిపదమందగ్రాదియై క్రిందుగాఁ
గాండంబందును బొందు నంకుశపదాంకంబైన బంధంబునన్

28

పతాకాబంధలక్షణము

శా.

స్తంభాకారమునందుఁ బ్రాక్చరణముం దత్రత్యవర్ణంబు లా
రంభంబంతము నౌనటుల్ ధ్వజపటాగ్రం బట్ల యౌనట్లు త
చ్ఛుంభత్పార్శ్వములందు మధ్యపదముల్ శ్లోకాంత మాద్యాంఘ్రిగా
గంభీరాశయు లి ట్లొనర్తురు పతాకాబంధ మందంబుగాన్

29

హలబంధలక్షణము

మ.

హలకాండంబు యుగంబు సంధిలినచో నారబ్ధమై దాని నే
వలగొంచున్ హలమధ్యమందుఁ బ్రథమంబౌ నంఘ్రి మధ్యాంఘ్రు లా
హలసంధ్యక్షర మాద్యమంత్యముగ నర్ధావృత్తినం దేకనుం
దలక్రిందై ప్రథమాంఘ్రి నొందు హలబంధంబందుఁ దుర్యాంఘ్రియున్

30

దర్పణబంధలక్షణము

ఉ.

స్వర్పతిదేశికార్యులగు సత్కవివర్యులు కార్యధుర్యులై
నేర్పుఁ దలిర్ప వేర్పఱచి నీరజకోశనికాశరేఖలన్
దర్పణరూప మేర్పఱచి దర్పకదర్పహృదర్పణంబు దృ
క్తర్పణముం బొనర్ప నది దర్పణబంధ మగున్ వసున్ధరన్

31

కంకతికా(దువ్వెన)బంధలక్షణము

మ.

కృతికర్తల్ కుతుకం బెలర్పఁ దొలుతన్ రేఖాకృతిం దీర్చి మ
ధ్యతలహ్రస్వము పర్యధఃక్రమ విశాలాగ్రంబునౌ దానిలో
నతిచిత్రంబుగఁ బంచపత్రముల నాద్యంతాంఘ్రులం గూర్చి కం
కతికాబంధ మొనర్తురు న్నవిరుప్రక్కల్ ద్రొక్కి సంధిం జొరన్

32

యోగదండబంధలక్షణము

ఉ.

ఇంచుక నిమ్న మంచుల నొకించుక నమ్రమునైన మౌళిచే
మించిన యోగదండమున మీదుగఁ గ్రిందుగఁ బల్క నర్హతం
గాంచుఁ గవాంఘ్రు లున్నవి సగమ్మునఁ గ్రమ్మరివచ్చు నీగతిం
బంచిన యోగదండమను బంధ మగున్ రచనాచమత్కృతిన్

33

యతిదండబంధలక్షణము

ఉ.

గుంపులదండె నొక్కయడుగుం గొనక్రిందుగఁ గట్టినట్టి ప
ట్టంపుఁబుటంబుఁ జుట్టుచుఁ గడంగడ ముట్టుచు సంధి నొందు న
ట్లింపుగ మధ్యపాదములు నేర్పడఁ దుర్యము నాదిఁ జేర్చి ని
ద్దంపురుచిన్ రచింతు రిటు దండికవుల్ యతిదండబంధమున్

34

కమండలుబంధలక్షణము

చ.

క్రమముగఁ బూర్వఖండమునఁ బ్రాథమికాంఘ్రియు దానియగ్రవ
ర్ణమె మొదటం దుదం బొదల మాళమునన్ సగ మేగివచ్చు పొం
కమున ద్వితీయ ముత్తరపుఖండమునందుఁ దృతీయమాదిసా
త్మ్యమునఁ దురీయ మొపఁగఁ గమండలుబంధ మగుం గుమండలిన్

35

జపమాలికాబంధలక్షణము

ఉ.

మేరుగతాక్షరం బనెడుమేరను మీఱక మీఱు పేరు సం
బేరుపదాఱువర్ణములచే జపమాలికపేరిబంధమై
హారితఁ గాంచు షోడశదళాంబుజబంధమొ ఛత్రబంధమో
యై రుచియించువృత్త మిటులై రచియించుట కర్హతం గనున్

36

గళంతికా(కూజా)బంధలక్షణము

చ.

పొడవగు కంఠనాళమునం బూర్వపదం బుదరంబునందు రెం
డడుగులు నాల్గుబంతులుగ నంతిమమాదిమమందు మీఁదుఁగాఁ
దడఁబడకుండఁ జొప్పడువిధంబునఁ గూర్చి యొనర్చి గనం
బడును గళంతికాఖ్యమగుబంధము గ్రంథముల బ్రసిద్ధమై

37

అంగుళీయకబంధలక్షణము

మ.

సుకవుల్ మెచ్చఁగ షడ్దళాక్షరవృతిన్ శోభిల్లుచున్నట్టి నా
యతరత్నాయితవర్ణమాయితముగా నాద్యంతపద్యుక్తిఁ బా
యక సార్థభ్రమణత్వ మొంది తగుమధ్యాంఘ్రిద్వయం బంగుళీ
యకబంధంబు ననందమొందు జనబృందానందసంధాయియై

38

తాడఘాబంధ-తర్కుబంధ-ముద్గరబంధ-వాశీబంధ-కుతుపబంధ-ఖట్వాంగబంధ-కేళీజలశృంగబంధాఖ్యసప్తకలక్షణము

ఉ.

తాడఘ సుత్తె పెన్కదురు తర్కువు సమ్మెట ముద్గరం బగున్
బాడిత వాశి తైలఘటవాచకమౌఁ గుతుపంబు మంచపుం
గోడు శివాస్త్రభేద మగుఁ గ్రోవి యగున్ జలశృంగ మాఖ్యలం
గూడినరూపు లేర్పఱచి కూర్పఁదగున్ శరబంధవైఖరిన్

39

హారబంధలక్షణము

చ.

దశదళవేష్టనంబున నథస్స్థలలంబిదళాంతరంబునం
గ్రశిమము లేనిమధ్యదళగర్భము న్కొని యాదిమాంతిమాం
ఘ్రీశరణ మౌచు హారమణికీలితశిష్టపదంబు వైనచో
విశదపుహారబంధ మగు విశ్వవిచిత్రమనోహరాకృతిన్

40

కురంగతురంగమతంగజాదిబంధలక్షణము

ఆదిపదముచే ఋక్ష మహోక్ష తరక్షు హర్యాక్షదు లూహ్యంబులు.

చ.

“మొగము గనుల్ సెవుల్ మెడయు మూఁపును వీఁపుఁ బిఱుందు లొందుఁ బొం
దుగఁ బ్రథమాంత్యముల్” “పదచతుష్టయ మొందును శిష్టముల్ నిజా

ర్థగతుల” నిత్తెఱంగునఁ గురంగతురంగమతంగజాదిబం
ధగణము కించిదంచితభిదాగణమై గణుతింపఁగాఁబడున్

41

కాసారబంధలక్షణము

ఉ.

తీరచతుష్టయంబున ద్వితీయతృతీయతురీయతీరముల్
సేరిన మధ్యపాదములచేఁ దొలుతీరము సోపనంబులుం
జేరిన శిష్టపాదము లదే రహిశృంఖల మేరమీఱి కా
సారసమాఖ్యబంధ మగు సారకవుల్ మనసార మెచ్చఁగాన్

42

పాదుకాబంధలక్షణము

శా.

ఛత్రాకారకదారుమస్తకతలస్థంబైన వర్ణంబుతోఁ
దత్తత్యాంగుళిసంగతార్ణములు ప్రాదక్షిణ్యముం జెంది పా
దత్రాణద్వయి నొంది హృద్యమగు పద్యం బేర్పడం గూర్పఁగా
ధాత్రింజిత్రతరుంగాఁ దనరుఁ గాదా పాదుకాబంధమై

43

కర్తరీబంధసందంశబంధలక్షణము

శా.

కీలాద్యగ్రసమాప్తి గాఁగఁ బ్రథమాంఘ్రి న్నిల్ప దుర్యాంఘ్రియం
దే లీనంబగు నాద్యమంత్యమును సంధిస్థాక్షరంబౌ నటుల్
మూలం బంటఁగ జంటగా నడిపదంబుల్ సేరు నీసొరునం
దౌలున్ బంధము లౌచుఁ గర్తరియు సందంశంబుఁ గించిద్భిదన్

44

దీనారబంధలక్షణము

ఉ.

నారసపుంగొనం బెనఁగొనంగ నమర్చినచక్రమందు నా
నారసవేత్త లౌననఁ దనర్చి దశాక్షరి యిష్టపూర్తిఁ జె
న్నార సమగ్రవృత్త మగునట్లుగ నేర్పునఁ గూర్పదీన దీ
నారసమాఖ్యబంధ మగు నారసనారసనాగ్రవర్తియై

45

తులాబంధతులాయనబంధలక్షణము

మ.

రసనాఖ్యాకశలాక నాదిపద మూర్థ్వవ్యాప్తమౌఁ దుర్యమిం
దె సమాప్తం బగుఁ గ్రిందుగా నితరముల్ తిర్యక్ఛలాకాద్వయిం
బ్రసరించుం గవు లి ట్లొనర్తురు తులాబంధంబు తజ్జిహ్వ స్తం
భసృతిం బూన నగుం దులాయనమహాబంధంబు గ్రంథంబులన్

46

కపాలబంధలక్షణము

ఉ.

నయనముఖాక్షివక్త్రములు నాసయు భ్రూయుగమధ్యఫాలముల్
రయముగ బ్రహ్మరంధ్రమును బ్రాక్పద మొందు నదే విలోమగా
మి యగుచు నంత్యపాద మయి మించు శిరోక్షర మాదిగాఁ బరాం
ఘ్రియుగము చుట్టు వార్కొని ముగింపుదు రిట్లు కపాలబంధమున్

47

మణిశాణబంధలక్షణము

చ.

ముఖఫలకంబునం బ్రథమముం బయిదండపు రెండుదండలన్
శిఖరముఁ జుట్టివచ్చుగతి శిష్టపదంబులు రెండు నుండఁగా
లిఖితముఖాంఘ్రిను న్నడుగులీనమగుం దలక్రిందుగాఁగ ని
ట్లఖిలహితంబుగా నిడుదు రార్యమణుల్ మణిశాణబంధమున్

48

పట్టికా(అగసాలివానిపట్టెడ)బంధలక్షణము

చ.

ఉపరితలాశ్రయంబగు నయోఘనమందుఁ బ్రదక్షిణాప్తి నా
ద్యపదము తచ్ఛిరోక్షరమె యాద్యము నంత్యము నౌనటుల్ ద్వితీ
యపదతృతీయపాదములు నాదిపదంబున మీఁదుగాఁగఁ దు
ర్యపదము పట్టికాఖ్య నలరారెడు బంధమునందుఁ బొందగున్

49

వ్యజనబంధలక్షణము

ఉ.

వృంతమునన్ ముఖాంఘ్రి లిఖియించి తదగ్రిమవర్ణ మాదిమం
బంతిమ మౌనటుల్ దళచయంబున మధ్యపదాక్షరంబులన్
బంతిగ వ్రాయఁగాఁ జరమపాదము ప్రాక్పద మొందు నీగతిం
బంతము మీఱఁగా వ్యజనబంధము భవ్యజనుల్ ఘటింపుఁడీ

50

ఘంటాబంధలక్షణము

మ.

పిడి నూర్థ్వాదిగ నాదిపాదలిపులం బెంపొందఁగా వ్రాసి పై
డుగుల్ రెండును రెండుప్రక్కలను ఘంటాకారముఁ జుట్ట నే
ర్పడరంగా లిఖియింపఁగాఁ జరమపాదార్ణంబు లూర్థ్వంబుగా
నడుచుం బ్రాథమికాంఘ్రిరూపమున ఘంటాబంధమం దంటుచున్

51

నాగస్వరబంధలక్షణము

మ.

అతిచిత్రంబుగఁ బూర్వఖండమునఁ బూర్వాంఘ్రిం బొసంగించి సం
ధితలస్థాక్షర మాద్యమంత్యముగ నేంతేనింతగా మధ్యప
ద్ద్వితయం బుత్తరఖండమం దిడఁగఁ దుర్యం బాద్యమై తోఁచు నీ
గతి నాగస్వరబంధమం దమలరం గావింప నర్హం బగున్

52

కాహళబంధలక్షణము

మ.

అల నాగస్వరబంధమందుఁబలె నాద్యాంఘ్రిం బ్రతిష్టించి య
వ్వలిఖండంబున రెండుపాదములు సాఁబాలేగిరా వ్రాయఁగాఁ
దొలియంజం జరమాంఘ్రి గుప్తమగు నీతోయంబుగాఁ జేయఁ గా
హళబంధంబు ప్రబంధకర్తృబిరుదంబౌ యంద మొందుందగన్

53

శంఖబంధలక్షణము

మ.

ఘనశంఖాకృతిగాఁ బ్రదక్షిణపురేఖల్ దీర్చి పూర్వార్ధమం
దు నెఱిం బూర్వపదంబుఁ బైకి నెఱపం దుర్యాంఘ్రియుం గూడ నం
దె నిగూఢం బగుఁ గ్రిందుగా నుపరిసంధిస్థాక్షరం బూఁతగాఁ
జను నర్ధభ్రమకంబు లౌచుఁ బెరయంజల్ శంఖబంధంబునన్

54

శలభబంధలక్షణము

ఉ.

ఆనన లోచనాస్య నయనా వటు పృష్ఠ తదగ్రపృష్ఠ సం
స్థానములందుఁ బ్రాక్పదము తచ్చరమార్ణము రాకపోకలన్
మానక నాల్గుపాదముల మధ్యపదంబులు రెండుఁ దుర్య మా
పై ననులోమతన్ శలభబంధమునం దొలికాలునై తగున్

55

కమఠబంధలక్షణము

ఉ.

ఆదిపదాంత్యపాదముల యక్షరముల్ మఱి మధ్యమాంఘ్రియం
దాదిమతుర్యముల్ చరమ మైక్యము నొందునటుల్ ముఖాక్షికం
ఠాదిగఁ జుట్టివచ్చుగతి నచ్చపువృత్తము కచ్ఛపాకృతిం
బాదుకొనంజుమీ కమఠబంధ మగుం గ్రమగుంభనంబునన్

56

పాఠాంతరము

ఉ.

పాదచతుష్కపుచ్ఛముఖభాసురకచ్ఛపరేఖలందు వ
క్త్రాది గనిష్టవృత్తము మహత్తరయత్నమునన్ లిఖింపఁగాఁ
బ్రోదిగ మస్తకాంఘ్ర్యవటుపుచ్ఛగవర్ణము లేడుమూఁడు సం
వాదములౌ నిదే కమఠబంధ మగున్ జనరంజనంబుగాన్

నిశ్రేణికాబంధలక్షణము

శా.

ఏకాద్యంకము లక్షరాంకములుగా నెక్కించియో యిష్టవ
ర్ణాకీర్ణంబుల గాఁగఁ గూరిచియొ సీసాద్యర్ధపాదాళులం
దేకీభావము నొందఁజేసి యధిరోహిణ్యాకృతిం బండితా
నీకం బెన్నఁగఁ జెప్ప నొప్పు నదియే నిశ్రేణికాబంధమై

57

డోలికాబంధలక్షణము

మ.

రహిమై నుయ్యెలతొట్టెపట్టెకొన లారంభంబు నంతంబుఁగా
ముహురాశ్చర్యకరప్లుతిం బ్రథమ మొప్పుం దత్పదాద్యంతవ
ర్ణహితాద్యంతములై గుణంబులగుఁ దన్మధ్యాంఘ్రు లాద్యాంఘ్రియై
విహరించుం జరమాంఘ్రి గూర్తు రిటు లుర్విన్ డోలికాబంధమున్

58

వీణాబంధలక్షణము

మ.

మృదుభేకప్లుతిఁ బర్వఁ బూర్వపదమున్ మెట్లున్నచో వ్రాసి త
త్పదమూర్ధాక్షర మాద్యమంత్యముగ సాఁబాలేగియో సాగియో
మొదలంటం బొదిగొంచు రా నడిపదంబుల్ వ్రాయఁ బూర్వాంఘ్రియం
ద దువాళించుఁ దురీయపాద మిది వీణాబంధలక్ష్మం బగున్

59

రుద్రవీణాబంధలక్షణము

శా.

సేబా సంచుఁ గవుల్ నుతించుకరణిం జిత్రప్లుతిన్ దండెపై
తాఁ బూర్వాంఘ్రి లిఖింపఁగాఁ జరమపాదం బందులో డిందు నా
లాబుద్వంద్వమునందు మధ్యపదము ల్సంధిల్లెడున్ రుద్రవీ
ణాబంధంబున రెండుపాంత్యలిపులు న్మధ్యాంఘ్రులన్ నిల్పఁగాన్

60

కులాలచక్రబంధలక్షణము

ఉ.

కుమ్మరసారెచందమున గుండ్రనిరేఖలు నడ్డుగీఁట్లు న
బ్రమ్ముగ గీఁసి చిత్రగతిఁ బ్రాక్పద మంతరమందు మధ్యపా
దమ్ములు చుట్టునుం దగువిధమ్మున వ్రాయఁ గులాలచక్రబం
ధమ్మగుఁ దుర్యమాదిమపదమ్మున నేకత నొందుఁ గ్రిందుగాన్

61

లఘుసుదర్శనబంధలక్షణము

ఉ.

నాలుగుపత్రసంధులను నాలుగుపాళ్ళుగ నాదిపాదమున్
నాలుగుపెద్దరేకులను నాలుగుపాళ్ళుగ మధ్యపాదముల్
గ్రాలఁగ నంత్య మాద్యమయి కన్పడు నిన్ను మధ్యవర్ణముం
దౌలు నిదేకదా లఘుసుదర్శనబంధ మటండ్రు పండితుల్

62

వీటికాబంధలక్షణము

శా.

ఆమూలాగ్రముగా సిరాగ్రధితమౌ నాద్యాంఘ్రి మూర్ధాదిగా
ధీమంతుల్ గొనియాడ మధ్యపదముల్ తిర్యక్సిరాసంధులన్
ద్వైముఖ్యమ్మునఁ గ్రుమ్మరుం జరమపాదం బాదిపాదంబునం
దామగ్నం బగుఁ గూర్తు రిట్లు కృతికర్తల్ వీటికాబంధమున్

63

దీనికే లక్షణాంతరము

శా.

ముక్కోణంబుగ నాగవల్లిదళముల్ పూగాదియోగంబునన్
నెక్కోఁజేసి లవంగసంగతముగా నిర్మించి ప్రాక్తుర్యముల్
చక్కంబెట్టి తదాదిగా నడిమియంజల్ చుట్టు రానిల్పఁగా
ముక్కంటిం గొలువంగ నూడిగ మగుం బో వీటికాబంధమై

కళాచికాబంధలక్షణము

ఉ.

గ్రాంథికు లూర్థ్వఖండమునఁ బ్రాక్చరమాంఘ్రులు సంఘటింపఁ ద
త్సంధిని బుట్టి చుట్టి యిరుచక్కుల నెక్కొని మధ్యమాంఘ్రులా
గ్రంథిలమైన తమ్మపడిగమ్మునఁ గ్రమ్మ నగుం గళాచికా
బంధము దేవతాగురుసపర్యకు పర్యుచితోపచారమై

64

ఏకాదశరుద్రమండలబంధలక్షణము

మ.

ఎదుటన్ నాల్గును వెన్క నాల్గిరువులం దేకైకమౌ లింగముల్
పొదలింపం బదునొక్కలింగమ యగుం బో మధ్యలింగంబుతోఁ
బదముల్ నాల్గును మధ్యమాదిగ లిఖింపం జిత్రవిన్యస్తమై
యది యేకాదశరుద్రమండలసమాఖ్యంబైన బంధం బగున్

65

కాలచక్రబంధలక్షణము

మ.

ఘనఘంటానిమిషాదిసూచకశలాకామధ్యరేఖాత్రికం
బునఁ బూర్వాంఘ్రి శలాకికాగ్రలిపులం బోనాడ కిర్వంకలం
బని యర్ధభ్రమకంబుగా నడిమిహజ్జల్ పర్వఁ బూర్వాంఘ్రియం
దనిమగ్నంబగుఁ గాలచక్రమను బంధం బందుఁ దుర్యాంఘ్రియున్

66

నౌకాబంధలక్షణము

మ.

ఇరుకంబంబుల నావనావఱలు గీ ట్లేర్పాటుగా గీఁసి ప్రా
క్చరణంబం దొకపఙ్క్తిగా నెఱపఁగా స్తంభద్వయీమూలగా
క్షరమూలంబుగ వానిపైకి నడియజ్జల్ ప్రాఁకి యేవచ్చుఁ బ్రా
క్చరమాంఘ్రుల్ మిళితంబులౌ నిదియ నౌకాబంధలక్ష్మం బగున్

67

మయూరబంధలక్షణము

చ.

క్షితిఁ బురి విచ్చిన ట్లొకశిఖిన్ లిఖియించి ముఖాక్షరాదిగా
నతులితచంద్రకప్రతతియందుఁ బదత్రితయాశ్రయాక్షర
ప్రతతిని బోలె నాలుగవపాదముఁ బాదములంట వ్రాసి పం
డితులు మయూరబంధ మని దీనికిఁ బే రిడిరారడంబునన్

68

నాసికాముకురబంధలక్షణము

మ.

కుటిలాలంబశలాక నొక్కడుగు తత్కోటిద్వయీవర్ణసం
ఘటితాద్యంతము లౌచు దృఙ్ముకురయుగ్మం బేర్పడం జుట్టి వ
చ్చుట కర్హంబుగ మధ్యపాదములు మించుం దుర్యమాద్యాంఘ్రియై
నటియించుంగద నాసికాముకురబంధం బంచు నందంబుగాన్

69

దీనికే లక్షణాంతరము

ఉ.

దక్షిణవామనేత్రసమదర్పణబింబయుగంబుఁ జుట్టి ప్ర
త్యక్షముగాఁ గనంబడువిధంబునఁ బ్రాక్చరమాంఘ్రులుం దద
గ్రాక్షరముల్ మొదల్ తుదగ నంతరపాదయుగంబు తల్లగ
త్పక్షశలాకలం దిడిసి పర్వ సులోచనబంధమై చనున్

గదాబంధలక్షణము

మ.

గదచందంబున రేఖ లేర్పఱచి తద్గర్భంబునం దొమ్మిదే
గదు లుండం బొదలించి మధ్యకలితాగారంబె యారంభమై
పదముల్ నాల్గును మూల మంటు కరణిన్ వ్రాయంగఁ జిత్రప్లవా
స్పదమై శత్రుభయప్రదం బగు గదాబంధం బదే యౌఁగదా

70

శకటబంధలక్షణము

చ.

నిడుపుగ రెండుదండెలుగ నిల్పినరేకల కడ్డురేకు లా
ఱిడి నడిపట్ల నైదునయిదిండ్లుగ నుండలు రెం డమర్చి రెం
డడుగులనుండలందు నడియంజలరేకులయందు సంధిచొ
ప్పడ నడపించుచున్ శకటబంధముగాఁ బ్రకటింత్రు సత్కవుల్

71

సూక్ష్మగవాక్షబంధలక్షణము

చ.

అల చదరపుంగదుల నంఘ్రలు నాల్గును శృంఖలాకలన్
నలుదెసలం దిడంగ నడినాల్గులిపుల్ తుదలున్ మొదళ్ళుఁగాఁ
దలరం దొడంగి క్రమ్మఱఁ బదమ్ములు నాల్గుఁ గడంగి తుండతుం
డలుగ నడంగఁ దానది బెడంగగు సూక్ష్మగవాక్షబంధమై

72

చిత్రవితానబంధలక్షణము

చ.

చదురున నెన్మిదెన్ముదులచక్రపుటిండ్లకు నాల్గుచక్కులం
బదములు నాల్గుజాలరులభాతి లిఖించి తదంతరాళపుం
గదులఁ దదాదికోణములఁ గ్రమ్మఱఁ బ్రాక్చరమాంఘ్రు లాదులం
ట దుముకఁగూర్చి సత్కవివితానము చిత్రవితానబంధమున్

73

అల్పాష్టాపదబంధలక్షణము

శా.

కల్పింపంబడినట్టి నెత్తపలకన్ గర్భాదిగా నిండ్లలో
నిల్పంగాఁ దగు నర్ధపాదములుగా నిండైనపద్యంబు ని
ట్లల్పాయాసమనల్పకల్పనమునై యష్టాపదప్రాప్తిచే
నల్పాష్టాపదబంధ మేర్చుఁ జతురుం డష్టాపదప్రాప్తికిన్

74

ఉత్తరదేశగ్రహచక్రబంధలక్షణము

మ.

సరిగా నల్చదరంపుఁజక్రము విదిక్చక్రంబు తన్మధ్యమం
దురుచక్రంబున మూలమూలలకు రెండుద్ధారముల్ గీఱి త
చ్చరణద్వాదశకంబునం జరణముల్ సంధిల్ల హత్తింప ను
త్తరదేశగ్రహచక్రబంధమగుఁ బద్యంబండె వేద్యం బగున్

75

సవ్యగ్రహచక్రబంధలక్షణము

ఉ.

జాగ్రదిరాసమగ్రులయి చాలుగ నాలుగు నాల్గు నిల్వుగా
నగ్రియులెన్న మధ్యములయందు నొకొక్కఁడు నైనరేఖలన్
విగ్రహ మేర్పరించి పదవిన్యసనం బొనరింతురేని స
వ్యగ్రహచక్రబంధ మగు ద్వాదశరాశినివేద్యపద్యమై

76

నందికేశ్వరబంధలక్షణము

ఉ.

పుంగవరీతి గీఁత లిడి మోరమొదల్కొని తోఁకదాఁక సొం
పుంగ వనంపుఁబెంపుఁ బెనుపుంగవదాఁటులనీటు లబ్బురం
పుంగవణింపులాదిగల భూరిచమత్కృతు లున్నతిన్ సుధీ
పుంగపు లెన్న నిట్లు సలుపుం గవి సుందరనంధిబంధమున్

77

కేయూరబంధలక్షణము

మ.

క్రమతన్ నాయకరత్నవర్ణముమొదల్గాఁ జుట్టు నున్నట్టి శ
స్తమణిస్థానములందుఁ బ్రాక్చరమపాదంబుల్ ప్రవేష్టింప మ
ధ్యమవర్ణాదిగ మధ్యపార్శ్వముల మధ్యాంఘ్రుల్ ప్రతిష్టింపఁ జ
క్రిమహేశాదిసురార్హణార్హ మగుచుం గేయూరబంధం బగున్

78

నాగాభరణబంధలక్షణము

ఉ.

అంగజభంగలింగమున నాదిమ ముంచి తదాదిగా భుజం
గాంగమునందుఁ బ్రాక్పద మనంతరపాదము లుత్తమాంగప
ఙ్క్తిం గవి యిచ్చవచ్చినగతిన్ శకలంబులుగా లిఖించి యి
బ్భంగి భుజంగమాభరణబంధ మొనర్చుఁ దనర్చు నేర్పునన్

79

బిల్వదళబంధలక్షణము

ఉ.

మధ్యదళంబునందుఁ బ్రథమంబగు నంఘ్రియుఁ బ్రక్కఱేకులన్
మధ్యపదద్వయంబునుఁ జమత్కృతిమించ లిఖించి వృంతమె
దధ్యుషితంబుగా నిడిన నంతిమమాదిమందుఁ జేర్చినన్
బాధ్యముగాదు బిల్వదబంధము సంధిచతుష్పథంబుగాన్

80

పంచకోణ-షట్కోణ-యంత్రబంధలక్షణములు

చ.

అలయకు కోనులైదయిన నాఱయినం గలయంత్రరేఖలన్
వలయమునం దమర్చి ముఖివర్ణముఁ గర్ణికయందుఁ జేర్చి త
ద్దళముల నొక్కటొక్కటిగఁ దక్కటివ్రాలిడ నొక్కవృత్తమై
భళిభళి కోణసంజ్ఞ నది బంధ మగున్ నడివ్రాయిసంధిగాన్

81

గురుసుదర్శనబంధలక్షణము

ఉ.

ద్వాదశపత్రముల్ గలుగువర్తులరేఖ లిఖించి వృత్తపుం
బాదచతుష్కభిత్తములు వ్రాయఁగఁ గర్ణికనున్న వర్ణమే
కాదు తతాదివర్ణము నొకండయి కన్పడుచుండు దేనిలోఁ
దాదృశబంధమే గురుసుదర్శనబంధ మగు న్వసుంధరన్

82

మహాసుదర్శనబంధలక్షణము

శా.

పద్యద్వాదశఖండమండలమునం బ్రత్యాదివర్ణద్వయం
బాద్యంతాక్షరయుగ్మకం బభిమతాయత్తంబులై వృత్తరే
ఖోద్యద్ద్వాదశఖండమండలమునం దొప్పారఁ జొప్పింప ని
ష్పాద్యంబై పొదలున్ సుదర్శనమహాబంధంబు గ్రంథంబులన్

83

వరదముద్రాభయముద్రాబంధద్వంద్వలక్షణము

మ.

కరిమధ్యాక్షర మాద్యమంత్యముఁగ శ్లోకంబంగుళీపంచక
స్ఫురితంబౌగతి ఖండఖండములుగాఁ బూర్వాంఘ్రులన్ వ్రాయఁగాఁ
జరమంబాద్యమున్ విలోమగతిచే సంధిల్లుఁ బ్రత్యేకము
న్వరదానాభయదానముద్రలను బంధద్వయ మి ట్లేర్పడున్

84

కిరీటబంధలక్షణము

మ.

క్రమతన్ బంతులు దొంతులై తనర నేకద్విత్రిషడ్గేహముల్
కమనీయాకృతిఁ జేర్చి చిత్రగతి నగ్రంబాదిగా మూడుపా
దములం జేర్పఁగ నాద్యవేద్యమగునంత్యం బిట్లు గూర్పం గిరీ
టమహాబంధ మగుం గవీష్టము బలిష్టం బన్యథా సృష్టికిన్

85

దర్దురతాళబంధలక్షణము

మ.

ముఖకీలాజగ మూలకీలములలో ముఖ్యాంత్యపాదంబులున్
శిఖరాభ్యంతరతోరణాకృతిగఁ దృచ్ఛంగోర్థ్వతుండాకృతిన్
లిఖియింపందగు మధ్యపాదయుగ మీలీలం బ్రకల్పించినన్
సుఖవేద్యంబయి తాళబంధమన మించున్ దర్దురాకారమై

86

కుంచికాబంధలక్షణము

ఉ.

బంధురనాళమందుఁ దొలిపాదము వ్రాసి తదగ్రవర్ణమే
సంధిగ మధ్యపాదములు చక్రమునం దిడ నంత్యమాద్యమై
సంధిలుఁ బ్రాతిలోమ్యగతిసంగతి నీగిత మించుఁ గుంచికా
బంధము గ్రాంథికుల్ దమప్రబంధములం బచరింత్రు వింతగాన్

87

ద్వాత్రింశద్దళపద్మబంధలక్షణము

శా.

పత్రంబుల్ పదియాఱులోపలఁ బయిం బత్రంబు లామాత్రమే
పాత్రం బౌనటు వ్రాసి సీసము లిఖింపం గేసరాగ్రంబులం
బత్రాగ్రంబులనున్న వర్ణములచేఁ బద్యాంతరంబౌ నిదే
ద్వాత్రింశద్దళపద్మబంధము బ్రబంధశ్రీకి సద్మం బగున్

88

సింహాసనబంధలక్షణము

చ.

జలధికరేందుహస్తయుగసద్మము లేర్పడునట్లు నేర్పునం
జెలువగు రేఖలం గలిపి సింగపుగద్దియ దిద్దితీర్చిన
ట్లరిచి బల్విచిత్రగతి నంఘ్రులు నాల్గును బూని దానిలో
పల నిమిడింపఁగా నదియ భాసిలుఁ గేసరిపీఠబంధమై

89

దీపబంధలక్షణము

శా.

దుర్ధ్వాంక్షక్రమరారటత్కుకవిసందోహస్మయాగాంబుద
ద్వార్ధ్వానప్రపత్స్వరూక్తిసుకవివ్యక్తీకృతాకారమై
యూర్ధ్వాథఃపఠనీయరీతిఁ జరణవ్యూహంబు నెక్కొల్ప నం
తర్ధ్వంతక్షపణక్షమం బగుచు నుద్యద్దీపబంధం బగున్

90

వల్మీకబంధలక్షణము

మ.

శిరముల్ నాల్గు క్రమోన్నతంబులగు వాసిన్ వ్రాసి యైదేసి మం
దిరముల్ గల్గునటుల్ ఘటించి ప్రతిపఙ్క్తిం బద్యపాదంబుల
క్షరవిన్యాసచమత్క్రియాస్పదముగా సంధింపఁగా వచ్చు న
వ్వరుసల్ పెంచినఁ బెంచవచ్చు నదియే వల్మీకబంధం బగున్

91

లఘునాగబంధలక్షణము

చ.

కుసుమశరార్చిచేఁ బెనచికొన్న సమున్నతపన్నగంబుల
ట్లసదృశరేఖల న్నెరపి యందలిసంధులనున్న వర్ణముల్
కొసదనుక న్సమంబులుగఁ గూర్చి విచిత్రగతిన్ లిఖింపఁగా
రసికజనాద్భుతం బగుచుఁ గ్రాలు నదే లఘునాగబంధమై

92

యాత్రికబంధలక్షణము

ఉ.

కాశికిఁ బోయి గంగఁ గొని కావడియం దిడివచ్చువానిరూ
పాశయ మొప్ప వ్రాసి యట నంఘ్రులనంఘ్రులు రెండు కంధరా
దేశగవర్ణమాదిని మదిం దగురీతిగ మధ్యమాంఘ్రులుం
గౌశల మొప్పఁ గావడిని గల్పఁగ యాత్రికబంధమై తగున్

93

ద్విశరచాపబంధలక్షణము

చ.

చతురత రెండురోపముల చాపము రూపము వ్రాసి తచ్ఛర
ద్వితయమునందుఁ బ్రాక్చరమవృత్తపదద్వితయంబు సంధిసం
గతలిపు లాదులుందుదలుగా గుణచాపములం దదన్యముల్
జతగ లిఖింపఁగా ద్విశరచాపసమాహ్వయబంధమై తగున్

94

మత్స్యబంధలక్షణము

మ.

నలుపక్షంబులు పుచ్ఛముం గలుగు మీనవ్యక్తిఁ గల్పించి త
జ్జలవిక్షేపణపక్షగాక్షరచతుష్కం బాదిమాంత్యాక్షరం
బులుగాఁ బాదచతుష్టయం బిటునటుం బొంకంబుగాఁ బోయిరాఁ
గలబింకంబున నందు వ్రాయ నది సాక్షాన్మత్స్యబంధం బగున్

95

గణికాబంధలక్షణము

మ.

నిటలంబాది కటీతటంబు తుదగా నేర్పొప్ప నాద్యాంఘ్రియుం
బటువక్షోజఘనాక్షరంబు లట సంవాదిత్వ మొందన్ నట
న్నటికాపాణిపదంబులందు నుపనంత్యంబాద్యమై మీఁది కు
ద్భటవృత్తిన్ నటియించునేని గణికాబంధంబు సంధిల్లెడున్

96

ఉపాంగబంధలక్షణము

ఉ.

ఆదిమమాదినాళమున నంతిమమంతిమనాళమందుఁ బై
పాదయుగంబు భస్త్రికిరుప్రక్కలయం దిడి క్రిందినిండిఁ దా
మీఁదికిఁ బల్కినన్ సమత మెప్పు వహింపగ నొప్పువృత్త మా
హ్లాదముఁ బొంగఁజేయుచుఁ జెలంగు నురంగదుపాంగబంధమై

97

ఉపధానబంధలక్షణము

మ.

ఘనకూష్మాండసమంబుగా జమిలిరేఖల్ దీర్చి యెందుండి బ
ల్కిన నేకాకృతిగాఁ గనఁబడెడు పోల్కెంబద్దియం బెద్దియై
ననుద్రేఖలయందు వ్రాయ నది యానందంబు నొందించుదా
ని నభిజ్ఞుం డుపధానబంధమని సంధించుం బ్రబంధంబునన్

98

పేటికాబంధలక్షణము

ఉ.

మూతికి మూఁతకున్ సరిగ ముఖ్యపదంబు లిఖించి దానిత
ర్వాతిపదంబులం జివరవర్ణము లాద్యములంతిమంబులౌ
భాతిని ప్రక్కలన్ నిలుపఁ బ్రాక్చరమైక్యము గల్గి పేటికా
ఖ్యాతిని బొందు బంధమయి గ్రంథములందది గ్రంథిలంబగున్

989

కళాచికా(ఝారీ)బంధలక్షణము

శా.

భృంగారంబున కూర్థ్వరంగము బహిశ్శృంగం బథోరంగమున్
శృంగారించి రనంగ మూఁడడుగులం జిత్రప్లుతిన్ వ్రాయఁగా
బంగారంబునఁ జిత్రభంగి నలరుం బైయంఘ్రి పూర్వాంఘ్రియై
పొంగారుం గన కాలుకాహ్వయమునం బొల్పొందు బంధంబునన్

100

పటీరకుటీర(చందనపాత్రము)బంధలక్షణము

ఉ.

క్రమముగఁ బీఠనాళములఁ బ్రాథమికాంఘ్రి తదుర్థ్వపార్శ్వపా
త్రములను మధ్యమాంఘ్రులు శిరశ్చషకంబున నంతిమాంఘ్రి గూ
రిమి దళుకొంద వ్రాసి తలక్రిందుగఁ బల్కినఁ బల్కవచ్చు సు
చ్చమహిమఁ దెచ్చుఁ గర్త కది సారపటీరకుటీరబంధమై

101

ధూపబంధలక్షణము

ఉ.

మస్తకపాత్రమందుఁ బ్రథమంబగు నంఘ్రి లిఖించి తద్గళ
న్యస్తశుభాక్షరంబ మొదలై తుదయొ తగునట్లు పర్యధో

వ్యస్తశరాకలన్ నడిమిపాదము లుంచఁగ నంత్యమాద్యమై
నిస్తులధూపబంధమయి నివ్వటిలుం గృతులం జమత్కృతిన్

102

నీరాజనబంధలక్షణము

ఉ.

రాజితవిగ్రహాంజలిని బ్రాథమికాంఘ్రియుఁ దద్భుజద్వయిం
దేజరిలన్ ద్వితీయము తృతీయము బింబమునం దురీయమున్
భ్రాజితరీతి వ్రాయు నది పాదమునుండియుఁ బల్కఁజాలి నీ
రాజనబంధ మౌను ద్విజరాజకిరీటసమర్హణార్హమై

103

మంత్రపుష్పబంధలక్షణము

ఉ.

ప్రహ్వత గల్గి వృంతమునఁ బ్రాక్చరణంబు లిఖించి మధ్యముల్
బహ్వభిరామపుష్పదళపఙ్క్తులలోపల వ్రాయఁ దుర్యమున్
జిహ్వకుఁ బల్క రుచ్యమయి చేరును బ్రాక్చరణంబు మంత్రపు
ష్పాహ్వయబంధమం దది శివార్చనయం దుపచారమై తగున్

104

ప్రదక్షిణనమస్కారబంధలక్షణము

ఉ.

అంజలిబంధమందుఁ బ్రథమాంఘ్రి భుజంబులమధ్యమాంఘ్రులు
న్రంజితనంత్యవిగ్రహమునం జరమాంఘ్రియు వ్రాసిపల్కఁగా
నంజలనుండి పైపయికి నంజలిదాఁకఁ దదేకవృత్తమై
మంజలుమౌఁ బ్రదక్షిణనమస్కృతిబంధము ధీపురస్కృతిన్

105

విమానబంధలక్షణము

చ.

శిఖరగతత్రిశూలమునఁ జేర్పఁదగుం బ్రథమాంఘ్రి తద్ఘటీ
లిఖితశుభార్ణ మాదియగులీలను బ్రక్కల మధ్యమాంఘ్రులున్
సుఖగతి వ్రాయఁ దొంటిక్రియసోపానముల్ ముఖభిత్తిహత్తి త
న్నఖిలము మెచ్చ నంతిమమె యాదిమ మౌను విమానబంధమై

106

కైలాసమహాద్రిబంధలక్షణము

ఉ.

భాసురశృంగభాగములఁ బ్రాథమికాంఘ్రి లిఖించి ప్రక్కలన్
వ్రాసిన మధ్యపాదములవ్రాలు మొదల్ తుదగాఁ దురీయ ము
ల్లాసము మీఱవ్రాయఁగఁ జెలంగు విలోమతనైనఁ బల్కఁ గై
లాసమహాద్రిబంధము విలాసకలాసరసానుబంధమై

107


గద్యప్రతినిధిగీతపద్యము

గీ.

శ్రీకవిత్వమండన మండపాక పార్వ
తీశవిరచితషడశీతికృతులలోఁ “బ్ర
బంధమంబంధబంధనిబంధనంబు”
నాఁగఁ దగుగ్రంథమునఁ బూర్వభాగ మయ్యె

శ్రీశివార్పణమస్తు

శ్రీరస్తుశ్రీః

This work was published before January 1, 1930, and is in the public domain worldwide because the author died at least 100 years ago.