ప్రపంచ చరిత్ర/హెల్లనీలు

వికీసోర్స్ నుండి

ముగా ప్రవహించుచున్న గంగానదీతీరమును వారు హఠాత్తుగా చేరుట తలచుకొనుము. గంగానదీతీరదర్శనము వారికెంత ప్రమోదమునుగూర్చినదో ! గంగానదికి వారు ప్రణమిల్లిరన నాశ్చర్యమేమి ? సమృద్ధము, శ్రావ్యమునగు వారిభాషతో స్తుతించిరన నాశ్చర్యమేమి ?

ఈ యుగములకు వారసుల మనుకొనుట ఎంత గొప్పగానున్నది! గాని మనము దురహంకారము చెందరాదు. ఈ యుగములకు వారసుల మన్నప్పుడు మంచికిని వారసులమే, చెడ్డకును వారసులమే. ఇండియాలోని ఈ మన వారసత్వపు ఆస్తిలో చెడుగు చాల చేరినది. ప్రపంచములో మన మధమస్థానమున నుండుటకది కారణము, దివ్యమగు మనదేశము దారిద్ర్యములో పడిపోవుట కది కారణము. మన దేశ మితరులచేతులలో ఆటబొమ్మ యగుట కదికారణము. ఈ పరిస్థితు లిక ముందు ఎంత మాత్రము సాగకూడదని మనము నిశ్చయించుకొంటిమి కాదా?

6

హెల్లనీలు

జనవరి 16, 1931

ఈరోజున నన్ను చూచుటకు మీ రెవ్వరును రాలేదు. ములాకత్ - కాదీన్ వట్టి శుష్కదిన మైపోయినది. నాకాశభంగమైనది. సమావేశ మిప్పుడు జరుగక ఇంకొకమారు జరుగుననుట కిచ్చిన కారణము విచారకరముగా నున్నది. తాత కులాసాగాలేరని మాకు తెలిసినది. ఇక ఈరోజున సమావేశము జరుగదని తెలిసికొని నా రాటమువద్దకు వెళ్ళి కొంతసేపు వడకితిని. నేను అనుభవమువల్ల తెలిసికొనిన విషయ మేమనగా - రాటముమీద నూలువడకుట, నవారునేయుట మనస్సున కానందమును, ఊరటను కల్పించునని. కాబట్టి సంశయాత్మ వైనప్పుడు నూలువడకుము. వెనుకటి జాబులో యూరోపు, ఆసియాల భేదసాదృశ్యములను గమనించితిమి. ప్రాతయూరోపును – ఒకమారు కొంచెము చూతము. చాలకాలమువరకు యూరోపనగా మధ్యధరాసముద్ర ప్రాంతములందున్న దేశములనియే యభిప్రాయము. ఆ రోజులలో యూరోపు ఖండమందలి యుత్తరదేశములనుగూర్చి చెప్పు ఆధారము లేమియులేవు. జర్మనీ, ఇంగ్లాండు, ఫ్రాంసు దేశములలో అనాగరికజాతులు నివసించుచుండిరని మధ్యధరాసముద్రప్రాంత జనులు ఊహించుచుండిరి. అసలు ప్రారంభమున, నాగరీకము తూర్పు మధ్యధరా ప్రాంతములలోనే నెల కొనినదని యూహింపబడుచున్నది. ఈజిప్టును (ఇది ఆఫ్రికాలోనున్నది సుమా, యూరోపులో కాదు.) క్నోస్సోసును ప్రపథమమున ముందంజ వేసిన దేశములు. క్రమక్రమముగా ఆసియా నుండి ఆర్యులు పడమటి దిక్కునకు బహుసంఖ్యాకులుగా వచ్చిపడి, గ్రీసుమీదను, సమీపదేశముల మీదను దండయాత్రలు సాగించిరి. వీరే ఆర్యులగు గ్రీకులు. వీరినే మన మెరుగుదుము. ప్రాచీన గ్రీకులని మెచ్చుకొనుచున్నాము, బహుళా అంతకుముందు ఇండియాలో ప్రవేసించిన ఆర్యులకును, వీరికిని మొదట అధిక భేదములు లేవని నే ననుకొందును. తరువాత భేదములు ప్రవేశించి యుండవలెను. క్రమక్రమముగా ఆర్యుల ఈ రెండు శాఖలును అంతకంత కెక్కువగా వేరుపడిపోయినవి. అప్పటికే ఇండియాలోనున్న, అంతకన్న ప్రాచీనమైన, నాగరికత ఇండియాకువచ్చిన ఆర్యులపై తన ప్రాభవమును చూపినది. అది ద్రావిడుల నాగరికత కావచ్చును. లేదా మొహెంజోదారో వద్ద నేడు మనము చూచు శిథిలములకు సంబంధించిన నాగరీకావశేషము కావచ్చును. ఆర్యులు ద్రావిడులనుండి ఎన్నో విషయములు నేర్చు కొనిరి. వారి కెన్నో విషయములు నేర్పిరి. అట్లే ద్రావిడులు ఆర్యులనుండి ఎన్నో విషయములు నేర్చుకొనిరి. వారి కెన్నో విషయములు నేర్పిరి. ఈ విధముగా వా రుభయులునుకలిసి ఉమ్మడిగా ఇండియాలో విజ్ఞానమును సృష్టించిరి. ఇట్లే ఆర్యగ్రీకులు గ్రీసుకు వచ్చినప్పుడు అచ్చట క్నోస్సోస్ యొక్క ప్రాచీన నాగరికత వర్దిల్లుచున్నది. వారిపై ఈ నాగరికత తన ప్రభావము నధికముగా చూపియుండవలెను. అయినను, వారు క్నోస్సోసును నాశనముచేసిరి. దాని బాహ్యనాగరికతను హెచ్చుభాగము నాశనముచేసిరి. దాని శిథిలములపై తమ నాగరికతను నిర్మించుకొనిరి. ఆ రోజులలో ఆర్య ఇండియనులును, ఆర్య గ్రీకులును మోటుగా నుండి రనియు, యుద్ధప్రవీణులనియు మనము జ్ఞాపకముంచుకొనవలెను. వారు వీర్యవంతులు. వారికి తటస్థించిన దేశములో ఎక్కువ నాగరీకులైన ప్రజలుండి వారు మెత్తనివారైనచో వారిని నాశనము చేయుచుండిరి. లేదా వారిని తమలో కలుపుకొనుచుండిరి.

క్రీస్తు పుట్టుటకు సుమారు 1000 సంవత్సరముల ముందు క్నోస్సోస్ నాశనముచేయబడెను. క్రొత్తగా వచ్చిన గ్రీకులు గ్రీసులోను, తత్ప్రాంత ద్వీపములలోను స్థిరనివాసము లేర్పరుచుకొనిరి. సముద్ర మార్గముగుండా ఆసియామైనరు పశ్చిమతీరమునకును, దక్షిణ ఇటలీకిని, సిసిలీకిని. ఫ్రాంసు దక్షిణమునకు సైతము వారు వెళ్ళిరి. ఫ్రాంసులోని మార్సైల్సు పట్టణమును వారు స్థాపించిరి. కాని బహుశా వారు వెళ్ళు టకు ముందే ఫొనీషియను లచట నివాస మేర్పాటుచేసికొని యుందురు. నీకు జ్ఞాపకమున్నదో లేదో.. ఫొనీషియనులు ఆసియా మైనరులోని ఒక గొప్ప నావికజాతివారు. వర్తకమునకై వారు నాలుగు దిక్కులకు వెళ్లు చుండిరి. ఇంగ్లాండు అనాగరిక దేశముగానున్న ఆ రోజులలో, జిబ్రాల్టరు జలసంధి ద్వారా పోవుట ప్రమాదకరమైనప్పటికిని, వారు ఇంగ్లాండు సైతము చేరిరి.

గ్రీసు దేశములో ప్రఖ్యాత నగరములు వెలిసినవి : ఏథెన్సు, స్పార్టా, థీబ్సు, కోరింత్. గ్రీకులనే హెల్లనీ లందురు. వారి తొలినాళ్ళ ముచ్చటలు రెండు మహాకావ్యములలో వర్ణింపబడినవి. అవి "ఇలియడ్" “ఓడిస్సె" అను పేర్లుగలవి. వీనిని గురించి నీకు కొంచెముగా తెలియును గదా. అవి మన రామాయణ మహాభారతములవంటివే. అంధకవియగు హోమరు వానిని రచించెను. పారిస్ అనువాడు హెలెన్ అను సుందరిని తన పట్టణమైన ట్రాయికి కొంపోయినట్లును, గ్రీకురాజులును, ప్రముఖులును ఆమెను తిరిగి వశపరుచుకొనుటకు ట్రాయిపట్టణమును ముట్టడించి నట్లును ఇలియడ్ చెప్పుచున్నది. ఒడిసస్(యులిసస్) అనువాడు ట్రాయి ముట్టడినుండి తిరిగివచ్చుచు చేసిన ప్రయాణములను "ఒడిస్సె" వర్ణించు చున్నది. ఆసియామైనరులో, తీరమునకు సమీపమున నీ ట్రాయి పట్టణ ముండెను. ఇప్పుడదిలేదు. ఆది అంతరించి యెంతోకాలమైనది. కానీ ఆ కవిప్రతిభ దాని కమరత్వ మిచ్చినది.

హెల్లనులు (గ్రీకులు) త్వరత్వరగా (కొద్దికాలమే నీలిచిన) ఉచ్చస్థితి నందున్న కాలములో వేరొకజాతి చల్లగా తలయెత్తుచుండెను, తరువాత ఆ జాతి గ్రీసును జయించి దానిస్థానము నాక్రమించెను. ఈ కాలమునందే రోముపట్టణము ప్రతిష్ఠింపబడినదని చెప్పుదురు. ప్రపంచరంగమున పలువందల సంవత్సరములవరకు అది ముఖ్యపాత్రను ధరించలేదు. కాని శతాబ్దులకాలము యూరోపులో అగ్రస్థానము పొంది "ప్రపంచలక్ష్మి" యనియు, “శాశ్వత నగర" మనియు పేరొందిన గొప్ప నగరముయొక్క జనన వృత్తాంతమును మునము చెప్పుకొనక తప్పదు. రోముప్రతిష్ఠనుగూర్చి వింత కతలను చెప్పుదురు రీమస్, రోములస్ అను ఇద్దరు శిశువులను ఒక ఆడుతోడేలు తీసికొనిపోయి పెంచినట్లును, వారు రోమును ప్రతిష్ఠించినట్లును, ఇత్యాదిగా. నీ కా కథ తెలియునేమో!

రోమునగరమును నిర్మించినప్పుడో, అంతకు కొంచెముముందో వేరొక నగరము నిర్మించబడినది. దీని పేరు కార్తేజీ. ఇది ఆఫ్రికా ఉత్తర తీరమందున్నది. దీనిని ప్రతిష్ఠించినది ఫోనీషియనులు, నముద్రముపై అధికారము చలాయించు గొప్పజాతిగా అది యభివృద్ధిచెందినది. దానికిని రోమునకును తీవ్రస్పర్ధలు చెలరేగినవి. యుద్ధము లెన్నో జరిగినవి. చివరకు రోముజయమునందినది. కార్తేజిని మూలమట్టుగ నాశనము చేసినది.
ఈ దినమున విరమించుటకు ముందు పాలస్తీనా నొక్కమారు సంగ్రహముగా చూతము. పాలస్తీనా యూరోపులో లేదు. చారిత్రక ప్రాముఖ్యము దానికి ఎక్కువలేదు. కాని బైబిలులోని ప్రాతనిబంధనలో ఉండుటచే పలువురకు దాని ప్రాచీనచరిత్రపై ఇష్టము. ఈ చిన్న ప్రదేశములో నివసించిన యూదులలోని కొన్ని జాతులను గురించియు, వారి కిరుప్రక్కల పొరుగుననుండు ప్రబలులవల్ల వారు పొందిన కష్టములను గురించియు ఆందు వర్ణింపబడెను. ఆ పొరుగువారు - బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్టు, యూదులయొక్కయు, క్రైస్తవులయొక్కయు మతములలో ఈ కథ ప్రవేసింపకున్నచో దాని సంగతి ఎవరికిని తెలిసెడిది కాదు.

ఇస్రాయేలు పాలస్తీనాలో ఒక భాగము, క్నోస్సోస్ నాశనమైన కాలమున ఇస్రాయేలుకు రాజు సాల్ అనువాడు. తరువాత డేవిడ్. ఆ తరువాత సోలమెన్ రాజులైరి. సోలమన్ విజ్ఞాని యని పేరొందెను . ఈ మూడు పేళ్ళను ఉదహరించుటకు కారణము నీపు వానిని గురించి విని యుండవచ్చును. లేదా చదివి యుండవచ్చును అని.


7

గ్రీకుల నగర రాజ్యములు

జనవరి 11, 1931

వెనుకటిజాబులో గ్రీకులను (హేల్లనీలు) గురించి కొంత చెప్పితిని. వారి నింకొకమారు చూచి వారెట్టివారో తెలిసికొందము. మన మెప్పుడునుచూడనివారిని గురించిగాని, వస్తువులను గురించిగాని సరియైన, యధార్ధమైన అభిప్రాయము మనకు కలుగుట మిక్కిలి కష్టము. మనము ప్రస్తుత పరిస్థితుల కలవాటు పడియున్నాము. మన బ్రతుకు వేరు. ఇట్టి మనము పూర్తిగా భిన్నముగా నున్న ప్రపంచము నూహించుకొనుట కష్టము. ప్రాచీనప్రపంచము. ఇండియాకాని, చీనాగాని, గ్రీసుకాని. నేటి ప్రపంచమునకు పూర్తిగా భిన్నముగా నుండును. మనము చేయగలిగిన