Jump to content

ప్రపంచ చరిత్ర/ప్రాతనాగరికతలు : మన వారసత్వము

వికీసోర్స్ నుండి

తత్త్వజ్ఞుల పేళ్ళతో పేజీలు నింపవచ్చును. ఆసియాలోని కార్యవాదుల పేళ్ళతోకూడ పేజీలు నింపవచ్చును. ప్రాతకాలములో ఈ మన ప్రాతఖండము ఎంత గొప్పగా, వీర్యవంతముగా నుండెడిదో ఇంకను అనేక విధములుగా నేను చెప్పగలను.

కాల మెట్లు మారినదో ! మన కన్నులయెదుట కాలము మరల మారుచున్నది. సామాన్యముగా శతాబ్దులగుండ చరిత్ర మెల్లగాపనిచేయుచు పోవును. అప్పుడప్పుడు తొందరగా పోవుట, ఉత్పాతము పుట్టుటకూడ కద్దు. అయినను నేడు ఆసియాలో అది తొందరగా పోపుచున్నది. - ధీర్ఘ నిద్రనుండి ఈ ప్రాతఖండము మేల్కొనుచున్నది. ప్రపంచము దానిని పరికించుచున్నది. ఎందుకనగా భావికాలమున ఆసియా ప్రాముఖ్య మధికముగా వహింపబోవుచున్నదని యందఱికిని తెలియును,

5

ప్రాతనాగరికతలు : మన వారసత్వము

జనవరి 9, 1931

వారమునకు రెండుసారులు బాహ్యప్రపంచవర్తమాసములు కొన్ని హిందీవార్తాపత్రికయగు “భారత్" మాకందిచ్చుచుండును. మలక్కా చెరసాలలో అమ్మను సరిగా చూచుటలేదని నిన్న ఆ పత్రికలో చదివితిని. నాకు కొద్దిగా కోపము వచ్చినది. మనస్సు వికలమైనది. " భారత్ "లో ప్రకటించిన వదంతి యథార్థము కాదేమో? దానినిగురించి సందేహములో పడుటకూడ మంచిది కాదు. ఆత్మార్థము, బాధ, ఇబ్బంది సహించుట సులభమే. అది అందఱికిని మంచిదే. లేకున్న మనము మరీ మెత్తని మనస్సుకల వారమగుదుము. ప్రేమాస్పదులగు మనవారు పడుచున్న బాధలను తలచుకొనుట - అందు ముఖ్యముగా మన మేమియు చేయలేని స్థితిలో నున్నప్పుడు సులభమునుకాదు, సుఖకరమునుకాదు. “భారత్" పత్రిక చదువుటవల్ల నామనస్సులో పుట్టిన సందేహమువల్ల అమ్మను తలచుకొని వ్యాకులపడుచున్నాను. ఆమె ధీరురాలు: ఆడుసింహముహృదయమువంటి హృదయమామెది. కాని యామె దుర్బలశరీర . ఆమెశరీరము మరీ దుర్బలమగుట నా కనిష్టము. మనమెంత వజ్రహృదయులమైనప్పటికి, మన శరీరములు దుర్బలముగా నున్నప్పుడు మనమేమి చేయగలము ? ఏ కార్యమునై నను చక్కగా చేయవలెనన్న మన కారోగ్య ముండవలెను. బల ముండవలెను. దృఢకాయము లుండవలెను. -

అమ్మను లక్నో పంపించుదురట. అది మంచిదే యని తోచుచున్నది. అక్కడ ఆమెకు సదుపాయము లెక్కువగా ఉండవచ్చును. సుఖముగా ఉండవచ్చును. లక్నో చెరసాలలో సహచరులు కొంద రుందురు. మలక్కాలో ఆమె బహుశా ఒంటరిగా నున్నదికాబోలు. అయినప్పటికిని ఆమె దూరముగా లేదుగదా యని యనుకొనుట సంతోషకరము. మా చెరసాలకు నాలుగైదు మైళ్ళదూరములోనే ఆమె వుండుట. కాని ఇది తెలివితక్కువభ్రమ. రెండు చెరసాలల ఎత్తుగోడలు మధ్యగా నున్నప్పుడు 5 మైళ్లైనను 150 మైళ్లైనను ఒక్క టే,

తాత అలహాబాదుకు తిరిగివచ్చినారనియు, కులాసాగా ఉన్నారనియు విని సంతోషించితిని. మలక్కా చెరసాలలోఉన్న అమ్మను చూచుటకు వెళ్ళినారనికూడ విని చాల సంతోషించితిని. బహుశా రేపు, అదృష్టమున్న. మిమ్మందరిని చూడగలను. రేపు నాకు సమావేశదినము. ములాకత్‌కాదీన్ చెరసాలలో గొప్పరోజు. తాతను చూచి రెండునెలలయినది. తాతనుచూచి, నిజముగా కులాసాగా ఉన్నది లేనిది తెలిసికొందును. పక్షముదినములైనవి నిన్ను చూచి. ఇంత దీర్ఘకాలమైన పిమ్మట నిన్ను చూడగలను. అమ్మవర్తమానమును, నీవర్తమానమును అప్పుడు నీవు నాకు చెప్పుదువుకానిలే !

అయ్యో ! ప్రాచీనచరిత్రనుగూర్చి నీకు వ్రాయుటకు కూర్చుండి చిల్లరవిషయములమగూర్చి వ్రాయుచున్నాను. వర్తమానమును ప్రస్తుతము మరిచిపోదము. 2000, లేదా 3000 సంవత్సరముల వెనుకకు పోదము. ఈజిప్టునుగూర్చియు, క్రీటులోని ప్రాచీననగరమగు క్నోస్సోస్‌ను గూర్చియు కొద్దిగా ఇదివరలో నీకు వ్రాసియుంటిని. ప్రాచీన నాగరికతలు ఈ రెండు దేశములలోను, నేడు ఇరాక్ , లేదా మెసపొటేమియా అని పిలువబడు దేశములోను, చీనాలోను, ఇండియాలోను, గ్రీసులోను వేళ్ళు తన్నినవని చెప్పియుంటిని. మిగతవానికన్న గ్రీసుకొంచెము ఆలస్యముగా వచ్చియుండును. కాన ఇండియాలోని నాగరికత సాటినాగరికతలు గల ఈజిప్టు, చీనా, ఇరాక్ నాగరికతలతో వయస్సున సమానమగుచున్నది. ప్రాచీన గ్రీసుదేశముసైతము వీనిచెల్లెలే. ఈ ప్రాచీన నాగరికత లేమైనట్లు ? క్నోస్సోస్ నామమాత్రావశిష్టమైనది. సుమారు 3000 సంవత్సరములకు పూర్వమే అది అంతరించినది. చిన్నదైన గ్రీసునాగరికతకు సంబంధించిన ప్రజలు వచ్చి దానిని నాశముచేసిరి. ఈజిష్టయొక్క ప్రాచీననాగరికత వేలకొలది సంవత్సరములు దివ్యముగావెలిగి అంతరించినది. గొప్ప పిరమిడులు, స్పింగ్సువిగ్రహము, గొప్ప దేవాలయముల శిథిలములు, రక్షితమానవకళేబరములు మున్నగునవి తప్ప నాగరిక చిహ్నము లేమియు మిగులలేదు. ఈజప్టుదేశ మక్కడనే యున్నది. . నైలునది పూర్వమువలె ప్రవహించుచునే యున్నది. ఇతర దేశములందువలెనే స్త్రీ పురుషులందు నివసించియున్నారు. కాని నేడు నివసించు ప్రజలకును, వారి దేశముయొక్క ప్రాచీననాగరికతకును సంబంధము తెగిపోయినది, ఇరాక్, పర్షియాదేశములమాట — ఎన్ని సామ్రాజ్యము లందు వెలిసినవి కావు? ఒకదానివెనుక నొకటి అంతరించినవికావు . ప్రాచీనతమమైన పేళ్లు చెప్పిన చాలును - బాబిలోనియా, అస్సీరియా, చాల్ డియా మహానగరములగు బాబిలన్ , నినేవాలమాట. బై బిలులోని ప్రాతనిబంధనలో ఈ ప్రజల వృత్తాంతము కలదు. కొంతకాలమైనపిమ్మట, ప్రాచీనచరిత్ర కాకరమైన ఈ భూమిలో ఇతర సామ్రాజ్యములు వర్ధిల్లినవి. తరువాత వర్ధిల్లుట మానినవి. ఇక్కడ బాగ్దాదు ఉండెను. — అరేబియన్ రాత్రుల కథలలోవచ్చు అద్భుతనగరము. కాని సామ్రాజ్యములు వచ్చును. సామ్రాజ్యములుపోవును. నిరుపమానశౌర్యోపేతులు, అభిమానపూరితులునగు రాజులు, చక్రవర్తులు కొంచెముకాలమే ప్రపంచ నాటకరంగమున సగర్వముగా సంచరింతురు. కాని నాగరికతలు నశించవు. అవి నిలిచి యుండును. ఇరాక్, పర్షియాలోమాత్రము ప్రాచీననాగరికత, ఈజిప్టు ప్రాచీననాగరికతవలెనే, పూర్తిగా అంతరించెను.

ప్రాచీనకాలమున గ్రీసు ఉన్నతస్థితియందుండెను. ఇప్పుడుకూడ దాని ప్రఖ్యాతినిగూర్చి ప్రజలాశ్చర్యముతో చదువుదురు. చలువరాతివిగ్రహముల సౌందర్యమును తిలకించునప్పుడు మనకో గౌరవాశ్చర్యములు పెనగొనును. మనవరకు వచ్చిన దాని ప్రాచీనసారస్వత ఖండములను పఠించునపుడు విస్మయమును, పూజ్యభావమునుకలుగును. నవీనయూరోపు కొన్ని విధములుగా చూచిన, ప్రాచీనగ్రీసుయొక్క బిడ్డయే యని చెప్పుదురు. ఆ మాట నిజమే. గ్రీకుల అభిప్రాయములును, ఆచారములును యూరోపుపై తమ ప్రభావమును అంతగా చూపినవి. కాని గ్రీసుప్రఖ్యాతి నే డెచ్చట నున్నది. ప్రాచీన నాగరీకము అంతరించి ఎంతకాలమో గడచినది. క్రొత్తపద్ధతులు ప్రవేశించినవి. నేడు గ్రీసు యూరోపుకు ఆగ్నేయముగానున్న ఒక చిన్న దేశముమాత్రమే.

ఈజిప్టు, క్నోస్సోస్, ఇరాక్, గ్రీసు - ఇవన్నియు మాయమైనవి. వాని ప్రాచీననాగరీకతలు, బాబిలన్, నినేవానగరములవలెనే అంతరించినవి. అయితే ఈ ప్రాచీననాగరీకముల కూటములోని మిగత యిద్దరు వృద్ధులమాట యేఘటి? చీనా, ఇండియాలమాట యేమిటి? ఇతర దేశము లందువలెనే సామ్రాజ్యము తరువాత సామ్రాజ్యము ఈ దేశములందును పుట్టినవి. దండయాత్రలు, విధ్వంసములు, దోపిళ్ళు బ్రహ్మాండముగా జరిగినవి. వందల సంవత్సరములు రాజవంశములేలినవి. వానికి బదులు క్రొత్తవంశములు వచ్చినవి. ఇతరదేశములందువలెనే ఇండియాలోను, చీనాలోనుకూడ ఇట్లు సంభవించినది. కాని ఇండియా చినాలలో తప్ప మరెచ్చటను నాగరీకము ఆజ్వధారవలె ఎడతెగక సాగలేదు. ఈ రెండు దేశములందును మార్పులు వచ్చినప్పటికిని, యుద్ధములు, దండయాత్రలు సంభవించినప్పటికిని ప్రాచీన నాగరీకతంతువు ఒక్క బిగినిసాగిపోయినది. ఈ రెండుదేశములును తమ యుచ్చస్థితి నుండి చాలవరకు జారినమాట వాస్తవమే. దీర్ఘ కాలము గడచుటవల్ల ప్రాచీన విజ్ఞానములపై కుప్పలుగా దుమ్మును, ఒకప్పుడు మాలిన్యమునుకూడ పడినమాట వాస్తవమే. అయినప్పటికిని అవి నిలిచియున్నవి. ప్రాచీన హిందూనాగరికత నేడుకూడ హైందవజీవితమున కాధారముగానున్నది. నేడు ప్రపంచముననూతనపరిస్థితు లేర్పడినవి. పొగయోడలు, రైళ్లు, కర్మాగారములు వచ్చుటవల్ల ప్రపంచ స్వరూపమే మారిపోయినది. ఇండియాస్వరూపమునుకూడ అవి మార్చ వచ్చునేమో, అప్పుడే మార్చుచున్నవికూడ, ఐతే చరిత్ర ఉదయించినది మొదలు మన కాలమువరకు, దీర్ఘయుగములగుండ నిరంతరాయముగ సాగినహైందవవిజ్ఞాన నాగరికతను తలచుకొన్న, ముచ్చటగానే కాదు, విస్మయజనకముగకూడ ఉండును. ఒక విధముగా చూచినఇండియాలోనున్న మనము ఆ వేలకొలది సంవత్సరములకు వారసులము. బ్రహ్మావర్త మనియు, ఆర్యావర్త మనియు, భారతవర్ష మనియు, హిందూస్థాన మనియు పేరుగడించిన సుక్షేత్రములలోనికి వాయవ్య కనుమలగుండా దిగిన ప్రాచీనులవంశవృక్షములోనివారమే బహుశామనము. కొండకనుమల గుండ దిగి ఈ క్రొత్తదేశమునకు వారు నడిచివచ్చుచుండుట నీకు కనబడుటలేదూ ? థైర్యముతో, తెగువతో ఏమి రానున్నదో యని భయపడక ముందుకు పోవుటకు వారు సాహసించిరి. మృత్యు వే తటస్థించినను వారు లెక్క చేయలేదు. చిరునగవుతో దాని నెదుర్కొనిరి. జీవితముపై వారికి ప్రీతి మెండు. భయము లేకుండుట, అపజయము విపత్తులు వచ్చినప్పుడు మనోవైకల్యమును జెందకుండుటవల్లనే జీవితసుఖముల ననుభవించవచ్చునని వారెరుగుదురు. భయరహితులవద్దకు అపజయమును, విపత్తులునురావు. ఆ మనపూర్వికులను, దూరబంధువులను ఒకమారు తలచుకొనుము. నడిచినడిచి వచ్చి, సముద్రమును చేరుటకు గంభీర ముగా ప్రవహించుచున్న గంగానదీతీరమును వారు హఠాత్తుగా చేరుట తలచుకొనుము. గంగానదీతీరదర్శనము వారికెంత ప్రమోదమునుగూర్చినదో ! గంగానదికి వారు ప్రణమిల్లిరన నాశ్చర్యమేమి ? సమృద్ధము, శ్రావ్యమునగు వారిభాషతో స్తుతించిరన నాశ్చర్యమేమి ?

ఈ యుగములకు వారసుల మనుకొనుట ఎంత గొప్పగానున్నది! గాని మనము దురహంకారము చెందరాదు. ఈ యుగములకు వారసుల మన్నప్పుడు మంచికిని వారసులమే, చెడ్డకును వారసులమే. ఇండియాలోని ఈ మన వారసత్వపు ఆస్తిలో చెడుగు చాల చేరినది. ప్రపంచములో మన మధమస్థానమున నుండుటకది కారణము, దివ్యమగు మనదేశము దారిద్ర్యములో పడిపోవుట కది కారణము. మన దేశ మితరులచేతులలో ఆటబొమ్మ యగుట కదికారణము. ఈ పరిస్థితు లిక ముందు ఎంత మాత్రము సాగకూడదని మనము నిశ్చయించుకొంటిమి కాదా?

6

హెల్లనీలు

జనవరి 16, 1931

ఈరోజున నన్ను చూచుటకు మీ రెవ్వరును రాలేదు. ములాకత్ - కాదీన్ వట్టి శుష్కదిన మైపోయినది. నాకాశభంగమైనది. సమావేశ మిప్పుడు జరుగక ఇంకొకమారు జరుగుననుట కిచ్చిన కారణము విచారకరముగా నున్నది. తాత కులాసాగాలేరని మాకు తెలిసినది. ఇక ఈరోజున సమావేశము జరుగదని తెలిసికొని నా రాటమువద్దకు వెళ్ళి కొంతసేపు వడకితిని. నేను అనుభవమువల్ల తెలిసికొనిన విషయ మేమనగా - రాటముమీద నూలువడకుట, నవారునేయుట మనస్సున కానందమును, ఊరటను కల్పించునని. కాబట్టి సంశయాత్మ వైనప్పుడు నూలువడకుము.