ప్రపంచ చరిత్ర/పర్షియా : గ్రీసు

వికీసోర్స్ నుండి

కొనలేదుకదా! వయస్సు వచ్చినప్పటికిని కొందరు, మనోవికాసమును బట్టిచూడ, శిశువులవంటివారే.

ఈదినమున మామూలుకన్న దీర్ఘముగా ఈ లేఖ వ్రాసితిని. నీకు చదువుట కుత్సాహముగా నున్నదో లేదో, కాని నేను చెప్పదలచుకొన్న విషయము చేతనైనంతమట్టుకు చెప్పితిని. ఇందేవిషయమైన నీకిప్పుడు అవగాహన కాకున్న ఫరవాలేదు. ముందుముందు అర్థముకాగలదు.


15

పర్షియా : గ్రీసు

జనవరి 21. 1931

ఈ దినమున నీజాబు చేరినది. అమ్మ, నీవు కులాసాగా ఉన్నారని వినుటకు సంతోషముగా నున్నది. తాతకు జ్వరము, ఇతర బాధలు తగ్గిన బాగుండును. జీవితకాలమంతము ఆయన ఎంతో కష్టపడి పనిచేసిరి. ఇప్పటికికూడ ఆయనకు విరామము, మనశ్శాంతి కలుగలేదు.

భాండాగారములోని పుస్తకము లేన్నో చదివినట్లును, చదువదగిన క్రొత్త పుస్తకములను చెప్పమనియు అడిగితివి. ఏ పుస్తకములు చదివితివో నీవు నాకు వ్రాయలేదు. పుస్తకములు చదువు అలవాటుమంచిచే. వడివడిగా ఎన్నో పుస్తకములు చదువువారిని చూచిన నా కనుమానము. వారు పుస్తకములు సరిగా చదువరనియు, కప్పగంతులు వేసికొని పోపుచురనియు, చదివినదానిని మరునాడే మరిచిపోపుదురనియు నా అనుమానము. చదువదగిన పుస్తకమైనచో దానిని శ్రద్ధగాను, క్షుణ్ణముగాను చదువవలెను. కాని చాలా పుస్తకములు చదువతగినవికావు. మంచి పుస్తకముల నేరుకొనుటకూడ కష్టమే. మన భాండాగారము నుండి పుస్తకములు తీసికొన్నచో అవి మంచి పుస్తకములే యగునని నీవనవచ్చును. కానిచో వాని నెందుకుతెప్పించి భాండాగారములో నుంచిరి? సరే, సరే, చదువు, నాయినీ చెరసాలనుండి నేను చేయగల సహాయమును చేయుదును. నీ మనస్సు, శరీరము ఎంత వేగముగా వృద్ధి చెందుచున్నచో అని నేను తరుచు అనుకొనుచుందును. నేను నీవద్దనుండిన నెంత బాగుండును! నేను వ్రాయుజాబులు నీకు చేరులోపుగా నీవు ఇందలి విషయములకు మించిన జ్ఞానమును సంపాదించియుందువేమో. అప్పుడు [1]చంద్రకు ఈ జాబులను చదువు ఈడు వచ్చును. కాబట్టి ఎవరో ఒకరు చదివి విషయమును గ్రహించవచ్చును.

మరల మనము గ్రీసుకు, పర్షియాకు పోవుదము. వారి అన్యోన్య యుద్ధములను గూర్చి విచారింతము. గ్రీకుల నగర రాష్ట్రములను గూర్చియు, డరయస్ రాజు పరిపాలన క్రిందనున్న పర్షియా మహా సామ్రాజ్యమునుగూర్చియు ఇదివరలో ఒక జాబులో చర్చించియుంటిమి. డరయస్ సామ్రాజ్యము వైశాల్యముననేకాదు, రాజ్యాంగ నిర్మాణము నందుకూడ చాల గొప్పది. అది ఆసియా మైనరునుండి సింధునదివరకు వ్యాపించినది. ఈజిప్టు, దాని యంతర్భాగమే. ఆసియా మైనరులోని కొన్ని నగరరాష్ట్రములు కూడ లందులో చేరినవే. ఈ పెద్ద సామ్రాజ్యమందంతట చక్కని బాటలున్నవి. బాటలగుండ నిత్యము, వేళకు, చక్రవర్తి తపాలు పోవుచుండెను. ఏకారణమువల్లనో డరయస్ గ్రీకుల నగర రాష్ట్రములను జయింప నిశ్చయించెను. ఈ సంగ్రామములలో చరిత్రలో ప్రసిద్ధికెక్కిన యుద్దములు కొన్ని జరిగినవి. ఈ సంగ్రామముల వృత్తాంతములు గ్రీకు చరిత్రకారుడగు హెరోడోటస్ వ్రాసెను. అతడు తానువ్రాసిన విషయములు జరిగిన కొద్దికాలము తరువాతనే ఉండేను. అతడు గ్రీకుపక్షపాతి. కాని అతని వ్రాతలు చాల మనోహరముగా నుండును. ఈ జాబులలో క్రమేణ ఆతని చరిత్రనుండి కొన్ని వాక్యములను ఉదహరించు చుందును.

గ్రీకులపై పర్షియనులు చేసిన మొదటి దండయాత్ర విఫల మాయెను. ఇందుకు కారణము-పర్షియన్ సైన్యము త్రోవలో రోగముల పాలాయెను. తగిన తిండి దొరకలేదు. ఆ సైన్యము గ్రీసును చేరుకోలేక వెనుకకు మరలిపోవలసివచ్చినది. క్రీ. పూ. 400 సంవత్సరమున రెండవ దండయాత్ర జరిగెను. ఈ సారి భూమార్గమునువదలి సముద్రముపై ప్రయాణముచేసి ఏథెన్సుకు సమీపమందున్న మారథాన్ ఆను ప్రదేశమున సేనలు దిగినవి. పర్షియాసామ్రాజ్యముయొక్క కీర్తి దివ్యంగా వెలుగుచుండినందున ఏథెన్సు ప్రజలు చాల భయపడిరి. అందువల్ల వారు తమ ప్రాత శత్రువులైన స్పార్టనులను మంచి చేసుకొని తమకు ఉమ్మడి శత్రువైన పర్షియాను జయించుటకు తోడ్పాటుకోరిరి. స్పార్టను సహాయము రాక పూర్వమే ఏథెన్సుసైన్యము పర్షియనుల సైన్యము నోడించెను. ఇదియే ప్రసిద్ధమగు మారథాన్ యుద్ధము. క్రీ. పూ. 490 లో ఇది జరిగినది.

ఒక మహాసామ్రాజ్య సైన్యములను ఒక చిన్న గ్రీకునగరరాష్ట్ర మోడించుట వింతగా కనుపించును. కాని కనిపించినంత వింత ఇందులో లేదు. గ్రీకులు తమదేశమువద్ద, తమదేశముకొరకు పోరాడిరి. పర్షియసుల సేనలన్ననో తమ చేశమును దాటి ఎంతోదూరము వచ్చి పోరాడినవి. పర్షియన్ సామ్రాజ్యపు అన్నిభాగములనుండి ప్రోగుచేయబడిన కలగూరగంప పర్షియనుల సేనలు . జీతములు పుచ్చుకొనుచుండుటచే వారు పోరాడిరి. గ్రీసును జయించవలెనను ఆకాంక్ష వారి కంతగా లేదు. ఏథెస్సు సేనలన్ననో తమ స్వాతంత్ర్యమును నిలుపుకొనుటకు పోరాడినవి. స్వాతంత్ర్యమును గోల్పోవుటకన్న చాపు మేలని వారెంచిరి. ఏయుద్యమముకొరకైనను ప్రాణములొడ్డువారికి అపజయముండదుకదా !

మారథాన్‌వద్ద డరయస్ పరాజయమందెను. తరువాత నాతడు పర్షియాలో దేహమును చాలించెను. అతని తరువాత జవక్సస్ చక్రవర్తియయ్యెను. జరక్సస్ కూడ గ్రీసును జయించవలె నని ఆసించెను. ఇందుకై అతడొక దండయాత్రను సన్నద్ధము చేసెను. ఈ సందర్భమున హెరొడోటస్ చెప్పిన మనోహరమగు వృత్తాంతమును నీకు వినిపించెదను. జరక్ససు పినతండ్రిపేరు ఆర్టబానస్. గ్రీసుపై దండయాత్ర సాగిం చిన పర్షియాసేనలకు ప్రమాదము కలుగునని అతడూహించెను. గ్రీసుపై యుద్ధము చేయవద్దని జర్‌క్ససు కాతడు బోధించెను. జరక్ససు సమాధానమిట్లిచ్చెనని హెరొడోటస్ చెప్పుచున్నాడు -

"నీవు చెప్పిన మాట సబబైనదే. కాని మనము చేయు ప్రతికార్యమందును విపత్తుండునని నీ వూహింపరాదు. ఆపదలసు నీవు గణించరాదు. వచ్చిన ప్రతికార్యమును గూర్చియు ఇది మంచిదా, చెడ్డదా, యని తర్కించుచుపోయిన నీవే కార్యము నెన్నటికిని చేయలేవు. ఆపదలు తటస్థించునేమో యని బెంగపెట్టుకొని కూర్చుండి. ఎట్టి కష్టములను అనుభవించక యుండుటకంటె సర్వ యత్నములందును మేలునే చూచుట తటస్థించిన కష్టముల నెదుర్కొనుట మంచిది. ఎదుటివాడు చేసిన ప్రతి ఉపపాదనను, ఆదరింపదగిన సక్రమమార్గమును చూపకుండ, నీవు ఖండించుచుపోయిన ఎదుటవానితోపాటు నీవును కష్టములపాలగుదువు. హెచ్చుతగ్గులు లేకుండ తుల నిలిచియున్నది. ఏవైపుముల్లు వంగునో సామాన్యమానవుడు నిష్కర్షగా ఎట్లుచెప్పగలడు? చెప్పలేడు. పూని పనిచేయువానికే సామాన్యముగా భయము చేకూరును. సంశయాత్ములగుభీరువులను విజయలక్ష్మి వరించదు. పర్షియా ఎంతటి గొప్పసామ్రాజ్యమైనదో చూచితివా? సింహాసనము నధిష్టించిన నా పూర్వులు నీవు చేయుచున్న ఆలోచనల వంటి ఆలోచనలే చేసియుండిన పక్షమందును, లేదా వారట్టి ఆలోచనలు చేయకున్నను, నీవంటి మంత్రులు వారి కుండియుండిన పక్షమందును మన సామ్రాజ్య మింత గొప్పదగుట సంభవించదు. ఆపదలను లక్ష్యపెట్టకుండుట చేతనే మనల నింతటివారినిగా వారు చేయగలిగిరి. గొప్ప ఆపదల ద్వారానే ఘనకార్యములు నిర్వహింపబడుచుండును."

పర్షియారాజు ఎట్టివాడో పై వృత్తాంతమునుబట్టి మనము తెలిసికోవచ్చును. అందువల్లనే దీర్ఘముగా నున్నను పైవాక్యముల నెత్తి వ్రాసితిని. చివరకు ఆర్టబానస్ చెప్పిన ప్రకారమే జరిగినది. పర్షియనుల సైన్యము గ్రీసులో ఓడిపోయినది. జరక్ససు ఓడిపోయెను. కాని అతని మాటలు నేటికిని పరమసత్యములే. మనము నేర్చుకోవలసిన విషయము లందున్నవి. నేడు. మహత్కార్యములను సమర్థించ పయత్నించుచున్న
గ్రీకులు - పర్షియనులు

మనము జ్ఞాపకముంచుకోవలసిన విషయ మేమనగా - గమ్యస్థానమును చేరగలుగుటకు ముందు మనము గొప్ప ఆవదల నెదుర్కొనవలేను.

రాజాధిరాజైన జరక్ససు తన సైన్యమును ఆసియా మైనరుగుండ తీసికొనిపోయేను. ఆ రోజులలో హెల్లస్పాంటు అని పిలువబడు డార్టినెల్సుగుండా యూరోపు ప్రవేశించెను. త్రోవలో పూర్వకాలమున గ్రీకు వీరులు హెలన్‌కొరకు పోరాడిన ట్రాయిపట్టణ శిథిలములను చక్రవర్తి దర్శించెనని చెప్పుదురు. హెల్లస్పాంటు కడ్డముగా సైన్యము దాటుటకు పెద్ద వంతెన కట్టబడెను. పర్షియను సేనలు దాటుచుండగా సమీపమందున్న కొండపై చలువరాతి సింహాసనమున కూర్చుండి జరక్ససు చూచు చుండెను,

హెరొడోటస్ చెప్పుచున్నాడు. "జరక్ససు నావలలో నిండియున్న హెల్లస్పాంటును చూచెను. తీరములన్నియును, అవాస్ మైదానములును సైనికులతో నిండియుండుట చూచెను. నే నెంత యదృష్టవంతుడను, అని యాతడనుకొనెను. మరుక్షణముననే యతడు విలపింపదొడగెను. హెల్లాను(గ్రీసు) మీదకు దండెత్తి పోవలదని మొదట ధైర్యముగా సలహాచెప్పిన ఆర్టవానసు చక్రవర్తి విలపించుట చూచి యిట్లడిగెను-- "ఓ. రాజా, నీ విప్పుడు చేసిన పనులు పరస్పరము ఎంత విరుద్ధముగా నున్నవి? నీ యంత యదృష్టవంతుడు లేడని చెప్పి వెంటనే కన్నీరు కార్చుచుంటివి." చక్రవర్తి చెప్పిన సమాధాన మేమనగా “అవును, సర్వమును చూచినపిమ్మట నా మనస్సునకు తట్టి, జాలి పుట్టించిన విషయ మేమనగా....మస యెదుట కనిపించు జనసమూహములో ఒక్కడును నూరు సంవత్సరములు గడచిన పిమ్మట జీవించియుండడు గదా? మానవుని జీవిత పరిమాణ మెంత స్వల్పము ! "

ఈ మహాసైన్యము భూమార్గముస ముందుకు కదలెను. సముద్ర మార్గమున పెక్కు నావలు వారి నంటివచ్చుచుండెను. కాని సముద్రము గ్రీకులయెడ పక్షపాతము చూపెను. తుపానులో నావలను పెక్కింటిని నాశముచేసెను. గ్రీకులు ఈ మహాసైన్యమును చూచి భయపడి, తమలో తమకుండు భేదములను మరిచి, ఏకమై శత్రుపు నెదుర్కొనిరి, పర్షియను సైన్యపు దాడికి గ్రీకులు వెనుకకు మరలిరి. థర్మాపిలె అను కనుమవద్ద పర్షియను సైన్యము నాపవలెనని నిర్ధారణ చేసికొనిరి. ఇది సన్నని మార్గము. ఒకతట్టు పర్వతమున్నది. రెండవతట్టు సముద్రమున్నది. ఈ ప్రదేశమున కొద్దిమంది సైనికులు పెద్ద సైన్యము నాపగలుగుదురు. 300 స్పార్టనులతో లియెనిదాస్ ఈ కనుమను మరణపర్యంతము రక్షించుటకు నియమింపబడెను. మారథాన్ యుద్ధము జరిగిన పదిసంవత్సరముల పిమ్మట ఆ ప్రఖ్యాతదినమున ఆ అసహాయశూరులు తమ మాతృదేశమున కమూల్యసేవ యొనరించిరి. గ్రీకు సైన్యము మరలిపోవుచుండగా పర్షియనుల మహాసైన్యము నీ వీరులు అరికట్టిరి. ఆ ఇరుకు కనుమలో, వీరుని వెంబడి వీరుడు, నేలకొరిగెను. వీరునివెంబడి వీరుడు వారిస్థలముల నాక్రమించెను. పర్షియనుల సైన్యము ముందుకు కాలుపెట్ట లేకపోయేను. పర్షియనులు సాగిపోవుటకుముందు లియెనిదాసును, అతని సహచరులు 300 మందియు థర్మాపిలెలో వీరస్వర్గము నందిరి.. క్రీ. పూ. 480 సంవత్సరమున నీ యుద్ధము జరిగెను. 24 10 సంవత్సరములకు పూర్వము జరిగినప్పటికిని ఆవీరుల అప్రతిమాన శౌక్యమును నేడు తలచుకొన్నప్పటికిని శరీరము పులకలెత్తును. నేడు సైతము ధర్మాపిలెను దర్శించు బాటసారి, కన్నీరునిండిన నేత్రములతో, శిలాఫలకముపై చెక్కిన సందేశము - లియెనిదాసు యొక్కయు, అతని సహచరుల యొక్కయు సందేశము - చదువగలడు.

“పొమ్ము, స్పార్టాతోడ చెప్పుము
 తెరుపరీ : మా విన్నపంబును,
 ఆమెయానతి తలనువాల్చి
 బరిగితిమి ఈ కనుమలోనని."

మృత్యువును జయించు ధైర్యము అద్భుతావహముగదా ! లియెనిదాసును, థర్మాపిలెయును చిరంజీవులు. దూరదేశమగు ఇండియాలోనున్న మనము సైతము వారిని తలచుకొని పులకరించుచున్నాము. ఇక మన దేశ ప్రజలను, మన పూర్వులను, హిందూస్థానమందలి స్త్రీ పురుషులను, మన దీర్ఘ చరిత్రమార్గములో మృత్యువును చూచి మందహాసము చేసి పరిహసించిన స్త్రీ పురుషులను - అప్రతిష్ట, బానిసత్వములను సహింపక మృత్యువును వరించిన స్త్రీ పురుషులను - నిరంకుశత్వమునకు తలవంచక దానిని విచ్చిన్నముచేయ బొరకొనిన స్త్రీ పురుషులను తలచుకొనిన మన మెట్టులుండును? చిత్తూరును తలచుకొనుము. రాజపుత్ర స్త్రీ పురుషుల అప్రతిమానశౌర్యసాహసములను వర్ణించు నిరుపమ గాథలనుస్మరింపుము. నేటికాలమును కూడ స్మరింపుము. మనవలెనే వెచ్చని నెత్తురు గల మన సహచరులను - ఇండియా స్వాతంత్ర్యము సాధించుటకై మృత్యు ముఖమున ప్రవేశించిన సహచరులను స్మరించుము.

థర్మాపిలె కొంతకాలము మాత్రము పర్షియనుల సైన్యము నాపగలిగెను. ఎక్కువకాల మాపలేదు. గ్రీకుల సైన్యము వారిముందు నిలువ జాలక వెనుదిరిగిపోయెను. కొన్ని గ్రీకు నగరములు పర్షియనుల వశమయ్యెను. శత్రువశమగుటకు సమ్మతించక, అభిమాన పూరితులగు ఏథెన్సు ప్రజలు తమ ప్రియనగరము ధ్వంసమయినను సరే యని దానిని విడిచిపెట్టిరి. ప్రజలందరును ఎక్కువగా నావలమీద నగరమును విడిచి వెళ్ళిపోయిరి. నిర్జననగరమును పర్షియనులు ప్రవేశించి దానిని దగ్దము జేసిరి. ఏథెన్సు నౌకాదళము మాత్రము పరాజయమందలేదు. సాలమిస్ వద్ద గొప్ప నౌకాయుద్ధము జరిగెను. పర్షియనుల నావలు నాశముచేయబడెను. ఈ విపత్తున కధైర్యముజెంది జరక్సస్సు పర్షియాకు తిరిగి పోయెను.

మరికొంత కాలమువరకు పర్షియా మహాసామ్రాజ్యముగానే యుండెను. కాని మారథాన్, సాలమిస్ యుద్ధములు దాని పతనమునకు దారితీసెను. అది ఎట్లు పతనమైనదో ముందు ముందు తెలిసికొందము. ఈ మహాసామ్రాజ్యము తూలిపోవుట చూచిన ఆకాలపు ప్రజలు ఎంత యాశ్చర్యము జెందిరో! హెరొడోటసు ఆ విషయము నాలోచించి యొక నీతిని వచించెను. అతడు చెప్పిన దేమన - జాతి చరిత్రకు మూడు దశలుండును : విజయము : విజయమూలకముగా గర్వము : అన్యాయము : పిమ్మట పై కారణములవల్ల పతనము.


16

హెల్లాసు మహత్తర ప్రతిభ

జనవరి 23, 1931

పర్షియనులమీద గ్రీకుల విజయముల ననుసరించి రెండు ఫలితములు వచ్చినవి. పర్షియన్ సామ్రాజ్యము సన్నగిలి సన్నగిలి దుర్బల మాయెను. గ్రీకుల చరిత్రమున దివ్యయుగము ప్రారంభమాయెను. ఆ జాతి జీవితములో ఆవెలుగు కొద్దికాలమే యుండెను. 200 సంవత్సరముల కాలముమాత్రమే అది నిలిచెను. పర్షియా సామ్రాజ్యము, అంతకు పూర్వమందలి యితరసామ్రాజ్యములవలె విశాలమైనసామ్రాజ్యముండుట వల్ల వచ్చిన గొప్పతనము కాదు దానిది. కొంతకాలమైనపిమ్మట ఘనుడగు అలెగ్జాండరు తలయెత్తి తన విజయములతో, కొద్దికాలము, లోకమును ఆశ్చర్యమున ముంచెను. ఇప్పుడాతనిని గురించి మనము ప్రసంగించుకొనుట లేదు. పర్షియన్ సంగ్రామములకును, అలెగ్జాండరు రాకకును మధ్యనున్న కాలమునుగురించి మనము ప్రసంగించుకొనుచున్నాము. ధర్మాపిలె, సాలమీస్‌యుద్ధముల తరువాత 150 సంవత్సరములకాల మది. పర్షియనుల దండయాత్రలు గ్రీసుల నేకము చేసెను. ఈ ప్రమాదము తప్పుటతోడనే వారు మరల విడిపోయి వారిలోవారు పోరాడుకొనజొచ్చిరి. ముఖ్యముగా ఏథెన్సు నగరరాష్ట్రములును, స్పార్టాయును ప్రబలస్పర్థను పూనియుండిరి. వారి పోరాటములతో మనకిప్పుడు ప్రశంస లేదు. అవి ప్రధానము కాదు. మనము వారిని స్మరించుటకు కారణము, ఆ రోజులలో ఇతర విధములుగా గ్రీసు గొప్పతనము సంపాదించుకొన్నది.

  1. ఇందిర మేనత్తకూతురు చంద్రలేఖ పండిట్.