ప్రపంచ చరిత్ర/క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

వికీసోర్స్ నుండి

గుట తటస్థించవచ్చును. మనకు సంస్కృతిగాని, నాగరీకముగాని లేనట్లు మెలగుదుము. కుటుంబముకన్న పెద్దదగు సంఘమునందు సరిగా ఈ విధముగానే జరుగుచున్నది - మన పొరుగువారైనను అంతే. ఏక నగరవాసులైనను అంతే. మన దేశస్థులైనను అంతే. ఇతర దేశస్థులైనను అంతే. జనసంఖ్య పెరుగుటవల్ల సాంఘిక జీవనము అధికముగా గడప వలసి వచ్చినది. నిగ్రహముతో ఇతరుల కష్టసుఖము లోలోచించి మెలగ వలసివచ్చినది. సంస్కృతి. నాగరీకము అన నేమో నిర్వచించుట కష్టము. నేను నిర్వచించ ప్రయత్నించను. ఆత్మనిగ్రహము లేక ఇతరుల కష్టసుఖములను పాటించనివాడు. సంస్కృతిలేనివాడని నిష్కర్షగా చెప్పవచ్చును.


14

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్ది : మతము

జనవరి 20, 1931

చరిత్రయొక్క దీర్ఘ ఘంటాపథమును బట్టి పోవుదము. మనమొక మైలురాయి చేరుకొన్నాము, 2500 సంవత్సరములకు పూర్వము, ఇంకొకవిధముగా చెప్పవలసివచ్చిన, క్రీస్తుకు పూర్వము సుమారు 600 సంవత్సరములు. ఇది సరియైన తేదీయని భావింపకుము, ఇంచుమించుగా ఒక కాలనిర్దేశమును మాత్రము చేయుచున్నాను. ఈకాల ప్రాంతమున గొప్పపురుషు లనేకులుండిరి; గొప్ప తత్వజ్ఞులు, మత స్థాపకులు వివిధ దేశములలో, చీనా, ఇండియాలు మొదలు పరిషియా, గ్రీసుల వరకు ఉండిరి. వీరందరును సరిగా ఒకేకాలమున లేరు. సమీప కాలములలో వారుండుటచే క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్ది ప్రసిద్ధిగన్న కాలఖండమైనది. అప్పుడు ప్రపంచమున భావతరంగ మొక్కటి - నాటి పరిస్థితులలో అసంతృప్తి, పరిస్థితులు బాగుపడునను ఆశ, కోరిక ఆవరించి యుండవచ్చును . మతస్థాపకులు పరిస్థితులు చక్కబరచుటకును, ప్రజలను సత్పథమున బెట్టి వారిక్లేశములను తగ్గించుటకును ఎప్పుడును ప్రయత్నించెడి వారని జ్ఞాపకముంచుకొనుము. అప్పటి లోపముల నెత్తిచూపుటకు వారెన్నడును భయపడలేదు. వారు విప్లవకారులు. ప్రాత సంప్రదాయము దారితప్పి దుష్టమైనప్పుడుగాని, భావివృద్ధికి ఆటంకముగా నున్నప్పుడుగాని వారు దానిని ఖండించి నిర్భయముగా తొలగించిరి. అంతకన్న ముఖ్యవిషయము వారు ఆదర్శప్రాయముగా జీవించుచు, తరతరముల ప్రజలకు, అసంఖ్యాకులకు, ఆదర్శజీవనము ఆచరణరూపముగా చూపియుండిరి. అట్టిజీవనము ప్రజలకు ఆదర్శమయినది. అట్లు బ్రతకవలెనని ఆవేశము నిచ్చినది,

క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్దిని ఇండియాలో బుద్ధుడు, మహావీరుడు ఉండిరి : చీనాలో కంప్యూసియస్, లోచే లున్నారు ; పర్షియాలో జరతుష్ట్ర[1] ఉన్నాడు; గ్రీకుద్వీపమైన శామాస్‌లో పై తాగొరాస్‌ఉన్నాడు. వేరు వేరు సందర్భములలో ఈ పేళ్లు నీవు వినియుండవచ్చును. పైతాగొరాస్ క్షేత్రగణితములో ఒక సిద్ధాంతమును ఋజువు చేసిన అధికప్రసంగి అనియు, తాము. పాపము, దానినిప్పుడు నేర్చుకోవలసి వచ్చినదనియు సాధారణముగా బడికిపోవు బాలబాలికలు తలతురు. ఈసిద్ధాంతము సమకోణ త్రిభుజము యొక్క భుజముల చతురములకు సంబంధించినది. ఇది యూక్లిడ్ గ్రంథములోను, ఇతర క్షేత్రగణితములలోను ఉండును, క్షేత్రగణితములో అతడు కనిపెట్టిన విషయముల మాట అటుంచిన పై తాగొరాస్ ఒక గొప్ప తత్వవేత్త. అతనిని గురించి మనకెక్కువగా తెలియదు. కొందరు అట్టివాడొకడుండుట సందేహాస్పద మందురు.

పర్షియాలో పుట్టిన జొరాష్టరు (జరతుష్ట్ర) జొరాస్ట్రియను మతమును స్థాపించెనని చెప్పుదురు. ఆతనిని మతస్థాపకుడనుట సరికాదేమో! పర్షియాలో అప్పుడున్న మతమునకును, భావములకును నూతన స్వరూపమునిచ్చి నూతన మార్గమున నడిపించెనని చెప్పుట మంచిదేమో? అంతకుపూర్వ మెంతోకాలమునుండి ఈమతము పర్షియాలో లేదనియే చెప్పవచ్చును. పర్షియానుండి చిరకాలముక్రిందట ఇండియాకు వచ్చిన పారశీకులు ఈమతమును తమతోకూడ తెచ్చుకొనిరి. నాటినుండి దాని నాచరణలో పెట్టుచుండిరి.

ఈకాలమున చినాలో కంప్యూసియస్, లోచే అను గొప్ప పురుషు లిద్దరుండిరి. కప్యూసియస్ పేరు నిర్దుష్టముగా వ్రాయవలెనన్న నిట్లుండ వలెను - కాంగ్‌ప్యూచే. సామాన్యార్ధమున వీరిద్దరును మతస్థాపకులు కారు. నీతిమార్గములను, సంఘమనుసరించవలసిన సదాచార మార్గములను వారేర్పరచిరి. చేయదగినపని, చేయరానిపని వారునిర్ణయించిరి. వారి మరణానంతరము వారిపేర పెక్కుదేవాలయములు చీనాలో స్మారక చిహ్మములుగా నిర్మింపబడినవి. హిందువులు వేదములను, క్రైస్తవులు బైబిలును గౌరవించు విధముగా చీనాదేశస్థులు వారి గ్రంధములను గౌరవించుచుండిరి. కంప్యూసియస్ బోధనల ఫలితమే మన, చీనాదేశస్థులు పెద్దమనిషి తరహా, గౌరవముగా నడచుకొనుట, సౌజన్యము, విజ్ఞాన సంపన్నత అలవరచుకొనిరి.

ఇండియాలో మహావీరుడు, బుద్ధుడు ఉండిరి. నేడున్న జైనమతమునుస్థాపించిన పురుషుడు మహావీరుడు. అతని అసలు పేరు వర్దమానుడు. మహావీరు డను బిరుద మాతని గొప్పతనమును సూచించునది. పశ్చిమ హిందూస్థానములోను, కథియవారులోను జైనులధికముగా నివసించుచున్నారు. నేడు వారినితరుచు హిందువులలో చేర్చుదురు. కథియవారులోను, రాజపుత్రస్థానములోని ఆబూపర్వతమందును వారికి సుందరమగు దేవాలయములు గలపు. అహింస పరమధర్మమని వారు నమ్ముదురు, ఎట్టి ప్రాణికిని హానికలుగువిధముగా ఎట్టికార్యమును వారుచేయరు. ఈ సందర్భమున పైతాగొరస్ శాకాహారి యనియు, తన శిష్యులనందరిని శాకాహారులుగానుండ నియమించెననియు తెలిసికొనుటకు నీ విష్టపడ వచ్చును.

ఇప్పుడు మనము బుద్దుడగు గౌతమునివద్దకు వచ్చితిమి. అతడు క్షత్రియుడనియు, రాజకుటుంబములోనివాడనియు నీకు తెలిసియే యుండ వచ్చును. అతని పేరు సిద్ధార్థుడు. అతని తల్లి మాయాదేవి. "ఆమె ఉత్తమ ఇల్లాలు; సర్వమాన్య: బాలచంద్రునివలె ప్రసన్నభావము కలది. భూదేవివలె క్షమాగుణము కలది; పద్మమువలె నిర్మల హృదయము గలది " అని ప్రాతచరిత్ర ఆమెను వర్ణించుచున్నది. సిద్ధార్థుని తల్లిదండ్రులు అతనికి సౌఖ్యమును గూర్చుచుండిరి. సర్వభోగములు అతని కందుబాటులోనుండెను. బాధ, దీనత్వము అతని దృష్టికి తగులకుండ వారు జాగ్రత్తతీసికొనిరి. కాని ఇది సాధ్యముకాలేదు. అతను దరిద్రమును, బాధను, చావునుకూడ చూచినట్లు చెప్పుదురు. చూచుటతోడనే అతని మనస్సు విషాధముతో నిండినది. రాజసౌధమున నాతనికి మనశ్శాంతి చిక్కలేదు. భోగములపై నాతనికి వై ముఖ్యము కలిగెను. అతడు ప్రేమించిన భార్య, సుందరి. యౌవ్వనమధ్యస్థకూడ అతని దృష్టినిబాధపడు మానవులనుండి మరల్పలేకపోయెను. అతడు దీర్ఘాలోచన చేయ మొదలుపెట్టెను. అతడు ఈ బాధలనుండి విముక్తి కనుగొన గోరెను. ఆతడు భరించలేకపోయెను. ఒకనాటి రాత్రి అతడు రాజ సౌధమును, ప్రేమాస్పదులను వీడి, ఒంటరిగా పయనమై విశాల ప్రపంచములోనికి పోయెను. తనమనస్సునకు ఆందోళన కలిగించు సమస్యలను పరిష్కరించవలెననియే అతడు సన్యసించెను. ఇట్టి పరిష్కారము కనుగొనుట కతడెంతకాలమో శ్రమపడెను. చివరకు చాల సంవత్సరముల తరువాత, గయలో ఒక ఆశ్వత్థవృక్షముక్రింద కూర్చునియుండగా అతనికి జ్ఞానము గలిగినదని చెప్పుదురు. అప్పుడతడు జ్ఞానియగు బుద్దుడయ్యెను. ఆ వృక్షమునకు బోధివృక్షమను పేరు వచ్చెను. బోధివృక్షమనగా జ్ఞాన వృక్షమన్నమాట, సారనాథములో డియర్ (లేళ్ళ) తోటలో పురాతన కాశీపట్టణచ్ఛాయలో బుద్ధుడు తన బోధనలను ప్రారంభించెను. మంచిగా జీవించుటకు మార్గమాతడు చూపెను. దేవుళ్ళకిచ్చు బలుల నాతడు ఖండించెను. దానికి బదులు మనము క్రోధము, ద్వేషము, మత్సరము, వక్రాలోచనలు వీనిని బలిపెట్టవలెనని బోధించెను.

బుద్దుడు పుట్టినప్పుడు వేదమతము ఇండియాలో వ్యాపించియుండెను. అప్పటికే అదిమారి ఉన్నత స్థానమునుండి జారిపోయెను. బ్రాహ్మణ పురోహితులు వ్రతములు, పూజలు, మూఢవిశ్వాసము ప్రవేశ పెట్టిరి. పూజలధికమైనకొలది పురోహితులు బాగుపడుచుండిరి. వర్ణ ధర్మములు కాఠిన్యము వహించెను. శకునములు, వశీకరణ మంత్రములు, మంత్ర ప్రయోగములు, బూటకపు చికిత్సలుచూచి సామాన్యప్రజలు భయభ్రాంతులగుచుండరి. పురోహితులీపద్దతుల నవలంబించి ప్రజలను తమ వశములో నుంచుకొని క్షత్రియ ప్రభువుల యధికారమును ధిక్కరించిరి. అందుచే క్షత్రియులకును, బ్రాహ్మణులకును స్పర్ధ ఏర్పడెను. బుద్ధుడు సంస్కర్తగా బయలుదేరి పలుకుబడి సంపాదించెను. అతడు పురోహితుల నిరంకుశత్వమును ఖండించెను. వేదమతమున ప్రవేశించిన దోషముల నన్నింటిని ఖండించెను. ప్రజలు మంచిగా జీవించవలెననియు, సత్కార్యములు చేయుచుండవలెననియు, పూజాదులు చేయరాదనియు అతడు నొక్కి చెప్పెను. బౌద్ధసంఘము నాతడేర్పరచెను. బుద్ధుని బోధల ననుసరించు భిక్షువుల యొక్కయు, సన్యాసినులయొక్కయు సంఘమే యిది.

కొంతకాలమువరకు బౌద్దమతము ఇండియాలో అంతగావ్యాపించ లేదు. తరువాత అదియెట్లు వ్యాపించినదో, పిదప నొక ప్రత్యేకమఠముగానుండక నామమాత్రావశిష్టమైనదో ముందు ముందు చూతము. సింహళము మొదలు చీనావరకు దూరదేశములలో అది ఉచ్చస్థితినందగా జన్మదేశమగు ఇండియాలో అది బ్రాహ్మణమతమున (హిందూమతము) నంతర్భూత మయ్యెను. బ్రాహ్మణమతముపై తన ప్రభావమును చూపి మూఢవిశ్వాసమును, కర్మకాండనుకొంతవరకు దానినుండి తొలగించెను. నేడు బౌద్ధమతము ప్రపంచమం దత్యధికసంఖ్యాకులచే నవలంబించబడియున్నది. అధిక సంఖ్యాకులుగల యితర మతములు క్రైస్తవ మతము, మహమ్మదీయమతము, హిందూమతము, ఇవిగాక హీబ్రూల, సిక్కుల, పారసీకుల, ఇతరుల మతములుకూడ ఉన్నవి. మతములును వాటిని స్థాపించిన పురుషులును ప్రపంచచరిత్రలో అధికముగా పాల్గొన్నారు. చరిత్రను తిరుగవేయునప్పుడు వారిని మనము ఏమరిచి యుండరాదు. వారినిగురించి వ్రాయుటకు నేను సంకోచించుచున్నాను. గొప్ప మతములను స్థాపించినవారు నిస్సందేహముగా గొప్పవారును, ఉదారులును, కాని వారిశిష్యులును, వారితరువాత వచ్చినవారును తరుచుగా అంతగొప్పవారునుకారు. మంచివారునుకారు, మనలను ఉద్దరించవలసినట్టియు, మనలను ఉదారులుగాచేయవసినట్టియు, మతము పశుప్రాయులుగా జనులు ప్రవర్తించునట్లు చేసినట్లు చరిత్రలో మనము చూచుచున్నాము. జ్ఞానమిచ్చుటకు బదులు జనులను అజ్ఞానాంధకారముననుంచుటకు ప్రయత్నించెను. వారిమన స్సులను విశాలపరచుటకు బదులువారిని సంకుచితబుద్దులుగను, పొరుగుపచ్చ కిట్టనివారినిగాను చేసెను. మతము పేరఅనేక మహత్కార్యములు చేయబడినవి. మతము పేరటనే వేలకొద్ది, లక్షలకొద్ది జనులు హత్యచేయబడిరి. అన్ని విధములగు దుష్కృత్యములును చేయబడినవి.

అయితే మతముతో ఒకవ్యక్తి కుండవలసిన సంబంధ మేమి? కొందరికి మతమన్న పరలోకమని యర్థము. స్వర్గమో, దివ్యలోకమో. ఏదోయొక పేరు. స్వర్గమునకు పోవలెననివారు మత ప్రవిష్టులై కొన్ని కార్యములు చేయుదురు, జీలేబీ దొరుకునని తంటాలుపడు చిన్నపిల్లకథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఆస్తమానమును జిలేబీ మీదబుద్ధి పెట్టుకొను చిన్నపిల్ల సరియైన శిక్షణ పొందినదని చెప్పగలవా? జిలేబీలవంటి భక్ష్యములు పొందుటకొరకే పనులుచేయు బాలబాలికల ప్రవర్తన ఆమోదింప దగినదా ! వయస్సువచ్చిన పెద్దమనుష్యులీవిథముగా ప్రవర్తించిన మన యేమనుకొనవలెను? జిలేబీకిని స్వర్గమునకును యథార్థముగా పెద్ద తేడా లేదు. మనమందరమును కొంచమెచ్చుతగ్గుగా ఒంటెత్తుగుణము కలవారము. కాని మనపిల్లలకుమాత్రము ఒంటెత్తుగుణము అబ్బకుండ శిక్షించుటకు ప్రయత్నింతుము. ఏమైనను అన్యుల మేలుకోరుటయే మన ఆదర్శము. అట్టిఆదర్శమును మనమాచరణలో పెట్ట ప్రయత్నించవలెను,

చేసిన పనులకు ఫలితమును పొంద మనమందరము ఆశింతుము. అది సహజమే. కాని మన లక్షమేమి? మనము కోరునది స్వార్ధమా లేక సంఘక్షేమమా? దేశక్షేమమా, లోకకళ్యాణమా : ఈ క్షేమములో మనమును పాల్గొందుముకదా. నాలేఖలలో వెనుక నొక సంస్కృత శ్లోకము నుదహరించితిని. కుటుంబము కొరకు వ్యక్తియు. సంఘము కొరకు కుటుంబముసు. దేశముకొరకు సంఘమును బలికావలెనని దాని తాత్పర్యము. వేరొక శ్లోకభావము నిప్పుడు చెప్పెదను. ఇదిభాగవతము లోనిది. “అష్టసిద్దులను నే నాశించను. మోక్షము నాశించను. జన్మరాహిత్యము కోరను. ఆర్తుల చుఃఖములను నేను సహింతునుగాక. వారిలో ప్రవేశించి వారికి దుఃఖములు లేకుండ చేయుదును గాక."

ఒకమతస్థు డీ విధముగా చెప్పును. వేరొక మతస్థు డింకొకవిధముగా చెప్పును. ఒక డింకొకని బుద్ధిహీనుడనియు, దుర్మార్గుడనియు భావించును. ఇందెవరిమాట సత్యము? చూచుటకుగాని, బుజువుచేయుటకుగాని సాధ్యముకాని విషయములను గూర్చి వారు ప్రసంగింతురు.. కాన ఎవరి వాదము సరియైనదో చెప్పుట కష్టము. అట్టి విషయములను గూర్చి నిర్దారణగా చెప్పుచు తలలు బ్రద్దలుకొట్టుకొనువారికి ఉభయుల మాటలు సాహసోక్తులవలెనే తోచును. మనలో అనేకులము సంకుచిత బుద్ధులము . వివేక మంతగా కలవారము కాము. యావత్తు సత్యముమనకే తెలియునని ఊహించి, దానిని పొరుగువానిచేత బలవంతముగా నమ్మించుట సాహసముకాదా ? మన వాదము సరికావచ్చును. మన పొరుగువాని వాదముకూడ సరికావచ్చును. చెట్టుపై నున్న పువ్వును చూచి దానినే చెట్టు అనము. ఇంకొకడు ఆకుమాత్రము చూచును. వేరొకడు ప్రకాండమునుమాత్రము చూచును. వీరందరును వృక్షభాగములను మాత్రమే చూచినారు. ఇందు ప్రతియొక్కడును చెట్టు పువ్వే అనిగాని, ఆకే అనిగాని, ప్రకాండమే అనిగాని చెప్పుచు పోరాడుట తెలివితక్కువ కాదా ?

పరలోకమన్న నాకు మోజులేదు. ఇహలోకమున నేను చేయవలసిన కర్తవ్యము నా మనస్సును పూర్తిగా ఆక్రమించినది. నాకర్తవ్యము నెట్లు నెరపవలెనో నాకు తెలిసిన నేను సంతృప్తినందుదును. ఇక్కడ నేను చేయవలసిన పని స్పష్టముగా తెలిసిస వేరొక ప్రపంచము జోలి నాకు లేదు.

వయస్సు వచ్చినకొద్ది నీవు అన్నిరకములు మనుష్యులనుచూతువు. దైవభక్తులు, మతము నంగీకరించనివారు, ఏ పక్షమునకును చెందనివారు, ధనమును, అధికారమును వహించు పెద్దదేవాలయములు, మత సంస్థలు కలవు. ఒక్కొక్కప్పుడు సత్కార్యములకు, ఒక్కొక్కప్పుడు చెడ్డకుకూడ అధికారధనములను వారు వినియోగించుచున్నారు. దైవభక్తి గల ఉదారులగు సత్పురుషులను నీపు చూతువు. మతము పేర ఇతరులను మోసగించి దోచుకొను దుర్మార్గులను కూడ నీపు చూతువు. ఈ విషయములను నీపు బాగుగా పర్యాలోచించి వీటి మంచిచెడ్డలు నీవు స్వతంత్రముగా నిర్ణయించుకోవలెను. పెక్కు విషయములు ఇతరులనుండి మనము నేర్చుకొనవచ్చునుకాని నేర్చుకొనదగ్గ ప్రతివిషయమును మనము అనుభపములోనికి తెచ్చుకోవలెను. కొన్ని విషయములు ప్రతిపురుషుడును, స్త్రీయు తనకుతానే నిర్ణయము చేసికోవలసి యుండును.

నిర్ణయము చేసికొనునప్పుడు తొందరపడకూడదు. విద్యాశిక్షణలున్నగాని ఉదాత్తమగు ముఖ్య విషయములనుగూర్చి నిర్ణయమునకు వచ్చుట కష్టము. ఎవరిమట్టుకు వారు స్వతంత్రముగా ఆలోచించుకొని నిర్ణయమునకు వచ్చుట మంచిది. కాని అట్లు నిర్ణయించుకొనుటకు వారికి సామర్థ్యముండవలెను. అప్పుడు పుట్టినశిశువు ఏవిషయమును నిర్ణయించు కొనలేదుకదా! వయస్సు వచ్చినప్పటికిని కొందరు, మనోవికాసమును బట్టిచూడ, శిశువులవంటివారే.

ఈదినమున మామూలుకన్న దీర్ఘముగా ఈ లేఖ వ్రాసితిని. నీకు చదువుట కుత్సాహముగా నున్నదో లేదో, కాని నేను చెప్పదలచుకొన్న విషయము చేతనైనంతమట్టుకు చెప్పితిని. ఇందేవిషయమైన నీకిప్పుడు అవగాహన కాకున్న ఫరవాలేదు. ముందుముందు అర్థముకాగలదు.


15

పర్షియా : గ్రీసు

జనవరి 21. 1931

ఈ దినమున నీజాబు చేరినది. అమ్మ, నీవు కులాసాగా ఉన్నారని వినుటకు సంతోషముగా నున్నది. తాతకు జ్వరము, ఇతర బాధలు తగ్గిన బాగుండును. జీవితకాలమంతము ఆయన ఎంతో కష్టపడి పనిచేసిరి. ఇప్పటికికూడ ఆయనకు విరామము, మనశ్శాంతి కలుగలేదు.

భాండాగారములోని పుస్తకము లేన్నో చదివినట్లును, చదువదగిన క్రొత్త పుస్తకములను చెప్పమనియు అడిగితివి. ఏ పుస్తకములు చదివితివో నీవు నాకు వ్రాయలేదు. పుస్తకములు చదువు అలవాటుమంచిచే. వడివడిగా ఎన్నో పుస్తకములు చదువువారిని చూచిన నా కనుమానము. వారు పుస్తకములు సరిగా చదువరనియు, కప్పగంతులు వేసికొని పోపుచురనియు, చదివినదానిని మరునాడే మరిచిపోపుదురనియు నా అనుమానము. చదువదగిన పుస్తకమైనచో దానిని శ్రద్ధగాను, క్షుణ్ణముగాను చదువవలెను. కాని చాలా పుస్తకములు చదువతగినవికావు. మంచి పుస్తకముల నేరుకొనుటకూడ కష్టమే. మన భాండాగారము నుండి పుస్తకములు తీసికొన్నచో అవి మంచి పుస్తకములే యగునని నీవనవచ్చును. కానిచో వాని నెందుకుతెప్పించి భాండాగారములో

  1. జరతుష్ట్ర బహుశా క్రీస్తు పూర్వము ఎనిమిదవ శతాబ్దిలో ఉండియుండ వచ్చును.