ప్రపంచ చరిత్ర/చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

వికీసోర్స్ నుండి

రేలుట కేర్పాట్లుచేసెను. అలెగ్జాండ్రియా ముఖ్యపట్టణముగా నతడుపరిపాలించినఈజిప్టు ప్రబలరాజ్యమైనది. విజ్ఞానశాస్త్రమునకును, తత్వశాస్త్రమునకును, పాండిత్యమునకును ఆ మహానగరము ప్రసిద్ధికెక్కెను.

పర్షియా, మెసపొటేమియా, ఆసియామైనరులో భాగము వేరొక సేనానివశ మైనవి. అతనిపేరు సెల్యూకసు. అలెగ్జాండరు జయించిన ఇండియా వాయవ్యప్రాంతముకూడ అతని వశమయ్యెను. కాని ఇండియాలో ఏభాగమును అతడు నిలుపుకోలేకపోయెను. అలెగ్జాండరు మరణానంతరము గ్రీకుసైన్యము ఆప్రాంతమునుండి తరుమగొట్టబడెను.

అలెగ్జాండరు ఇండియాకు క్రీ. పూ. 326 సంవత్సరములో వచ్చెను. అతని రాక ఒకచిన్న దాడిమాత్రమే. దానివల్ల ఇండియా కెట్టిలాభముగాని, నష్టముగాని కలుగలేదు. ఇండియా దేశస్థులకును, గ్రీకులకును ఈ దాడివల్ల సంబంధమేర్పడినదని కొందరందురు. కాని, నిజమునకు అలెగ్జాండరుకాలమునకు పూర్వముసైతము ప్రాక్‌పశ్చిమములకు రహదారి యుండెను. పర్షియాతోను, గ్రీకుతో సైతము ఇండియా నిరంతర సంబంధము కలిగియేయుండును. అలెగ్జాండరురాకవలన ఆ సంబంధము మరింత వృద్ధియైయుండును. ఇండియా, గ్రీసువిజ్ఞానము అధికముగా సంమ్మిశ్రితములై యుండును.

అలెగ్జాండరుదాడియు, అతని మృతియు ఇండియాలో ఒక గొప్పసామ్రాజ్యమును-మౌర్యసామ్రాజ్యమును స్థాపించుటకుదారితీసెను. హిందూదేశ చరిత్రలో ఇదియొక గొప్పయుగము. కాన దానిని గురించి తెలిసికొనుటకు కొంతకాలము వినియోగింతము.

18

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

జనవరి 25, 1931

నేనొక ఉత్తరములో మగధపేరెత్తితిని. ఇది యొక ప్రాచీనరాజ్యము. ఇప్పుడు బీహారున్నచోట అది యుండెడిది. ఈరాజ్యమునకు రాజధాని పాటలీపుత్రము. దీనినే ఇప్పుడు పాట్నా అందురు. మనము పరిశీలించుచున్న కాలమున నందవంశమునకు జెందిన రాజులు మగధను పాలించుచుండిరి. అలెగ్జాండరు ఇండియా వాయవ్యప్రాంతముపై దాడిచేసినప్పుడు నందరా జొకడు పాటలీపుత్రమునందుండెను. బహుశా రాజునకు బంధువగు యువకుడొక్కడు - చంద్రగుప్తుడనువా డచ్చట నుండెను. చంద్రగుప్తుడు మిక్కిలి తెలివైనవాడును, సమర్ధుడును. అత్యాశకలవాడును అయియుండునని తోచుచున్నది. నందరాజునకాతనిపై ఇష్టము లేకపోవుటచేతనో, అతడు చేసిన పనివిని సమ్మతించకపోవుట చేతనో అతనిని తన దేశమునుండి బహిష్కరించెను. చంద్రగుప్తుడు ఉత్తరముగా తక్షశిలకు పోయెను. అలెగ్జాండరును గురించి, గ్రీకులను గురించి చెప్పుకొనుచున్న కథలు బహుశా అతనిచెవిని బడినవికాబోలు. అతనితో మిక్కిలి సమర్థుడగు బ్రాహ్మణు డొకడుండెను. అతని పేరు విష్ణుగుప్తుడు. అతనిని చాణుక్యుడనికూడ అందురు. చంద్రగుప్తుడును, చాణుక్యుడును ఏమి సంభవించినను విధికి తలయొగ్గి సంచరించు సాదేశీలురు కారు. ఉన్నతస్థితికి వచ్చుటకై వారెన్నో గొప్పయోచనలు చేయుచుండిరి. వానిని ఆచరణలోపెట్టి విజయము నందగోరుచుండిరి. అలెగ్జాండరు ప్రతిభకు బహుశా చంద్రగుప్తుడు విమోహితుడై, అతని అడుగులలో నడువగోరియుండును. తన కార్యములందు తోడ్పడుటకు చాణుక్యు డుండెను. అతడు అసాధారణ ప్రజ్ఞాశాలి. కూరిమి చెలికాడు. మంత్రిసత్తముడు. ఇద్దరును జాగరూకులై తక్షశిలలో జరుగుచున్న ప్రతివిషయమును శ్రద్ధతో గమనించుచుండిరి. తరుణమునకు వేచియుండిరి.

అవకాశముకూడ వారికి త్వరలోనే వచ్చెను. అలెగ్జాండరు మరణవార్త తక్షశిల చేరుటతోడనే కార్యసన్నద్ధు డగుటకు తరుణము వచ్చినదని యాతడు గ్రహించెను. అచ్చటి ప్రజల నాతడు ప్రబోధించి వారి సహాయముతో అలెగ్జాండరచ్చట నిలిపిన సేనలపైబడి వారిని తరిమి వేసెను. తక్షశిలను స్వాధీనముచేసికొని, చంద్రగుప్తుడు మిత్రరాజులతో కదలి దక్షిణముగా పాటలీపుత్రముమీదకు వెళ్ళి నందరాజు నోడించెను. ఇది క్రీ. పూ. 321 సంవత్సరమున. అలెగ్జాండరు మరణించి సరిగా అయిదుసంవత్సరము లైనపిమ్మట సంభవించెను. ఈసంవత్సరము నుండి మౌర్యవంశపరిపాలనము ప్రారంభమయ్యెను. చంద్రగుప్తుని మౌర్యుడనుటకు కారణము స్పష్టముగా తెలియదు. తల్లి పేరు ముర కాబట్టి మౌర్యుడయ్యెనని కొందరందురు. అతని మాతామహుడు రాజుగారి మయూరపాలకు డనియు, అందుచే అతనికి మౌర్యుడని పేరు వచ్చిన దనియు మరికొంద రందరు. ఆపేర్లు ఎట్లు వచ్చినను ఆతనికి మాత్రము చంద్రగుప్తమౌర్యు డను పేరు వచ్చినది. వేరొక చంద్రగుప్తుడు అను మహారాజు కొన్నివందల సంవత్సరములతరువాత ఇండియాలో నుండెను. వీరిద్దరికిని భేదము తెలియుటకై అతనికి చంద్రగుప్తమౌర్యుడను పేరు నిలిచియుండును.

భారతదేశము నేకచ్చత్రాధిపర్యముగా నేలిన చక్రవర్తుల పేళ్ళను మహాభారతము, ప్రాచీనగ్రంథములు, ప్రాచీనగాథలు పేర్కొనుచుండును. ఆ కాలమునుగురించి మనకు స్పష్టముగా తెలియదు. భారతవర్షము యొక్క విస్తీర్ణ మెంతో కూడ చెప్పలేము. ప్రాచీన రాజుల పౌరుషము నతిశయోక్తులతో పైగాథలు వర్ణించియుండవచ్చును. అవి ఎట్లున్నను ప్రబలమై నలుగడలు విస్తరిల్లిన మొదటి సామ్రాజ్యము హిందూదేశమున చంద్రగుప్తమౌర్యుని సామ్రాజ్యమే యని చరిత్ర మనకు చెప్పుచున్నది. ఇది మిక్కిలి యభివృద్ధిజెంది, శక్తివంతమైయుండెనని ముందుముందు తెలిసికొందము. అట్టి రాజ్యమును, దొరతనమును తటాలున తలయెత్తినని చెప్పుట అసంభవముకదా! చిరకాలమునుండియు తదనుగుణముగా ఎన్నోకార్యములు జరిగియుండవలెను - చిన్నరాజ్యములు కలిసిపోవుట, రాజనీతి వృద్ధియగుట మున్నగునవి.

చంద్రగుప్తుడు రాజ్యముచేయుచున్నకాలమున, ఆసియామైనరు నుండి ఇండియావరకు నున్న దేశమునకు వారసు అయిన అలెగ్జాండరు సేనాని సెల్యూకసు, సైన్యముతో సింధునదినిదాటి ఇండియాపై దండయాత్ర చేసెను. తొందరపడి తాను చేసినపనికి అతడు వెంటనే పశ్చాత్తాపము నందెను. చంద్రగుప్తు డాతనిని పూర్తిగా ఓడించుటచే అతడు వచ్చినదారినేవెళ్ళెను. అతడేమియు సంపాదించలేదు సరిగదా, కాబూలు, హీరటువరకు నున్న గాంధారదేశమును అనగా నేటి ఆప్ఘనిస్థానమును చంద్రగుప్తుని వశము చేసెను. చంద్రగుప్తుడు సెల్యూకసు కుమార్తెను కూడ వివాహమాడెను. ఉత్తర హిందూస్థానమంతయును, ఆప్ఘనిస్థానములో కొంతభాగమును, కాబూలు మొదలు బెంగాలువరకును, అరేబియా సముద్రము మొదలు బంగాళాఖాతము వరకును అతని సామ్రాజ్యమిప్పుడు విస్తరించియుండెను. దక్షిణ హిందూస్థానము మాత్ర మాతని పరిపాలనలోలేదు. ఈ మహాసామ్రాజ్యమునకు రాజథాని పాటలీపుత్రము.

చంద్రగుప్తుని యాస్థానమున రాయబారిగా నుండుటకై సెల్యూకసు మెగాస్తనీసును పంపెను. మెగాస్తనీసు ఆకాలపు వృత్తాంతమును మనోహరముగా వ్రాసియుండెను. కాని అంతకన్న మనోహరమగు వేరొక వృత్తాంతము కలదు. చంద్రగుప్తుని పరిపాలనకు సంబంధించిన వివరము లందు కలవు. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రము. కౌటిల్యుడే మన చాణుక్యుడు, లేదా విష్ణుగుప్తుడు. అర్థశాస్త్రమనగా "అర్థము (ధనము) నకు సంబంధించిన శాస్త్రము."

అర్థశాస్త్ర గ్రంథమున అనేకవిషయములు కలవు. వివిధ విషయములను అది చర్చుంచును. దానిని గురించి అధికముగా నీకు చెప్పుటకు సాధ్యముకాదు. రాజుధర్మములు, మంత్రుల ధర్మములు సభాసమావేశములు, ప్రభుత్వశాఖలు, వర్తకము, వాణిజ్యము, పట్టణపరిపాలనము, గ్రామపరిపాలనము, ధర్మశాస్త్రము, న్యాయవిచారణ స్థానములు, సాంఘికాచారములు, స్త్రీలహక్కులు, వృద్ధులను, అనాథులను పోషించుట, వివాహము, విడాకులు, పన్నులువేయుట, వసూలుచేయుట, భటసైన్యము, నౌకాసైన్యము, యుద్ధము, శాంతి, రాజనీతి, వ్యవసాయము, నూలు వడకుట, బట్టలునేయుట, శిల్పులు, నిరాటంకముగా సంచరించుట కధికార పత్రములు, జైళ్లు సైత మందు వర్ణింపబడినవి. ఈ పట్టికలో ఇంకను ఎన్నోవిషయములు చేర్చుకొనుచు పోగలనుకాని ఈ ఉత్తర మంతయు కౌటిల్య గ్రంథమందలి ప్రకరణ శీర్షికలతో నింపుట కిష్టము లేదు.

రాజుగా నుండుటకు ప్రజల యనుమతిని పొంది పట్టాభిషేక సమయమున, ప్రజాసేవ చేయుటకు సమ్మతించుచు రాజొక ప్రతిజ్ఞ తీసికోవలెను. ఆ ప్రతిజ్ఞ స్వరూప మిది - "నేను మిమ్ము హింసించిన నాకు స్వర్గము దూరమగుగాక. ప్రాణములు దేహమును వదలిపోవునుగాక. నాకు సంతానము లేకుండపోవుగాక." రాజు దినచర్య అందు వర్ణింపబడినది. జరూరుగా చేయవలసిన పని కాత డెప్పుడును సిద్దముగా నుండవలెను. ఎందుకనగా ప్రజాహితకార్యములు పాడై పోవుటకు వీలులేదు. రాజుగారి ఇష్టమునకై వేచియుండుటయును పనికిరాదు. "రాజు సమర్థుడైన ప్రజలను అంత సమర్థులగుదురు." "ప్రజల సౌఖ్యముపై అతని సౌఖ్యము ఆధారపడియుండును. వారి క్షేమమును కోరి, తన కిష్టమైన విషయములు మంచివి కావనియు, ప్రజల కిష్టమైన విషయములే మంచివనియు ఆత డెంచవలెను." మన ప్రపంచమునుండి రాజులు అదృశ్యులగుచున్నారు. నేడు కొద్దిమందిమాత్రమేమిగిలియున్నారు. వారుకూడ త్వరలో విష్క్రమింతురు. ప్రాచీన హిందూస్థానమున రాజరికమనగా ప్రజాసేవ యను విషయము గమనింపదగినది. రాజులకు భగవంతు డిచ్చిన హక్కులు లేవు. నిరంకుశాధికారము లేదు. రాజు దుర్మార్గుడైన, వానిని తొలగించి వేరొకనిని రాజుగా చేయ ప్రజలకు హక్కు కలదు. ఇది ఆకాలపు అభిప్రాయము. ఆకాలపు సిద్దాంతము. నిజమే. పలువురు రాజులు ఈ యాదర్శము నందలేక తమ యవివేకము కారణముగా దేశమును, ప్రజలను కష్టములపాలు చేసిరి.

"ఆర్యు డెన్నటికిని బానిస కాకూడదు" అన్న ప్రాతసిద్ధాంతమును కూడ అర్థశాస్త్రము నొక్కిచెప్పినది. ఆకాలములో పరదేశమునుండి తేబడినవారో, దేశములోనివారో ఒక విదమగు బానిస లుండియుందురు. ఆర్యుల విషయములో మాత్రము వారెన్నడును బానిసలు కాకుండ జాగ్రత్త తీసికొనుచుండిరి.

మౌర్యసామ్రాజ్య రాజధాని పాటలీపుత్రము. అది దివ్యమైన నగరము. గంగానది పొడవునను అది వ్యాపించియుండెను. గంగానదికిని, నగరమునకును మధ్య 9 మైళ్ల భూమి నగరము పొడవునను ఉండెను. దానికి సింహద్వారములు అరువది నాలుగు. చిన్నద్వారములు వందలకొద్ది ఉండెను. ఇండ్లు ముఖ్యముగా కలపతో నిర్మించుచుండిరి. అగ్నిభయ ముండునుగాన, ప్రమాదము సంభవించకుండ ముందు జాగ్రత్తలు ఎంతో శ్రద్ధతో తీసికొనిరి. ప్రధాన వీధులందు వేలకొద్ది పాత్రలనిండ నీరుపోసి యుంచెడివారు. అగ్నిప్రమాదము సంభవించినప్పుడు ఆర్పుటకై ప్రతి గృహయజమానియు నీళ్ళునింపిన పాత్రలను నిచ్చెనలను, కొక్కీలు మొదలైన అవసరమగు వస్తువులను సిద్ధముగా పెట్టుకొని యుండవలెను.

నగరముల నుద్దేశించి కౌటిల్యుడు వ్రాసిపెట్టిన నిబంధన యొకటి విన సొంపుగా నుండును. వీధులలో ఎవ్వరైనను మురికివేసిన వారికి జుల్మానా వేయుచుండిరి. వీధులలో నీరు నిలుచునట్లుగాగాని చాడి ప్రోగుపడునట్లుగాని చేయువారికి జరిమానా విధించుచుండిరి. ఈ నిబంధనలు ఆచరణలో పెట్టియుండినట్లయిన పాటలీపుత్రమును, మిగిలిన నగరములును చక్కగా, పరిశుభ్రముగా, ఆరోగ్యవంతముగా ఉండెడి వనియే చెప్పవలెను. మన పురపాలకసంఘము లిట్టి నిబంధనలు అమలు జరిపిన ఎంత బాగుండునో!

పాటలీపుత్రమునకు సొంత వ్యవహారములు దిద్దుకొనుటకై ఒక పురపాలక సంఘముండెను. ఇందలి సభ్యులను ప్రజ లెన్నుకొనుచుండిరి. సభ్యుల సంఖ్య ముప్పది. అందారు ప్రత్యేకసభలు (కమిటీలి) ఉండెను. ఒక్కొక్కదాని కయిదుగురు చొప్పున ఈ సభ్యు లందుండిరి. నగరమందలి పరిశ్రమలు, చేతిపనులు, బాటసారులకు తీర్థయాత్రీకులకు సదుపాయములు కల్పించుట, పన్నులు విధించుటకై జననమరణములకు సంబంధించినలెక్కలు, నూతన వస్తువులను తయారుచేయుట మున్నగు విషయములను ఈ కమిటీల సభ్యులు విచారించుచుండిరి. పురపాలక సంఘమువారు నగరముయొక్క ఆరోగ్యము, ఆదాయము, నీటిసరపరా, ఉద్యానములు, రాజభవనములు అను విషయములు విచారించుచుండిరి.

న్యాయపరిపాలనకై అప్పుడు పంచాయతీ లుండెను. అప్పీలుకోర్టు లుండెను. క్షామనివారణార్ధము ప్రత్యేకముగా ఏర్పాటులుండెను. దొరతనమువారి గిడ్డంగు లన్నిటిలోను నిలువయున్న సరకులో సగముభాగము క్షేమనివారణార్థము ఉంచుచుండిరి.

చంద్రగుప్త చాణుక్యులచే 2,000 ఏండ్ల క్రితము నిర్మింపబడిన మౌర్యసామ్రాజ్య మేతీరున నుండెను.కౌటిల్యునిచేతను, మెగాస్తనీసు చేతను ఉదహరింపబడిన కొన్ని యంశములు నే నిందు పొందుపరచితిని. వీనినిబట్టి ఆ దినములలో ఉత్తర హిందూస్థానమును గూర్చి కొంతవరకు స్థూలముగా గ్రహింపవచ్చును. రాజధానియగు పాటలీపుత్రము మొదలు నానా మహానగరములును, సామ్రాజ్యమందలి వేలకొలది పట్టణములును పల్లెలును జనసంకీర్ణమై యొప్పియుండవలెను. సామ్రాజ్యమందలి ఒక భాగమునుండి వేరొక భాగమునకు ఘంటాపథము లుండెను. ప్రధాన "రాజపత్త్రము" (రాజమార్గము) పాటలీపుత్రము గుండా వాయవ్య సరిహద్దులవరకు పోయియుండెను. కాలువ లనేక ముండెను. వాటిని సరిచూచుటకును, పొలములకు నీరు పారించుటకును ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖ పనిచేయుచుండెను. నౌకాశ్రయములు, రేవులు, వంతెనలు, ఒకచోటనుండి వేరొకచోటికి తిరుగు అనేకములైన పడవలు, ఓడలు - వీనిని సరిచూచుటకు నౌకాశాఖ యను ప్రత్యేకశాఖ పనిచేయుచుండెను. ఓడలు సముద్రమును దాటి బర్మాకును, చీనాకును పోవుచుండెను.

ఇట్టి సామ్రాజ్యమును చంద్రగుప్తుడు 24 సంవత్సరము లేలెను. క్రీ. పూ. 296 సంవత్సరమున నతడు కీర్తికాయు డయ్యెను. తరువాత జాబులో మౌర్యసామ్రాజ్య కథను సాగింతము.