ప్రపంచ చరిత్ర/ప్రసిద్ధవిజేత, కాని దురహంకారపూరితుడగు యువకుడు

వికీసోర్స్ నుండి

లోని పదార్థములను పరిశీలించిచూచుట యన్నను, ప్రకృతి వైఖరుల నర్థము చేసికొనుటయన్నను అతని కిష్టము. దీనినే ప్రకృతి తత్వశాస్త్ర మందురు. ఇప్పుడు భౌతికశాస్త్ర మనుచున్నారు. కాబట్టి అరిష్టాటిల్ తొలినాటి శాస్త్రజ్ఞులలో ఒక్కడు.

ఇప్పుడు మనము అరిష్టాటిల్ శిష్యుడైన అలెగ్జాండరువద్దకుపోయి వేగముగా గడిచిపోయిన అతని జీవితచర్యను గమనింతము. ఆపని రేపు. ఈ రోజుకు కావలసినంత అప్పుడే వ్రాసితిని.

ఈ రోజు వసంతపంచమి. వసంతాగమము సూచించుచున్నది. అల్పకాలమే నిలిచిన హేమంతము గడచినది. గాలికి చురుకు తగ్గినది. పక్షులు క్రమక్రమముగా మావద్దకు వచ్చుచున్నవి. వాటి పాటలతో పగటి భాగము నంతయు నింపుచున్నవి. 15 సంవత్సరములకు పూర్వము, ఈదినమున, ఢిల్లీ నగరములో మీ అమ్మకును, నాకును పాణిగ్రహణము జరిగినది.

17

ప్రసిద్ధవిజేత, కాని దురహంకార పూరితుడగు యువకుడు

జనవరి 24, 1931

వెనుకటి జాబులోను, అంతకుముందు వ్రాసినజాబులలోను ఘనుడగు అలెగ్జాండరు పేరెత్తినాను. అతనిని గ్రీకు అన్నాను. అట్లనుట సరికాదు. అతడు నిజముగా మాసిడోనియను - అనగా గ్రీసుకు ఉత్తరమున నున్న దేశమునుండి వచ్చినవాడు. అనేకవిషయములలో మాసిడోనియనులు గ్రీకులను పోలియుండిరి. వారిని వారి జ్ఞాతులని చెప్పవచ్చును. అలెగ్జాండరుతండ్రి ఫిలిప్పు మాసిడోనియారాజు. అతడుసమర్థుడగు పరిపాలకుడు. తన చిన్న రాజ్యము నాతడు బలపరిచి సమర్థమగు సైన్యమును కూర్చెను. అలెగ్జాండరును "ఘనుడు" అందురు. చరిత్రలో నాతడు మిక్కిలి ప్రసిద్ధుడు. ముందుగా తండ్రి శ్రద్ధతో చేసిన పనివల్లనే అతడు అనేకకార్యములు చేయుటకు సాధ్యపడినది. నిజముగా అలెగ్జాండరు గొప్పవాడో, కాడో అన్నవిషయము సందేహాస్పదము. నే నాతనిని వీరునిగా తలంచను. జీవించినది కొద్దికాలమే యైనను అతడు తన పేరు రెండు ఖండములలో వ్యాపింపజేయగలిగెను. ప్రపంచవిజేతలలో ప్రథముడని చరిత్రలో చెప్పుట కలదు. మధ్య ఆసియానడిబొడ్డున సికందరను పేరుతో అతనిని నేటికిని స్మరించుచుందురు. నిజమున కాతడెట్టివాడైనను, చరిత్రమాత్రము అతని నామమున కొకవిధమగు ఇంద్రజాలశక్తిని ఆపాదించినది. అనేకనగరముల కాతని పేరు పెట్టబడెను. అవి నేటికిని నిలిచియున్నవి. అందు మిక్కిలి గొప్పనగరము ఈజిప్టులోని అలెగ్జాండ్రియా.

రాజగునాటికి అలెగ్జాండరువయస్సు ఇరువది సంవత్సరములు మాత్రమే. గొప్పతనమును సాధించవలె నను ఆకాంక్షతో అతడు తన కూర్చిన, శ్రేష్ఠమగు సైన్యమును తీసికొని, తనప్రాతశత్రువగు పర్షియా మీదికి దండయాత్ర సాగింప నువ్విళ్లూరుచుండెను. అతని తండ్రి ఫిలిప్పు అన్నను, అతడన్నను గ్రీకులకు ఇష్టము లేదు. కాని వారి బలముచూచి కొద్దిగా భయపడిరి. కాబట్టి వారు, ఒకనితరువాత నొకనిని, పర్షియాకు దండెత్తిపోవు గ్రీకుసైన్యములకు కెప్టెను-జనరల్‌గా అంగీకరించిరి. ఈవిధముగా క్రొత్తగా తలయెత్తుచున్న ఒక గొప్పజాతికి వారు తల యొగ్గిరి. థీబ్సు అను పేరు గల ఒక గ్రీకునగరముమాత్రము ఆతనిపై తిరుగబడెను. దాని నాతడు క్రౌర్యముతో తీవ్రముగా దండించెను. అతడీ ప్రసిద్ధనగరమును విధ్వంసముచేసెను. అనేక నగరవాసులను హతమొనర్చెను. వేలకొద్ది నగరవాసులను బానిసలుగా అమ్మివేసెను. ఇట్టి కిరాతచర్యలు గ్రీకులను భీతావహులను చేసెను. ఇట్టి అనాగరికచర్యలు చూచి మన మతనిని మెచ్చుకోలేము. ఇట్టి చర్యలు మన మసహ్యించుకొందుము. అట్టివానికి మనము దూరముగా నుందుము.
అలెగ్జాండరు సామ్రాజ్యము
అప్పుడు పర్షియారాజుపాలనలో నున్న ఈజిప్టు సులభముగా అలెగ్జాండరు వశమయ్యెను. జరక్ససు తరువాత రాజైన డరయస్ III ను అప్పటకే అలెగ్జాండ రోడించెను. తరువాత ఇంకొకమారు అతడు మరల పర్షియాకు పోయి డరయస్‌ను, రెండవమా రోడించెను. "రాజాధిరాజు" అగు డరయసు కాపురముండు దివ్యమగు రాజభవనమును అలెగ్జాండరు నాశనముచేసెను. జరక్ససు ఏథెన్సును తగులబెట్టినందుకు కసితీర్చుకొనుటకై అట్లు చేసితి నని అలెగ్జాండరు చెప్పెను.

వేయిసంవత్సరముల క్రితము ఫిర్దౌసీ అను కవి పరిషియన్ భాషలో రచియించిన ప్రాచీనగ్రంథ మొకటి గలదు. ఆ గ్రంథము పేరు "షానామా" పర్షియారాజులచరిత్ర లందుండును. డరయస్, అలెగ్జాండరుల మధ్య జరిగిన యుద్ధముల నీ గ్రంథము ఊహాకల్పనలతో వర్ణించెను. ఓడిపోవుటతోడనే డరయస్ ఇండియాసహాయము కోరినట్లు అందు చెప్పబడినది. "వాయువేగముతో నత డోక లొట్టియను" ఇండియా వాయవ్యదిశలో రాజుగానున్న పూర్ (పోరసు) కడకు పంపెను. కాని పోరసు అతని కెట్టి సహాయమును చేయలేకపోయెను. త్వరలోనే అతడు కూడ అలెగ్జాండరుదాడి ఎదుర్కోవలసివచ్చెను. ఫిర్దౌసీ వ్రాసిన "షానామా" అను గ్రంథములో అనేక స్థలములందు ఇండియాలో తయారైన కత్తులు, బాకులు పరిషియాదేశపు రాజులు, ప్రభువులు వాడుచున్నట్లు వ్రాయబడినది. ఆవ్రాతలు చదువుటకు సరదాగా ఉన్నది. అలెగ్జాండరు కాలములో సైతము ఇండియాలో మంచి ఉక్కుతో కత్తులు తయారు చేయుచుండిరని దీనినిబట్టిమనము తెలిసికొనవచ్చును. పరదేశములలోని ప్రజలు వాటిని ఆప్యాయముగా వాడుచుండిరి.

పర్షియానుండి అలెగ్జాండరు తన పర్యటనము సాగించెను. నేడు హీరటు, కాబూలు, సమరఖండము ఉండుదేశముగుండా అతడు ప్రయాణమైవెళ్లి సింధునదియొక్క ఎగువలోయలను చేరుకొనెను. ఇక్కడ మొట్టమొదటి హిందూదేశరాజును అతడు కలిసికొనెను. అతడు అలె గ్జాండరు నెదిరించెను. గ్రీకుచరిత్రకారు లతనిని గ్రీకు సంప్రదాయానుసారము పోరను అనిరి. అతని అసలు పేను పోరసును పోలినదే అయి యుండవచ్చును. కాని మన కది తెలియదు. పోరసు ధైర్యముగా పోరాడెననియు, అతనిని అలెగ్జాండరు సులభముగా జయించలేకపోయే ననియు చెప్పుదురు. పోరసు అమిత పరాక్రమశాలి, దీర్ఘకాయుడు. అతని ధైర్యసాహసములను మెచ్చి అలెగ్జాండరు అతనిని ఓడించినప్పటికిని కూడ తన రాజ్యమున కాతనిని తన ప్రతినిధిగా ఏర్పరచెను. రాజుగా నున్న పోరసు నేడు గ్రీకుల 'సాత్రాపు', అనగా గ్రీకులతరపున పాలకుడయ్యెను.

వాయవ్యదిశనున్న కైబరుకనుమగుండా, రావల్పిండికి కొంచె ముత్తరములోనున్న తక్షశిలమీదుగా అలెగ్జాండరు ఇండియాలో ప్రవేశించెను. నేడుసైతము ప్రాచీననగరమగు తక్షశిలా శిథిలములను మనము చూడవచ్చును. పోరసును ఓడించి అలెగ్జాండరు దక్షిణముగా గంగ వైపునకు వెళ్ళదలచెను. కాని అత డట్లు చేయలేదు. సింధునదీ లోయ ననుసరించి యాతడు తిరిగి వెళ్ళి పోయెను. అలెగ్జాండరు హిందూస్థాన హృదయమనదగు గంగాప్రాంతమునకు వచ్చియుండినచో ఏమి జరిగెడిదో! అక్కడకూడ అతడు విజయము సాదించియుండునా? లేక హిందూదేశసైన్యములే అతనిని ఓడించియుండునా? పొలిమేరలో నుండు పోరసురాజు అతనిని మూడుచెరువుల నీళ్లు త్రాగించెను. మద్య హిందూస్థానమందలి పెద్దరాజ్యములు అతని పురోగమనము నరికట్ట సమర్ధములయి యుండియుండును. అలెగ్జాండరు ఇష్టానిష్టములెట్లున్నను అతని సైనికులే ముందుకార్యమును నిర్ణయించిరి. చాల సంవత్సరములు దేశాటనము చేసియుండుటచే వా రలసిపోయిరి. బహుశా భారతసైనికుల పోరాటవైఖరి చవిచూచియుండుటచే, వారు పరాజయమువచ్చునేమోయని జంకియుందురు. కారణ మేదైనను తిరిగి వెళ్ళుటకే సైన్యము నిశ్చయించి, పట్టుబట్టినది. అలెగ్జాండరు ఒప్పుకొనక తప్పినదికాదు. తిరుగు ప్రయాణముమాత్రము విపత్కరమైపరిణమించెను. తిండిలేక, నీళ్లులేక సైనికు లల్లాడిపోయిరి. వెంటనే కొద్దికాలములో క్రీ. పూ. 323 సంవత్సరమున అలెగ్జాండరు బాబిలన్‌వద్ద దేహము చాలించెను. పర్షియా దండయాత్రకు బయలుదేరినపిమ్మట తన మాతృదేశమగు మాసిడోనియా మరల సందర్శించలేదు.

ముప్పదిమూడవయేట అలెగ్జాండ రావిధముగ మృతినొందెను. తన కొద్ది జీవితములో ఈ 'మహా'పురుషు డేమిచేసినట్లు? కొన్ని యుద్ధములందు అతడు చక్కని విజయములను సాధించెను. అతడు సేనానాయకు డనుటకు సందేహములేదు. కాని అతడు గర్వి. దురహంకార పూరితుడు. ఒక్కొక్కప్పుడు క్రూరముగా, దౌర్జన్యముతో ప్రవర్తించెను. దైవసముడుగా తన్ను అత డెంచుకొనెను. కోపావేశము కలిగినప్పుడు అతడు తన ప్రియమిత్రులను పెక్కండ్రను చంపెను. నగరములను, నగరవాసులతోకూడ నాశనముచేసెను. అతడు నిర్మించిన సామ్రాజ్యములో చెప్పుకోదగిన దేదియు అతడు పోయిన వెనుక నిలిచి యుండలేదు. సరియైన రోడ్లుసైతము వేయించలేదు. ఆకాశమునుండి జారు ఉల్కవలె అతడు వచ్చెను. అతడు వెళ్లెను. అతడు మిగిల్చిన దేదియులేదు. స్మృతిమాత్రము మిగిలెను. అతని మరణానంతరము అతని కుటుంబీకులు ఒకరినొకరు చంపుకొనిరి. అతని మహా సామ్రాజ్యము శకలములై క్షీణించెను. అతనిని ప్రపంచవిజేత యందురు. తనకు జయించుటకు ఇక దేశములు లేవేయని అత డొకమారు కూర్చుండి విలపించెనట! కాని వాయవ్యదిశ యందలి చిన్నభాగమును మినహాయించినచో ఇండియా నాతడు జయించలేదు. అకాలమున సైతము చీనా గొప్ప రాజ్యము. అలెగ్జాండరు చీనాదిక్కునకైనను పోలేదు.

అతడు మరణించినతోడనే అతని సేనానులు అతని సామ్రాజ్యమును పంచుకొన్నారు. ఈజిప్టు టోలేమీ వశమైనది. అత డక్కడ శక్తివంతమగు దొరతనము నేర్పాటుచేసి పరంపరగా రాజవంశమువా రేలుట కేర్పాట్లుచేసెను. అలెగ్జాండ్రియా ముఖ్యపట్టణముగా నతడుపరిపాలించినఈజిప్టు ప్రబలరాజ్యమైనది. విజ్ఞానశాస్త్రమునకును, తత్వశాస్త్రమునకును, పాండిత్యమునకును ఆ మహానగరము ప్రసిద్ధికెక్కెను.

పర్షియా, మెసపొటేమియా, ఆసియామైనరులో భాగము వేరొక సేనానివశ మైనవి. అతనిపేరు సెల్యూకసు. అలెగ్జాండరు జయించిన ఇండియా వాయవ్యప్రాంతముకూడ అతని వశమయ్యెను. కాని ఇండియాలో ఏభాగమును అతడు నిలుపుకోలేకపోయెను. అలెగ్జాండరు మరణానంతరము గ్రీకుసైన్యము ఆప్రాంతమునుండి తరుమగొట్టబడెను.

అలెగ్జాండరు ఇండియాకు క్రీ. పూ. 326 సంవత్సరములో వచ్చెను. అతని రాక ఒకచిన్న దాడిమాత్రమే. దానివల్ల ఇండియా కెట్టిలాభముగాని, నష్టముగాని కలుగలేదు. ఇండియా దేశస్థులకును, గ్రీకులకును ఈ దాడివల్ల సంబంధమేర్పడినదని కొందరందురు. కాని, నిజమునకు అలెగ్జాండరుకాలమునకు పూర్వముసైతము ప్రాక్‌పశ్చిమములకు రహదారి యుండెను. పర్షియాతోను, గ్రీకుతో సైతము ఇండియా నిరంతర సంబంధము కలిగియేయుండును. అలెగ్జాండరురాకవలన ఆ సంబంధము మరింత వృద్ధియైయుండును. ఇండియా, గ్రీసువిజ్ఞానము అధికముగా సంమ్మిశ్రితములై యుండును.

అలెగ్జాండరుదాడియు, అతని మృతియు ఇండియాలో ఒక గొప్పసామ్రాజ్యమును-మౌర్యసామ్రాజ్యమును స్థాపించుటకుదారితీసెను. హిందూదేశ చరిత్రలో ఇదియొక గొప్పయుగము. కాన దానిని గురించి తెలిసికొనుటకు కొంతకాలము వినియోగింతము.

18

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

జనవరి 25, 1931

నేనొక ఉత్తరములో మగధపేరెత్తితిని. ఇది యొక ప్రాచీనరాజ్యము. ఇప్పుడు బీహారున్నచోట అది యుండెడిది. ఈరాజ్యమునకు