ప్రపంచ చరిత్ర/గ్రీకుల నగరరాజ్యములు

వికీసోర్స్ నుండి

ఈ దినమున విరమించుటకు ముందు పాలస్తీనా నొక్కమారు సంగ్రహముగా చూతము. పాలస్తీనా యూరోపులో లేదు. చారిత్రక ప్రాముఖ్యము దానికి ఎక్కువలేదు. కాని బైబిలులోని ప్రాతనిబంధనలో ఉండుటచే పలువురకు దాని ప్రాచీనచరిత్రపై ఇష్టము. ఈ చిన్న ప్రదేశములో నివసించిన యూదులలోని కొన్ని జాతులను గురించియు, వారి కిరుప్రక్కల పొరుగుననుండు ప్రబలులవల్ల వారు పొందిన కష్టములను గురించియు ఆందు వర్ణింపబడెను. ఆ పొరుగువారు - బాబిలోనియా, అస్సీరియా, ఈజిప్టు, యూదులయొక్కయు, క్రైస్తవులయొక్కయు మతములలో ఈ కథ ప్రవేసింపకున్నచో దాని సంగతి ఎవరికిని తెలిసెడిది కాదు.

ఇస్రాయేలు పాలస్తీనాలో ఒక భాగము, క్నోస్సోస్ నాశనమైన కాలమున ఇస్రాయేలుకు రాజు సాల్ అనువాడు. తరువాత డేవిడ్. ఆ తరువాత సోలమెన్ రాజులైరి. సోలమన్ విజ్ఞాని యని పేరొందెను . ఈ మూడు పేళ్ళను ఉదహరించుటకు కారణము నీపు వానిని గురించి విని యుండవచ్చును. లేదా చదివి యుండవచ్చును అని.


7

గ్రీకుల నగర రాజ్యములు

జనవరి 11, 1931

వెనుకటిజాబులో గ్రీకులను (హేల్లనీలు) గురించి కొంత చెప్పితిని. వారి నింకొకమారు చూచి వారెట్టివారో తెలిసికొందము. మన మెప్పుడునుచూడనివారిని గురించిగాని, వస్తువులను గురించిగాని సరియైన, యధార్ధమైన అభిప్రాయము మనకు కలుగుట మిక్కిలి కష్టము. మనము ప్రస్తుత పరిస్థితుల కలవాటు పడియున్నాము. మన బ్రతుకు వేరు. ఇట్టి మనము పూర్తిగా భిన్నముగా నున్న ప్రపంచము నూహించుకొనుట కష్టము. ప్రాచీనప్రపంచము. ఇండియాకాని, చీనాగాని, గ్రీసుకాని. నేటి ప్రపంచమునకు పూర్తిగా భిన్నముగా నుండును. మనము చేయగలిగిన దేమనగా - వారి గ్రంథములయొక్కయు, భవనములు మున్నగు శిథిలములయొక్కయు సహాయముతో ఆకాలపు ప్రజ లెట్లుండెడివారో ఊహించుకొనుటయే.

గ్రీసును గురించిన యొక విషయము మిక్కిలి మనోహరముగ నుండును. పెద్ద రాజ్యములన్నను, సామ్రాజ్యములన్నను గ్రీకుల కిష్టమున్నట్లు తోచదు. వారికి నగరరాజ్యములపై ఇష్టము. అనగా, ప్రతి నగరమును ఒక స్వతంత్రరాజ్యము. అవి చిన్న ప్రజాప్రభుత్వములు. మధ్యను నగరముండును. దానిచుట్టును పొలము లుండును. వానినుండి నగరమునకు కావలసిన భోజనపదార్దములు వచ్చును. ప్రజాప్రభుత్వముస రాజుండడని నీకు తెలియునుగదా ! ఈ గ్రీకు నగరరాజ్యములకు రాజులు లేరు. ధనవంతులగు పౌరులే వానిని పరిపాలింతురు. సామాన్యప్రజలకు పరిపాలనతో ఎట్టి సంబంధమునులేదు. పలువురు బానిస లుందురు. వారికి హక్కులుండవు. స్త్రీలకుకూడ హక్కులులేవు. నగరరాజ్యములలోని జనసంఖ్యలో ఒకభాగమేపౌరులు. కానవారేరాజకీయ విషయములను గూర్చి వోటు ఇయ్యవచ్చును. ఒక్కస్థలమున పౌరులందరిని చేర్చుట సులభముకాన వారు వోటువేయుట కష్టము కాదు. అది చిన్న నగర రాజ్యము కాబట్టే ఇట్లు చేయుటకు సాధ్యమగుచున్నది. ఒకే దొరతనము క్రిందనున్న పెద్ద దేశమైన నిది సాధ్యముకాదు. ఇండియాలో ఉన్న వోటర్లు అందరునుకాని, పోనీ బెంగాలు రాష్ట్రమందలి వోటర్లందరును గాని, ఆగ్రాలోని వోటర్లందరునుగాని ఒక చోట కూడుట యన నేమో ఊహించుకొనుము. ఆది ఎంతమాత్రము సాధ్యముకాదు. పిదపకాలములో నితరదేశములం దిట్టికష్టము తటస్థించినది. దానిని పరిష్కరించుటకు “ప్రతినిధి ప్రభుత్వము"ల నేర్పాటుచేయవలసివచ్చెను. అనగా ఒక విషయమును నిర్ణయించుటకు ఆ దేశమందలి వోటరులందరును ఒకచోట కూడుటకుబదులు, వారి వారి ప్రతినిధుల నెన్నుకొందురు. ఆ ప్రతినిధు లందరును సమావేశమై దేశమునకు సంబంధించిన రాజకీయ వ్యవహార ములను గూర్చి యాలోచించి శాసనములను నిర్మింతురు. ఈ విధముగా సామాన్యుడగు వోటరు తన దేశపరిపాలనకు పరోక్షముగా సాయపడుచున్నాడు.

ఇదంతయు గ్రీసుతో సంబంధించినది కాదు. ఇట్టి కష్టసమస్య రాకుండ గ్రీసుచేసికొన్నది. నగరరాజ్యములకంటె పెద్దరాజ్యముల నది పెట్టుకొనలేదు. నేను చెప్పినట్లుగా గ్రీకులు గ్రీసునంతను, దక్షిణఇటలీనీ, సిసిలీని, ఇతర మధ్యధరాతీరములను ఆక్రమించినప్పటికిని వారు సామ్రాజ్యమును స్థాపింప ప్రయత్నించలేదు. వారి వశములో నున్న యావత్ప్ర దేశములకును ఒకే ప్రభుత్వము పెట్టుకొన ప్రయత్నించలేదు. పోయిన చోట్లనెల్ల వారు తమ ప్రత్యేక నగరరాజ్యమును స్థాపించిరి.

ఇండియాలోకూడ, తొలిరోజులలో, చిన్న ప్రజాప్రభుత్వము లుండెడివి. అవి గ్రీకునగరరాజ్యములవంటి రాజ్యములు. కాని అవి చిరకాలము జీవించినట్టులేదు. పెద్దరాజ్యములలో అవి లీనమైపోయినవి. ఆ విధముగానే చాలకాలమువరకు మన గ్రామపంచాయతులు గొప్ప పలుకుబడి సంపాదించినవి. ప్రాచీనకాలమునాటి ఆర్యులు, తాము పోయిన చోట్ల నెల్ల చిన్న నగరరాజ్యములు స్థాపించవలెనని యుద్దేశించియుండ వచ్చును. భూగోళమునకు సంబంధించిన పరిస్థితులను, ప్రాచీన నాగరికతలతో సంసర్గమును, వారు నివసించిన పెక్కు దేశములలో తమ యుద్దేశమును క్రమముగా వదలుకొనుటకు కారణము లాయెను. ముఖ్యముగా పర్షియాలో గొప్పరాజ్యములు, సామ్రాజ్యములును వర్దిల్లినవి. ఇండియాలోకూడ రాజ్యములు పెద్దవిగా పెరుగుట కున్ముఖములైనవి. కాని గ్రీసులో నగర రాజ్యములు చిరకాలము నిలిచియుండెను. చివరకు, చరిత్రలో ప్రసిద్ధినందిన గ్రీకుపురుషుడొకడు ప్రపంచమును జయించుటకు, మనకు తెలిసినంతమట్టుకు, మొదటి ప్రయత్నము చేసెను. అతడు ఘనుడగు అలెగ్జాండరు. ముందుముందు అతనిని గురించి కొంచెము చెప్పుకొందుము. తమ నగరరాజ్యముల నన్నింటిని కలిపి ఒక రాష్ట్రముగానో, రాజ్యముగానో, ప్రజారాజ్యముగానో చేయుటకు గ్రీకులు సమ్మతించలేదు. నగరరాజ్యములు వేటి కవి ప్రత్యేకముగా స్వతంత్రముగా నుండుటయే గాక అవి దాదాపు ఎల్లకాలముల అన్యోన్యము పోరాడుచుండెను, వారిలో వారికి తీవ్రమగు స్పర్థలుండుటచే, తరుచు యుద్ధములలోనికి దిగుచుండిరి.

అయినను ఈ నగర రాజ్యముల నేకముగా బంధించు సమాస విషయములు లేకపోలేదు. వారికి భాష సమానము. విజ్ఞానము సమానము. మత మొక్కటే. వారి మతమున ననేక దేవుళ్లు, దేవతలు ఉన్నారు. ప్రాచీన హిందువుల పురాణములవంటి అందమైన, అమూల్యమైన పురాణములు వారికిని గలవు. సుందరమగుదానినెల్ల వా రుపాసించిరి. ప్రాతకాలమునాటి వారి చలువరాతి విగ్రహములు, శిలా విగ్రహములు కొన్ని నేటికికూడ నిలిచియున్నవి. అవి సౌందర్యమును వెలిగ్రక్కుచున్నవి. శరీరముల నారోగ్యముగా, అందముగా పెట్టుకొనుట వారువిధిగా చూతురు. అందుకై ఆటలను, పోటీపందెములను వా రేర్పాటుచేసికొనుచుండెడి వారు. గ్రీసులోని ఓలింపియా యను ప్రదేశమువద్ద అప్పుడప్పు డీ యాటలు మిక్కిలి వైభవముగా జరుగుచుండెడివి. అప్పుడు గ్రీసుదేశ మన్నిప్రాంతములనుండి జనులు వచ్చి సమావేశ మగుచుండిరి. నేడుకూడ జరుగుచున్న ఓలింపిక్ ఆటలనుగూర్చి నీవు వినియుందువు. ఓలింపియాలో జరిగిన గ్రీకుల ఆటలనుండి గ్రహించి ఈ పేరు నేడు వేర్వేరు దేశములకు జరుగు పోటీపందెములకును, ఆటలకును పెట్టబడినది.

కాబట్టి గ్రీకు నగరరాజ్యములు ప్రత్యేకముగా జీవించుచుండెడివి. ఆటలప్పుడు కలిసికొనుచుండెడివి. తమలోతాము పోరాడుచుండెడివి. కాని బయటనుండి ఏదైన గొప్ప ప్రమాదము వచ్చినప్పుడు అవి యన్నియు ఏకమై వారించుచుండెడివి. అట్టి ప్రమాదము పర్షియనుల దండయాత్ర. ముందు ముందు దానిని గురించి కొంత చెప్పవలసి యున్నది.