ప్రజ్ఞా ప్రభాకరము/నాడీగ్రంథములు

వికీసోర్స్ నుండి

౩౦

నాడీగ్రంథములు

తంజావూరిలో పరిశీలించిన గ్రంధముల విషయమున జరపవలసిన తర్వాతి కార్యములను జరపుటకు మద్రాసులో మేము గొంత పని చేయవలసియుండుటచే మూఁడు నాల్గు నెలలు మేము మద్రాసులో నే యుంటిమి. అప్పుడు మద్రాసు గవర్నరుగా పెంట్లండు దొరగా రుండిరి. ఆయన నెవరో ఇంగ్లండు వారో, జర్మనీవారో ప్రేరేచి రఁట!' తంజావూరి విలువ కట్టుటకు గ్రంధముల పరిశీలనము జరుప వలసెను. మమ్మందుకు తంజావూరు పంపిరి.

ఈ రహస్యము పైకి పొక్కినది. ప్రజలు గందరగోళము చేసిరి. గవర్నరుగారు తమ తంత్రము కట్టిపెట్టిరి. ఒక విధముగా మే మక్కడికి వెళ్ళి జరపిన పరిశీలనము వ్యర్ధమయినది. కాని యానాఁడు మేము వ్రాసిన విమర్శములు గొన్ని యటుతర్వాత తంజావూరి కేటలాగులు ప్రకటించువా రుపయోగించుకొనిరి. మేము విలువ కట్టుట కేవలయు నంశములను బ్రధానముగాగూర్చితిమి. కాని గ్రంధాంశపర్యాలోచానకుఁ గాదు. కాన మా లిస్టులలో ఆ యావిషయములు పర్వాప్తముగా సేకరింప లేదు గాని పుస్తకముల నన్నింటిని సరిగా గుర్తించితిమి గణించితిమి. గవర్నరు గారిపనివ్యర్ధమయిన తర్వాత మా లిస్టులనన్నింటిని తంజావూరి లైబ్రరీ కిచ్చి వేసితిమి. ఆలెక్క కట్టుపనిలో నేను మద్రాసులో నుండి ఆరోగ్య విషయమున గ్రంధపరిశీలన విషయమున, యోగసాధన విషయమునఁ జాల నభ్యు దయము చెందితిని. ప్రతి దినము నేను మిత్రులతోఁ గలసి యోగా భ్యాసము చేయుచుంటిని.

   ఆ నాళ్ళలో ధ్రువనాడీ పరిశోధన మధికముగా జరగెను. అందు శ్రీవారి జాతకము పరిశీలించుట జరగెను. ఇంక  ననేక  మిత్రుల  జాతకము పరిశీలనము జరగెను. ఆ యుత్సాహమున నా జాతకమును బరిశీలింపించుకొంటిని. ద్రువనాడీ సత్యాచార్య ప్రణీత మని యం దున్నది. సత్యా చార్యుఁ డు పంచ సిద్ధాంతి కాది గ్రంధకర్త యనియు, క్రీ. 4- వ శతాబ్ది వాఁడనియు యిందలి భాషా శైలీ లక్షణాదులను జూడఁగా నది సత్య మనిపించదు.
   ఈ నాడీగ్రంధములు సంస్కృత ద్రవిడ భాషలలో నరవ దేశముననే యధికముగాఁ గలవు. ఆంధ్రదేశమునఁ గూడ నాంధ్ర భాషలో వేముల వాడ భీమన రచితముగా నొక నాడీ గ్రంధ మున్నది. కాని యది సీసమాలికగా వేములవాడ భీమకవి రచన మని విశ్వసింపఁ దగనిదిగానే యున్నది. దానిని ప్రాచ్య లిఖిత పుస్తకశాలకు నేనే సేకరించితిని. అది ప్రస్తుత కాలమున నుపయోగపడునది కాదు. ఇక సంస్కృత ద్రవిడ గ్రంధములలో ధ్రువ నాడీ యని, సత్యసంహిత యని, శుక్ర నాడీయని నాల్గు గ్రంధముల నే నెఱుఁగుదును. అవి యెవరో ప్రాచీన మహర్షులు, తత్కల్పులు రచించినవిగా నున్నవి. ధ్రువనాడీ సత్యసంహితలు సత్యాచార్యు రచన లనఁ గా నేనే మనుకొంటి ననఁగా సత్యాచార్యుని యంశమున నిటీవల జనించినవా రెవరో పూర్వానుస్మృతి కలిగి వానిని రచించి యుందు రని.
   ఇక్కడ వక్తవ్యము చాలఁ గలదు. ఈతఁడు శివాంశమున జనించినాఁ డనీ (అప్పయ దీక్షితాదులు), ఈతఁడు గుడిగంట యంశమున జన్మించి (వేదాంత దేశికులు ) నాఁడనీ  యిత్యాది విధములఁ బలువురను ప్రాచీన మహనీయులను గూర్చి ప్రామాణికులే నిర్ణయించి పలుకు  చుండుట కలదు. ఆయా దేవతల ఖండావతారములుగా వారిని నిర్ణయించుట సంగతము. ఆయా మహామహులు లోకమున నేవేవో యపూర్వాద్భు తార్ధములను వెలయించుటకై యవతరించుట కలదు. దేశ కాలాదుల యసౌకర్యముబట్టి యాయా కార్యములను వా రప్పుడప్పుడే యాయా యవతారములలోనే నిర్వర్తింప వీలుకడక పోవచ్చును. శుద్ధసంకల్పులు గనుక వారు వా రాయా కార్యములను గొన్ని జన్మముల నెత్తి నిర్విర్తింప వలసిన వారగుచుందురు. శంకర, జిన, బుద్దాదుల కార్యములట్లే యొక జన్మమున నిర్వాహము చెంద వయ్యెను.
   అతి ప్రాచీనులయి జ్యోతిషమున నద్భుత గ్రంధములు రచించిన సత్యాచార్యాదులు  మరల మరల జన్మించుచు లోక వృత్తమును గొన్ని కొన్ని షష్టులకు రచించుచు వచ్చుచుండి రని నా విశ్వాసము. తర్వాతి తర్వాతి జన్మముల వారి వారి గ్రంధములకే నాడీ గ్రంధము లని పేరు. అవి కొన్ని కొన్ని షష్టులకే రచితము లయి యుండు ననియు నావిశ్వాసము. వారువారాయాజన్మములలో జ్యౌతిష ప్రజ్ఞ కే పారమార్ధ్యము గల్పించుకొనుటచే భాషాపాండిత్యమునకై యంతగాప్రాకులాడ రయిరి. వారి గ్రంధముల లోనిభాషనిర్దుష్టముగాదు. ప్రౌఢములుగాలేకపోలేదు. రుచిగల, యరద విశేషముల గల జాతక భాగములఁ జెప్పుచో శ్లేషాద్యలంకారములతో  నతి రసవంతమగు భాషతో నాయా గ్రంధ భాగము లున్నవి. అందు శబ్దజాలము క్రొత్తగా నేఁడు పుట్టుచున్నను మనుష్యులను  గూర్చి వారి వర్తనముల గూర్చి పేళ్ళ గూర్చి కూడ నండును. ఈ నాఁడు క్రొత్త వెలసిన, వెలయు చున్న రేడియో, రేడియం, ఎక్సురే, కాస్మిక్రే, ఆటంబాంబు మొదలగు వానిని గూర్చి కూడ నందుం డును.

తద్గృంధక ర్తల నాఁటి కీ విషయములు భవిష్యద్విషయములే యయినను నా గ్రంధములలో నాయా భాగములఁ జదివి వెళ్ళడించి నంతవఱకు భూతమును, దరు వాతిది భవిష్య త్తును నగుట గాన వచ్చును. ఆయా గ్రంధములు చదివిన నాఁటి దాఁక విషయములు జాతకునకు చక్క సరిపడునవిగా నంత దాఁక తు. చ తప్పకుండ జరిగినవిగా నుండుటచే దానిని బట్టి తర్వాతి గ్రంధబాగమును విశ్వసించి జాతకుఁడు గయికొనును. తర్వాత నదితప్పిపో నారంభించును. క్రమముగా నన్ని విషయములు విస్పష్టముగాఁ దప్పిపోవుచుండును. ధ్రువ నాడిలో నట్లు జాతకము తప్పి పోవునట్లు గుర్తించి యడుగఁగా నపుడు సరిపోయినదిగా నింకొక తాటియాకు దొరకును. అది పూర్వపుటాకు కంటె కొంత హెచ్చు భాగములు సిరిపోయి నదిగా నుండును. కొన్నాళ్ళ కిదియు తప్పి పోవును. ఇట్లు ఆనాడి, తత్పాఠకుఁ డు, జాతకుఁ డు ఉన్నంత దాఁక చదువుచునే యున్నచో జాతకము సరిదిద్దుకొనుచునే యుండ వచ్చును. కాని రే పిట్లు జరగఁ గల దని సునిశ్చితముగా నే నాది గ్రంధము గాని చెప్పుట నే నెఱుఁగను. ప్రత్యుత తద్విరుద్ధముగా జరగుటయు నెఱుఁగుదును.

   పర్యాలోచించి చూడఁగా నొక్కొకప్పుడా గ్రంధ మాయా వేళకు కనుకూలముగా నిర్మిత మగుచుండు నేమోయని తోఁచును. ధ్రువనాడిలో జాతకము తప్పినపు డెల్ల క్రొత్త జాతకము దొరకు చుండుట యిట్టిదే . కాన యా నాడి నుపయోగించు గ్రంధ స్వామి దానిని సృష్టించుచుండెనని కొంద ఱందురు. నాడి తప్పునప్పు డెల్లఁ దద్గ్రం స్వామిని కొందఱు తస్కరుఁడు, తప్పుడు సృష్టి చేసె నని నిందించు చుందురు. దానిని జదివినందు కాతఁడు కొంత సొమ్ముగయి కొనుచున్నాఁడు గాన యక్రమముగాఁ నాతఁ డా నిందకు బాల్పడ వలసి వచ్చుచుండును. అంతేకాని నిజముగా నా గ్రంధ స్వామి దానిని సృష్టింపఁ జాలఁ డగుట నేను బాఠముగా నెఱుఁగుదును. ఆతని దృష్టి కా యక్షరము  లట్లు కానవచ్చె నని కాని యాతని తల కట్లు శ్లోకపరంపర తోఁ చె నని కాని వాకొనుట యుక్తము.  ధ్రువనాడీస్వామి  యగు శేషాచార్యుని విషయమున నీయర్ధముయధార్ధము. అస్మదాదుల మనేకుల మా గ్రంధమున నుండి యా నాఁడు జాతకముల వ్రాయించు కొంటిమి. అబ్బురము చెందుచు మిత్రు లనేకులకు జాతకములు వ్రాయించితిమి. వ్రాయు నప్పుడు విడువకుండ సన్నిధినే యుంటిని. ఇంత యేల? అస్మదాచార్యపాదాల జాతకము నందుండి పఠించునపుడు, వ్రాయించునపుడును నేను సన్నిధినే యుంటిని. ఇంకను గొందఱు మిత్రులుండిరి. ఆ గ్రంధము గల శేషాచార్యుఁడు శ్రీ వారియెడ  నప్పు డద్బుతభక్తి గల శిష్యుఁడు  వారి జాతకము నంతవఱకు నక్ష రాక్షరము సత్యముగా  నుండెను.
   అందులో నాకు విడ్డూరము  గొల్పిన విషయములు గొన్ని యున్నవి.
   " బ్రహ్మస్వరూపో భగవాన్ దర్శనం చక్వచిత్ క్వచిత్ 
   ఆసర్శనం క్వచిచ్చేతి తత శ్చంచలబుద్దిమాన్ "
   అని నల్వదవయేటి వృత్తంతము వర్ణిత మయి యుండెను. ఇది చదువుచో  నేను  దగ్గఱ నుంటిని. ప్రతి పదము ప్రామాణిక మగునో కాదో యని శ్రీ వారు  పరీక్షించు చుండిరి. ఈ శ్లోకము చదువునపుడు కొంత యాగి యోచించి నవ్వి 'సరిగా వాక్రుచ్చినాఁడు. మీద చదువుఁ డు' అనిరి.
   అప్పుడీ శ్లోకమున కర్ధ మేమో బ్రహ్మదర్శనము లభించుట యనఁగా నెట్టిదో, అప్పుడే మి జరిగినదో వివరించి తెలుప వేఁడెద నని చివరిదాఁక ప్రశ్నము సాగును గాని నాలుక దాఁటి బైటికి రాదయ్యెను. ప్రశ్నింప వలె నని చాల తంటాల పడితిని గాని ప్రశ్నింప నా చేతఁ గాలేదు.' జీర్ణ మంగే సుభాషితమ్' అన్నట్టుగా నీ ప్రశ్నార్ధము నా లోనే నిలిచి పోయినది గాని పయికి రానే లేదు. నేనీ యోగ మార్గమున చేరిన పదియేండ్లకు అనఁగా 1926- వ సంవత్సరమున నా యను భవమున నొక యద్భుతానంద మయ విషయము జరగెను. దాని నెఱుగుదునంతేకాన1936 దాఁక అనఁగా మఱి పదియేండ్లదాఁకఁ గాని దాని వివరణ మెల్ల తెలియరాదయ్యెను. దానినాయాసందర్భము లందు వివరింతును.

ఈ నాడీగ్రంధము లాయా జాతకుల హృదయములలో దాగియుండిన రహస్యార్దముల గూడఁ గొన్ని కొన్ని పట్టులం దద్భుతముగా వివరించుట కలదు. అవి నాడీరచయితకును, జాతకు నకునే తెలియ వలెను గాని గ్రంధ పాఠకుఁ డగు నాడీస్వామికిఁ గూడ తెలియవు. ధ్రువనాడిలో నిట్టి వానిని గొన్నింటిని బేర్కొందును.

   'జలగండ మవాప్నోతి మృతప్రాయోపజీవనః' అని నా జాతకమునఁ గలదు. నేను మఱచితిని గాని యది జరగిన విషయమే! మా దొడ్డిలో పిల్లలము కొందఱ మాడుకొనుచుంటిమి.  నూతిలో వెదురుగడలు దింపి వానిని బట్టుకొని పైకి లాగుచుంటిము. నేను వేసినగడ నీటిలో అడుగున బురదలో లోనికిఁ జొచ్చుకొన్నది. దాని పై యంచు ఒరమిఁద నున్న నా కందకుండెను. లోనికి తలవాంచి యెట్లే నందుకొన జూచుచుంటిని. ప్రక్క పిల్లవాఁడు నా ముడ్డి పైకెత్తెను. నేను నూతిలోఁ బడిపోయితిని. పిల్ల లందఱు పటాపంచలై పాఱిపోయిరి. మా నాయనగా రూర లేరు. మా యమ్మగారు నింటిలో నేదో పని చేసికొనుచుండిరి. నూతిలో పెద్దధ్వని గలుగుట ప్రక్కయింటి యాతఁ  డాలకించి దొడ్డిలోనికి వచ్చి చూడఁ గా పిల్ల లందఱు పాఱిపోవుచుండిరి. ఒక పిల్ల వానిఁ బట్టుకొని గట్టిగా నడుగఁ గా నేను నూతిలోఁ బడుట చెప్పెను. ఆతఁ డు పర్వెత్తుకొని వచ్చి చూచుతఱికి నాల్గు మూఁడు నిమిషము లాయెను. నే నొక మునుక వేసి తేలి నూతిలో నూగిసలాడుచున్న గడను పట్టుకొని మరల మునుక వేయక తేలియుంటిని. ఆతఁ డొరల మిఁదుగా దిగివచ్చి నన్నుఁ బట్టుకొని మా యమ్మగారి కప్పుజెప్పెను. ఈ విషయ మా నాడిలో నున్నది.
   అట్లే పందొమ్మిదవ యేట అవనిగడ్డ దగ్గఱ బండి యేటి లోనికి దిగుచుండఁ గా బోల్తా  కొట్టి చచ్చి బ్రదికితిని." వాహనాత్పతనం చైవ తిన్మూలాచ్చ మహాద్విపత్" అని యందు కలదు. ఇట్టివి ప్రతి జాతకములోను వింత వింతలుగా నుండుట నే నెఱుఁ గుదును.
   నే నెఱిఁగిన మఱొక గొప్పవింత. మద్రాసులో నొకా నొక గొప్పయింట నొక పిల్లవాని కేదో కడుపులో తీవ్రమయిన యనారోగ్యము. అది కుదుర్పరానిది. బ్రదికిన నొక వేళ శస్త్రచికిత్సతో బ్రదుక వచ్చు నని యాస. ఆ కుఱ్ఱ వాఁడు జీవించునో లేదో గుర్తించుటకు ధ్రువనాడీకారున కత్యధిక ధన మిచ్చి యింటికి రప్పించి గ్రంథము నక్కడే యుంచి చదివించుచుండిరి. ఆ కుఱ్ఱవాని జాతకము సరిగానే యందుఁ గలదు. ఆతని యనారోగ్యపు నిర్వచన మెల్ల సరిగానే యందుఁ గలదు. ఆ జాతకపు టాకు తుదిపట్టు చదువుచుండిరి. అంతలో ఆపరేష౯ చేయుటకు డాక్టరు రంగాచార్యులు గారు విచ్చేసిరి. ఆ సమయమునకు సరిగా 'శస్త్ర వైద్యేన జీవతి' యన్న వాక్యము నాడిలో వచ్చెను. తరువాతి యాకు నిఁక చదువవలెను. డాక్టరుగారు వచ్చుటచే నంతట నాపిరి. అందఱకును ఆ కుఱ్ఱవాఁడు శస్త్రవైద్యముచే జీవించును అనియే యర్థము స్ఫురించెను. డాక్టరు శస్ర్తోప క్రమమునకు సిద్దపడుచుండెను. నాడీగ్రంథమునఁ జదువుచున్న పట్టున గుర్తించి కట్టిపెట్టి గృహస్వామి యినుప పెట్టెలో తాళము వేసి తాళముచెవి నాడికారున కిచ్చెను. మర్నాడు వచ్చి కడమ గ్రంథమును జదువుట కేర్పాటు జరగెను. తొందరగా నాడీకారుఁడు శేషాచార్యుఁ డింటికి వచ్చివేసెను. ఈ విషయ మెల్ల మాతోను జెప్పెను. మేమును నాతఁడు జీవించు ననియే యనుకొంటిమి.

మర్నాడు శేషాచార్యుఁ డుదయమున వారింటికి వెళ్ళెను. ఆపరేష౯ జరుగుచుండఁగానే ఆ బాలుఁడు మృతుఁ డౌట తెలియవచ్చెను. అక్కడి పండితులు నివ్వెఱ చెందుచుండిరి. ఈతనిని నాడీ తెఱవు మనిరి. తెఱవఁగా నా జాతకమున తుదిశ్లోక మదియే. తర్వాతి యాకులో వేఱొక జాతకము ముపక్రాంత మయ్యెను. పర్యాలోచింపఁ గా- శస్త్ర విద్యే = శస్త్రవైద్యమున (వైద్యము జరగు కాలమున) నజీవతి = చనిపోవును అని యర్దమగుట, అట్టగుటచేతనే జాతకపుఁ బైభాగము లేకుండుట తెలియనయ్యెను. అందఱును దైవవంచనకు ఖిన్ను లయిరి. ఇట్టి వానిని ధ్రువనాడీ చమత్కారముల నెన్నింటి నేని పేర్కొన నెఱుఁగుదును.

    అందు సి. వి. వి. యోగమార్గమునఁ జేరిన వారి జాతకములు పదులకొలఁదిగాఁ  జదువుట నే నెఱుఁగుదును. ఆ చదువుట నా సమక్షముననే జరగినది. శ్రీవారి జాతకమునఁగల విషయములే యనేకుల జాతకములం దున్నవి. శ్రీవారి జాతకమును, శిష్యులయు తదితరులయు  జాతకములును గొన్నా ళ్ళయిన తర్వాతఁ దప్పిపోవుటయు, మరలఁ జూడఁ గా సరియయినవి దొరకుటయుఁ గూడ నెఱుఁగుదును. శ్రీవా రుండఁ గా నా నాడీ గ్రంధమును శ్రీ వేపా రామేశము గారి దగ్గఱ గొన్ని వందలరూప్యములకుఁ దాకట్టు వెట్టుటయు వారు దానికి ఇండెక్సు వ్రాయుంచుటయు జరగినది. ఆ నాళ్ళలోఁ గ్రొత్తగా జాతకములు చదువుట సాగలేదు. మఱియు నాతఁడా నాడీ గ్రంధమును జదువుచుండిన నాళ్లలో వెల్లడి యయిన జాతకము లనేకము లీ యిండెక్సు చేసిన గ్రంధములలోఁ గాన రాలేదు. వాని నాతఁడు దాఁచియుంచు కొనెనో, చదువునాళ్ళలోనే కల్పించి చదివెనో యని కొందఱు సంశయించిరి. నా నిశ్చయ మాతఁడు కల్పింపను గాని, దాచి యుంచుకొనను గాని నేరనివాఁడే యని. 
   
     భుజండనాడి 

శ్రీవారుండగానే, ధ్రువనాడి చదువుచుండు నాళ్ళలోనే యీ నాడి బయల్పడెను. ఈ నాడి గల యాతఁడు కుంభకోణ వాస్తవ్యుఁ డే. పట్టునూలి జాతివాఁ వలసినంత ధనము గొని తొలుత శ్రీవారి జాతకము చదివెను. అది చదువునాఁటి కాతనికి తద్గ్రంధ విధానము స్పష్టముగా నెఱుఁగ రాకే యుండె నఁట! ఆ జాతకము చదువుట వల్ల నాతనికి శ్రీవారియెడ భక్తి ప్రపత్తులేర్పడెను. శిష్యుఁ డయ్యెను. అన్వాహము శ్రీ వారిదో, శిష్యులవో, ఇతరులతో జాతకములు చుదువుట, దానివలని యా యతితో జీవితము గడపుట యాతని కేర్పడెను. ప్రధానముగా శ్రీవారియు,వారి కుంటుంబము వారియు,శిష్యులయు, వారి కుటుంబముల వారియు జాతకములు చదువుటలో నాతనికి తీరిక లేకుండెను.

   కొలఁది దినములలో శ్రీవారు శరీరము విడుతురనఁగా నాతని ప్రశ్నించిరి.' ఉన్నది యున్నట్టే వ్రాయుట, చదువుట జరుపుచున్నావా? కల్పనలు సాగించుచున్నావా? అని. ఆనాఁడే ఆతఁడొక కల్పనము చేసెనఁట! శ్రీవారి ముఖ్యశిష్యులలో 'అంబష్టుఁ' డొకఁ డుండెను అనుటకు ' అమ్మట నొరువన్' అని యుండగా నాడి కాపి వ్రాయుచున్న వాడు గోపీనాధ రావను శ్రీవారి శిశ్యుఁడే నాడి కారునివంటి వాఁడే వాక్సహయము చేయఁగా ' పండిత నొరువన్ ' అని మార్చి వ్రాసెనఁట! దక్షిణదేశమున ' అంబష్టుని' పండితుఁడనుట పరిపాటి- గడగడలాడుచు దీని నాతఁడు శ్రీవారికి  నివేదించెను. ఎప్పుడుగాని యిట్లు మార్పవల దని శ్రీవారు శాసించిరి. కడకు శిష్యగోష్ఠిలో నీ విషయమును దెలిపి ఇదివఱకు వ్రాసిన భాగమున నిం కే మేని మార్పులు చేసినాఁ డేమో పరిశీలిం పవలసియున్నది యని దాని కాపి లెవరెవరు వ్రాసిరో, వారివారి కాపీలతో నందఱను, మూలముతో నాడి కారుని రమ్మనిరి. ఎవ్వరు నేమి కల్పనము జరపిరో యెఱుఁగరు గాన తమ నిర్దుష్టతను నిరూపించుకొనుట కందఱు వచ్చిన తర్వాత మూలమును, కాపిలను వశపఱచుకొని కట్టికట్టి యట్టుక మీద దాచి వైచిరి. ఇక నాడీ చదువవల దనిరి.
   "వ్రాయసగాఁ డేమేని మార్పు చేయవచ్చును. మాతృక వ్రాసిన వాఁడే యెఱుక చాలక యేమేని తప్పు వ్రాసియుండ వచ్చును. గ్రంధ కారుఁడే యజ్ఞఁ డై తప్పిదపు రచనము చేసియుండవచ్చును.  దానికి పరమప్రామాణ్యము కల్పించుకొని మీరు చదువ రాదు. నాదగ్గఱకు మీరు వచ్చి శిష్యులగుట నాడి మూలమునఁ గాదు. నాడిఁ జూచుట మీరు నా శిష్యులయినతర్వాత నే. ఏ కారణములతో మీరు నాశిష్యు లయితిరో ఆ కారణములతోనే నన్నను వర్తింపుఁడు. నా మాటలు స్వతఃప్రమాణములు గాని పరతః ప్రమాణములు గావు. నన్ను, నా కార్యములను నాడి ననుసరించి విశ్వసింపవలదు" అనిరి.
అక్కడ నున్న శిష్యులు కొందఱు 'మీయా దేశముల ననువదించుట చేతనే నాడిని విశ్వసించుచుంటిమి. తద్విరుద్ధముగా నుండు నేని నను వర్తించుచున్నట్టే యుండి యీ నాడి కాలాంతరమున నజ్ఞానముచే తప్పులు చెప్పుట సాగింప వచ్చును. అందాఁక రచియించిన గ్రంధముపై ప్రామాణ్యము కల్పించుట మికు సంగతముగాఁ దోఁపకపోవచ్చును. నా యోగ మార్గమును బరిపూర్ణముగా గుర్తించుట యెవ్వరికిని సాధ్యము గాదు. అది నాకుఁగూడ నప్పటప్పట దెలియనగు నదిగా నుండును.  శాఖోపశాఖలుగాఁ బెరుగఁగల మఱ్ఱచెట్టు నకు ఎన్నాళ్ళ కేదిక్కున నే శాఖ నది వెలయింపఁ గలదో తెలియనట్టే లోకతంత్రమున వికాస ముండును. మానవుఁడు ఈశ్వరతను జేరబోవు కొలఁదిని దానిని దెలియఁగల్గవ వచ్చును. వృక్షశాస్త్రమునఁ గొన్ని వృక్షము లిన్నాళ్ళ కిన్ని యాకులనో, శాఖలనో వెలయింపఁగల వనీ,యీ యీ సమయములలో బుష్పింపఁ గలవనీ,ఫలింపఁ  గల వనీ, ఇన్ని పుష్పము లనీ, యిన్ని ఫలము లనీ కూడ గుర్తించుట జరగుచున్నది.మానవ ప్రజ్ఞ పెరుగను ఈశ్వరునకుఁ జేరువ కానుగాను సర్వ ప్రాణి సృష్టిరహస్యములను మానవుఁ డు గుర్తింప గల్గవచ్చును. మానవత పెరుగను పెరుగను తద్ హృదమున నుండి ప్రజ్ఞోద్బోధములు పెరుగఁగలవు.ఇప్పుడు పెంపొందుచున్న శాస్త్రము లన్నియు నట్టివే.
   మానవహృదయము నిర్దుష్టము కానంతవఱకు, మానవ వాక్కు సుపవిత్రము కానంతవఱకు, మానవ కార్యములు వినిర్మలములు కానంతవఱకు సృష్టిరహస్యము మానవత గుర్తున కంద నేరదు. ప్రయత్నములు సాగుచున్నవి. ఈనాడీ గ్రంధము లట్టిప్రయత్నమున పుట్టినవే.
   "విహాయ శాస్త్రజాలాని యత్సత్యంత దుపాస్యతామ్ 
     వేద శాస్త్రపురాణాని పదపాంసు మివ త్యజేత్" 
   అని చెప్పిన వారిట్టిభావము గలవారే. మి రీనాడీ గ్రంధాదులు వెంటాడుట సాగించితి రేని మిలోని ప్రజ్ఞోద్బోధములు కుంటువడును. ప్రజ్ఞోద్బోధముల వెంటాడుచు బాహ్య శాస్త్రాది  సాధనములను విడనాడ వలెను. కడకు ఆత్మానుభూతిలో నెలకొనుట యగును. మిరు చూడవలసినది యీ తాటాకుల నాడీ గాదు. శరీరము చైతన్యముతో ఆడుచున్న నాడి. ఈ తాటాకుల నిప్పటికిఁకఁ గట్టిపెట్టి ఇందు చూపు తత్పరతను యోగసాధనములమిఁద చూపుఁడు"అనిరి. 
   ఇట్లు జరిగిన కొన్నినాళ్ళకు ముఖ్యశిష్యుఁ డొకఁడు 'నాడిలో నేమి విశేషము లున్నవో చదివి చూడ ననేకలుత్సాహపడుచున్నారు. చదువ ననుగ్రహింప వేఁడఁగా శ్రీవారు "ఆ నాడి కొన్ని ముఖ్య విష యములను వెల్ల డింపఁగలదు. అదిచదువుటకు సమయమున్నది. అప్పుడు దానిని చదువుదురు గాని" యని బదులు చెప్పిరఁ ట!అంతకుఁ బుర్వమే శ్రీవారి జాతకమునఁ గొంత భాగము చదువు టయ్యెను ఇతరుల జాతకములోను గొన్ని భాగములు చదువు టయ్యెను. ఆ కాలమున నేనును నాజాతకపుఁ బీఠికాభాగమును, జదివించుకొంటిని. ధ్రువనాడీని, భుజండనాడీ యవతరణికాభాగమును, విజయనగరపుఁబక్షి శాస్త్ర శ్లోకములను, శ్రీవారిని గూర్చి నేను వ్రాసియుంచు కొన్న పద్యములను వ్రాసి పెట్టుకొన్న వ్రాఁత ప్రతిని, ఇటాలియన్ నోటుబుక్కును ఎవ్వరో హరించిరి. అది నా దగ్గఱ నిపుడు లేదు. ఉన్నచో నాయా శ్లోకములను, అరవ పద్యములను, దెలుఁగు పద్యములను, చాల వింత విషయములు గల వాని నిక్కడ నుదాహరించి యుందును.