245
వీనినే వరుగు చేయుచున్నాము. కాని ఎచ్చటను సేద్యము చేయు చున్నట్లు గన రాకున్నది.
తియ్య దొండ తీగె (ప్రకాండము) గుండ్రముగా నుండును. నులి తీగెలు చీలి యుండవు. కాయలు బుడమ కాయలంత యుండును గాని యంత కంటె కొంచెము లేత ఆకు పచ్చరంగు. కాయలు కూరకు బాగుగానుండును. ఇవి బలమును గలుగ జేయునందురు.
కాకిదొండ తీగె (ప్రకాండము) 5 పలకలుగా నుండును. ఆకుల మీద మెత్తని రోమములు గలవు. ఆకుల రసము ఔషధములో వాడుదురు.
బీరకాయ లించుమించు సంవత్సరము పొడువున వచ్చుచునే యుండును. కాని శీతాకాలములో నివి ఎక్కువ బాగుగ నుండును. ఇతర కాలములందొక్కక్కప్పుడు చేదుగా నుండుటయు గలదు. దీని ఆకులంతగా గరుకుగా నుండవు.
అడవి బీర తీగె బీర తీగ వలెనే యుండును. కాయలు మధ్య లావుగను రెండు వైపుల సన్నముగాను నుండును. ఇవి మిక్కిలి చేదు. వీనిని నమిలిన డోకు వచ్చును. వీని రసము నుడక బెట్టి తల నొప్పులకు పట్లువేసెదరు.