కింజల్కములు:- అసంఖ్యములు. మొగ్గలో కాడలు ముందునకు పెరిగి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండకోశము:- అండాశయము నీచము. రెండు గదులు కీలము ఒకటి కీలాగ్రము చిన్నది. కండ కాయ 1. గింజ.
ఈ కుటుంబములో పెద్ద చెట్లును గుబురు చెట్లును కలవు. ఆకులు, అభిముఖ చేరిక, సమాంచలము. లఘు పత్రములు వీనిలోను నారింజ ఆకులలో వలె గ్రంధి కణములు గలవు. పుష్పములు సరాళములు. ఆకర్షణ పత్రములు నాలుగో అయిదో యుండును. అవిత్వరగా రాలి పోవును. కింజల్కములు చాల గలవు. వాని కాడలకు కూడ రంగుండును. అండాశయము నీచము. ఫలము కండకాయ.
నేరేడు చెట్టు నదీతీరము లందెక్కువగా బెరుగు చున్నవి. వీనిలో చాలరకములు గలవు. మంచి వానిని తోటలయందు పైరు చేయు చున్నారు. వీని పండ్లకు పులియ బెట్టి ఒక విధమగు సారాయిని దీయు చున్నారు. దీని కలపయు బాగుగనే యుండును. ఇంటి పనులకును నాగళ్ళు మొదలగు నవి చేయుటకును, నూతిపనులకును బనికి వచ్చు చున్నది. ఇది నీళ్ళలో త్వరగా జీకిపోదు. దీని యాకులను ఒకవిధమగు పట్టు పురుగు దినును. బౌద్ధులకు నీ చెట్లు పవిత్రములైనవి.