ఈకుటుంబములో పెద్ద చెట్లును గుబురు మొక్కలును గలవు. ఆకులు లఘు పత్రములు. పువ్వులు మిధున పుష్పములే గాని, కొన్నిటిలో ఆకర్షణ పత్రములు లేవు. కొన్ని పువ్వుల పుష్ప కోశపు తమ్మెలు అల్లుకొని యుండును. కొన్నిటివి తాకు చుండును. అండాశయము నీచము. ఒక గది. కొన్నిటిలో నొక గింజయే కలదు. మరి కొన్నిటిలో నంతకంటే ఎక్కువ యుండును. పుష్ప కోశము యెక్క తమ్మెలనను బట్టియు గింజల సంఖ్యను బట్టియు ఈ కుటుంబమును జాతులను తెగలను, విభజించియున్నారు.
నల్లమద్ది:- చెట్ల కలప మిక్కిలిబలమైనది. స్థంభములకును, దూలములకును, రోళ్ళు రోకళ్ళు నాగళ్ళు మొదలగు వానిని చేయుటకును, పదవలకును ఉపయోగించుచున్నారు. ఈ చెట్లనుండి వచ్చెడు జిగురును గొందరు తెనెడి వారు దానిని గాల్చిన మంచి వాసన వచ్చును. చెట్ల బెరడు ఔషధములలోను, రంగులు చేయుటలోను, ఎక్కువగా చర్మములు బాగు చేయుటలోను వాడు చున్నారు. చర్మములు బాగు చేయుటలో కాయలు కూడ పనికి వచ్చును కాని కరక్కాయ లంత మంచివిగావు. దీని ఆకులను పట్టుపురుగులు తినును.