Jump to content

పుట:VrukshaSastramu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముండ్లబూరుగ:... చెట్టు మిగుల పెద్ద చెట్టు. దీని పువ్వులెర్రగా నుండును. దీని దూది అతి మృదువుగను పోగులు మిక్కిలి పొట్టిగను నుండుటచే నేతకు బనికి వచ్చుటలేదు. దీనితో తలగడలు, పరుపులను గుట్టుదురు. దీని లేత పువ్వుల మొగ్గలను గొందరు తిందురు. దీని జిగురు, గింజలు, దూది, బెరడు చిన్న మొక్కల వేరులును ఔషధములలో వాడు చున్నారు.

జిగురు ఇతర మొక్కలందు వలె నాటులు బెట్టి తీయ లేము. నాటు పెట్టినను రాదు. కొన్ని చోట్ల బెరుడులో బురుగులు దొలుచుట వలన గాని, మరే కారణము వల్ల నైనను అచ్చటి భాగము పాడుగా నున్నప్పుడు జిగురు వచ్చు చున్నది. ఈ జిగురును బొడుము చేసి గాని, నల్లమందు మొదలగువానితో గలిపి కాని విరేచనములు మొదలగు జబ్బులకును కవిరి యుపయోగపడు ప్రతి దానికిని వాడుదురు. దీని గింజలును బ్రత్తి గింజలు చేయు పని చేయును. దీని దూదిని ఆసుపత్రులందు వాడుదురు. ఎండిన లేత కాయలను మూత్ర వ్యాధులందును జన నేంద్రియముల నీరసమును బోగొట్టుటకును వాడుదురు.