పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీ:

రెండవ యుపన్యాసము

వేమన కాల దేశములు

హిందువుల యన్ని చరిత్రములవలెనే వేమన చరిత్రమునఁ గూడ నమ్మఁ దగిన సాక్ష్యములు లేకపోవుటచే సత్యము బైలు పడుట చాల కష్టముగా నున్నది. ఐనను అందు ముఖ్యములైన కాలదేశములను గూర్చి నేఁడు కొంత చర్చింతును.

ఇంగ్లీషువారి సహవాసముచే మనము నేర్చుకొన్న విచిత్ర విద్యలలో చరిత్ర రచన యొకటి. చరిత్రములు వ్రాయుట మన పూర్వ లెఱుఁగక పోలేదు. అది మానవ సామాన్య ధర్మము. కాని వారెన్నఁడును ఇప్పటివారివలె దాని నొక ప్రత్యేక మగు విద్యగా, ఒకరిద్దఱు వ్యక్తులకుఁగాక యొక దేశమునకే-జాతికే చేరిన ముఖ్య శాస్త్రముగా—పరిగణించినవారుకారు. పూజ్యమైన వ్యక్తియందు ప్రజలకు గౌరవమును గల్గించుట వారి ముఖ్యసాధ్యము, చరిత్రము దానికి సాధనమంతే కావున విన్న విషయములు కన్న విషయములు అన్నియనమ్మి, చాలకున్న కొత్తగాచేర్చి, సరిపడ కున్నదానిని తోసివేసి, వారు వ్రాయుచుండిరి. ఇప్పటి మన తీఱు వేఱు. పూర్వ కాలమున సంస్కృత తర్కశాస్త్రము తక్కిన విద్యలయందెల్ల నెట్లు ప్రవేశించెనో, యట్లే నేఁడును ప్రతి విద్య నేర్చువానికిని ఆ విద్యయొక్క చరిత్ర మత్యావశ్యకముగా నేర్పడినది. చరాచర వస్తువుల కన్నిటికిని, నేఁడు చరిత్రము గలదు. చరిత్రమునకును చరిత్రమెవరైన వ్రాసినారో లేదే యెఱుగను గాని, వ్రాయవచ్చుననుటలో సందేహము లేదు.

మనకు చరిత్రమువలనఁ గలుగవలసిన లాభము యదార్థజ్ఞానము. అది మంచిదైనను కాకున్నను, ఇష్టమున్నను లేకున్నను, సరే. కావున నేఁటి చరిత్రకారుని కొక విషయము సత్యమని స్థాపింప ననేక సాక్ష్యములు కావలయును; అవి పరస్పర విరోధములేక యుండవలయును. అట్లగుటచే సాక్ష్యము దొరికినఁ జాలునని తృప్తిపడక యది నమ్మఁదగినదా కాదా యని మొదలు పరీక్షింపవలసి యుండును. కావున నిప్పటి చరిత్రకారుఁడు తానొక న్యాయాధిపతిగా వ్యవహరించుచున్నాఁడు. ప్రతి సాక్ష్యమును కల్పితమై యుండవచ్చునను నపనమ్మకముతోనే విచారణ నుపక్ర మించును. ఇట్లగుటచే సందేహము చరిత్రకారుల స్వభావమైసది. ప్రాచీనులు అన్నిటిని నమ్మిరి. ఆధునికులు దేనిని నమ్మరు—అనఁగా, బలవంతమైన సాక్ష్యము, ఇతర చరిత్రకారులు బలవంతమని నమ్మునట్టిది, లేనిది. సాక్ష్యమున్నను లేకున్నను అన్నిటిని నమ్ముట యెంత అన్యాయమో, సాక్ష్యము లేనివాని నన్నిటిని నమ్మక పోవుటయు నంతే యన్యాయము. ఫలమేమనఁగా, ప్రాచీనపురాణములలో వస్తు స్థితిని ముంచివేయునన్ని విషయములు లభించుచుండఁగా, ఆధునికుల చరిత్రలలో అసలు సత్యమే పూర్ణముగా లభింపకతునకలుతునకలుగా లభించును. వేమన తండ్రివిషయమై వ్రాయవలసివచ్చె ననుకొనుఁడు; ప్రాచీనులు అతని ఒడ్డు, పొడవు,