పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కవిత్వము, హాస్యము, నీతులు. 131

తరువాతివాఁడు కాంటెలు దొర. క్రైస్తవమత ప్రచారమే పరమార్థముగాఁగల ఇతఁడు హిందువుల దంభాచారములను దిట్టుటకే వేమన పద్యములనుపయోగించుకున్నట్లున్నది కాని యతని కవిత్వమం దంత యభిమానముఁ జూపలేదు, ఇఁక వేమన్న కవియని మనవా రనుకోలేదు. పాశ్చాత్యులు సిఫారసు చేయనులేదు. కావున తెలుఁగువారిలో చదువుకొన్న పండితు లనేకు లింకను వేమన పద్యముల కవిత్వపు విలువను గమనింపకయే యున్నారు.

ఎట్లు గమనింపఁగలరు? వేమన పద్యము లెక్కిన పెద్దసింహాసనము 'మాక్స్ మిల్లస్” గారి మూఁడవ రీడరు" కాలేజీలలోఁగాని, హైస్కూళ్ళలోఁగాని తెలుఁగు విద్యార్థులు వాని మొగముఁ జూచుట కవకాశమిచ్చిన పాపమున నెవరైనఁ బోయి నారా? పాఠ్యపుస్తకములను నిర్ణయించువా రందఱును ఇంకను తెలుఁగు పండితుని నిఘంటుజ్ఞానమును పరీక్షింపఁ జూచుచున్నారేగాని, శిష్యుల మనోవికాసముపై దృష్టి గలవా రపురూపము. కావ్యములను పాఠము చెప్పుట యనఁగా శిష్యునకు తెలియని పదముల కర్థము చెప్పటయే యని యిప్పటికిని అనేకుల తలంపు. కాని కవి యొక్క భావములు, ఆభిప్రాయములు, శైలి మొదలగు వానినిగూర్చి చర్చించి తెలుపనక్కరలేదా?

ఇదిగాక యిప్పటి పాఠశాలలలో శుద్ధ సంస్కృత పద్ధతిని ఇంగ్లీషు పద్ధతిని అవలంబించి వ్రాసిన పురాణములు, ప్రబంధములు, నాటకములు, నవలలు, మొదలగు వానిని నియమింతురుగదా! వానిలో ననేకములు వాతలే కాని వ్రాఁతలు కావు. ఈ రెండును ఎఱుఁగని శుద్ధమగు తెలుఁగుకవిత్వ మొకటి యున్నదిగదా ? దానిని తెలుఁగు విద్యార్డు లెఱుఁగవలదా? వేమన్నది ఇట్టి యచ్చతెనుఁగు కవిత్వ మనుట తెలుఁగువారంద ఱెఱుఁగుదురు. దీనికి పై పురాణ ప్రబంధముల కిచ్చు గౌరవ మీయలేకున్న మానెనుగాని, తలతో(కలేని నవలలు, నాటకములు మొదలగు వానితో సమానముగానైనను మన్నింపలేకపోయితిమేని మన తెలుఁగుగాని తెలివిగాని యెందుకు తరమైనది ? ఇతనిలో అపశబ్దములు గలవు గావున పాఠశాలలకు తరము గాదని యందులేని, పూర్వకాలమువారి వ్రాఁతలన్నియు సుశబ్దములే యనుకొందము. పోనిండు. కాని ఆధునికులచే వ్రాయcబడి పాఠ్యపుస్తకములుగా నియమింపఁబడిన గ్రంథములలో అపశబ్దములు లేనివి పది కొక్కటి చూపఁగలరా? మరియు తెలుఁగువంటి బ్రదికియుండు భాషలలో 'ఇవే యపశబ్దములు, ఇవే సుశబ్దములు" అని నికరముగా, శాశ్వతముగా నిర్ణయించుటకుఁ బూనుకొనుట వట్టి వెఱ్ఱియని యిన్నాళ్ళకును తెలిసికొనలేకపోవుట మన తప్పగదా? నిజము చూడఁబోయిన కారణ మిదికాదు. రహన్యము వేఱు. మనము సంప్రదాయమునకు దాసులము. దానిని మార్చుకొను శక్తి మనలో ననేకులకు లేదు. వేమన పద్యములు పెద్దతరగతుల విద్యార్థులకు చదువ నియమించు సంప్రదాయము ఇదివరకు లేదు. “అది లేకయే ప్రపంచము జరుగుచున్నదే; పరీక్షలలో విద్యార్థులు 'ప్యాసు' అగుచున్నారే ; ఈ క్రొత్త సంప్రదాయము లేల? ఉన్నట్లుండనిత్తము"—అనుటయే మన యిప్పటి స్థితి, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు ఈ విషయమున ముందంజవేసి యట్టి సంప్రదాయమును గల్పించిలేని శిష్యులకు హృదయోల్లానము గల్గించినవా రగుదురు. తామును స్వధర్మమును నిర్వర్తించి ధన్యులగుదురు.