పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 130

              “ఆ. పనస తొనలకన్న పంచదారలకన్న
                     జుంటితేనెకన్న జన్నుకన్న
                     చెఱుకురనముకన్న చెలిమాట తీపురా..." (2---)

               "ఆ. జారపురుషునకును జాజిపూవులతోడ
                     పాన్పు వేయునయ్య ప్రాఁతలంజ,
                     సొంతమగనిమీఁద చింతనిప్పలు చల్లు..." (1596)

మఱియు, వట్టి యుపమానములనే చెప్పి, విషయము చెప్పక, వ్యంజింపఁ జేయుట యితని యింకొక విచిత్రమార్గము-

               "ఆ, తిరుమలకును బోవఁ దురక దాసరి గాఁడు
                     కాశికేఁగఁ బంది గజము గాదు,
                     కుక్క సింగమగునె గోదావరికిఁ బోవ..." (1944)

               " ఆ, పొట్లకాయ రాయి పొడుగు త్రాటనుగట్ట
                      లీలతోడ వంకలేక పెరుగు,
                      కుక్కతోఁకఁగట్టఁగుదురునా చక్కగా." 2615)

ఇట్లు ధర్మము, తత్త్వము, నీతి, పరమత ఖండనము మొదలగు నే విషయములు చెప్పినను ఇతని పద్యములందు అనన్యసాధారణమైన సారళ్యము, ధారాళత, చెక్కడపు పని, నిర్లక్ష్యము మొదలగు కవితాగుణములు నిండి యుండును. ఇతని యే పద్యమును విన్నను నిలిచి తటాలున ఆప్రక్క తిరిగి యొకమారైన చూడకుండుటకు తెలుఁగు మాటలాడువాని కెవ్వనికిని సాధ్యముగాదు. ఈ యాకర్షణశక్తి యితనియం దున్నంత తక్కినవా రెవరియందును గానరాదు. తాను జెప్పుమాట యితరుల హృదయమునందు పడి జారిపోక యందే యంటుకొను నట్లు చేయుటయే కవి కితరుల యందు లేని భగవద్దత్తమైస శక్తి, దానికి పరవశులై తక్కిన సహృదయులందఱును ఇట్టిదని చెప్పరాని యొక యానంద మనుభవింప వలయుననుట సృష్టిసిద్ధమగు అనిర్వచనీయ రహస్యములలో నొకటి. కాని యా సహృ దయత్వముగూడ కొంతవఱకు సహజమైన శక్తి. స్వాభావికముగా కవిత్వము, సంగీతము మొదలగు కళలయం దభిరుచి లేనివారెందుఱో కలరు. ఆ సహజమగు సహృదయత్వమును చదువు, వివేకము, అభ్యాసము వీనిచే తగిన త్రోవలో వృద్ధిఁ బొందించుకొని వాసనా పరిపక్వబుద్ధుల మైతి మేని, యొక్కువ యానందమనుభవింపఁ గల్గుదుము. అట్లుగాక, నీతి, మతము, నాగరికత, ప్రాచీనసిద్ధాంతములు, మనకన్న బలవంతులగువారి రాద్ధాంతములు మొదలగు వానికి లోబడి తప్పు త్రోవలో దానిని బోనిచ్చితిమేని యనేక మహాకవుల కవిత్వము మనపాలి కున్నను లేనట్లే యగును.

ఇదివఱకును కవిత్వమేది యను చర్చ వచ్చినప్పడు మనము సంస్కృత పండితుల సులోచనములు వేసికొనియే చూచి నిర్ణయించుచుంటిమి. ఇప్ప డింగ్లీషు వారి దుర్భినుతో చూచుచున్నాము. వారేది కవిత్వమనిరో మనము నదియే కవిత్వ మనుచున్నాము. కాదన్నది కాదనుచున్నాము. ఇంతేకాని మన యనుభవములు మనము నమ్మి సిద్ధాంతము చేయుచుండలేదు. చదువుకొన్నవారిలో మొట్టమొదట వేమన్న పద్యముల గొప్పతనమును గుర్తించినవాఁడు బ్రౌనుదొర, కాని యతఁడును, ఇవి క్రొత్తగా తెలుఁగు నేర్చుకొను దేశాంతరమువారికి పనికివచ్చునే కాని, వీనిలో పురాణముల ప్రామాణ్యముగాని, ప్రబంధకవుల ప్రొఢిమగాని లేదనియే చెప్పెను.*[1]

  1. * See Brown’s Vemana, Preface III.