పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంట నందఱకును భోజనము లయినవెనుక నిముసములో తనువు చాలించిరి. తమజీవితమంతయు నాధ్యాత్మిక చింతయందే గడపిరి. నిరాడంబరజీవి, నెమ్మదిగాను చిన్నగొంతుకతో మాటలాడువారు. ఆమాటలలో చమత్కారములు హాస్యమును గర్భితములై యుండెడివి. కుమారుల కలవడిన హాస్యధోరణియంతయు వీరిదే. తెనుగు ప్రబంధములలో నాముక్తమాల్యద వీరికి అభిమానగ్రంథము. అందును 'ఆనిష్ఠానిధిగేహసీమ' యను పద్యమును నిరంతరము వల్లించుచు అట్లే తామును నిరంతరము అతిథిసపర్య చేయుచుండవలయునని వాంఛించువారు. ఎట్టి చిరకాల బద్ధశత్రువులనైనను మిత్రులనుగా నొనర్చువా రని మా తాతగారే నాకు చెప్పియున్నారు. వారిసౌజన్య మట్టిది. అనవసరపు వాదములలో పాల్గొనలేదు. వీరు రచించిన గ్రంథములు రెండే - ఆత్మబోధ వివరణము, లఘువ్యాకరణము. విశేష గ్రంథరచనకును పూనుకొనలేదు. కాని ఆకొఱంతను వారి పెద్ద కుమారులు తీర్చిరి.

_________