పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"వ్యాకృతభాషకఠినము; దానివ్యాకరణము దుర్బోధము; తదీయ శబ్దజాలము బహుళముగా గ్రంథమాత్ర ప్రసిద్ధము. వ్యాకరణము వ్యావహారిక భాషానుగుణముగాదు, అందులకు కర్మార్థక భవిష్యదర్థక పడుకలానుబంధములు ఉదాహరణములు.

గ్రామ్యమన్ననో, సులువు, సర్వజనవిదితము-

ఇటలీలో డాంటిమహాకవివ్రాసిన 'డివైన్ కామెడీ'ని ఉదాహరణముగా గనవచ్చును. గ్రామ్యములో ఇప్పుడు రచితములయిన యేతన్మత నిర్వాహార్థ పత్రికావ్యాసములను, పఠనీయపుస్తకసభవారు (Text-book Committee) పాఠశాలలకు నిర్ణయించినట్టి కొన్నిగ్రామ్యగ్రంథములను, ఉదాహరణముగా బరికింపవచ్చును."

ఇందులకు సమాధానము.-

అగ్రామ్యవాఙ్మయము కఠినమనుట యిప్పుడుపుట్టినమాట, పూర్వులు దీనిని కఠినమనలేదు, లెస్స'యనిరి.

         'ఎల్ల భాషలందు నెఱుగ వేబాసాడి
         దేశభాషలందు దెలుగులెస్స.'

మఱి యిప్పటికాఠిన్యమునకుం గారణము తెలిపెద.

ఆంధ్రభాషాప్రవచనమందు-

(1) ప్రాచీనమార్గము (2) నవీనమార్గమునురెండు. ప్రాచీనమార్గమును, అనులోమమార్గ మనందగును. అమరము, ఆంధ్ర నామసంగ్రహము, సంస్కృతశబ్దమంజరి, సంస్కృతపంచ కావ్యములు, నన్నయభట్టీయము, ఆంధ్ర పంచకావ్యములు ఈవరుసప్రవచనము ప్రాచీనమార్గము. ఇందలిక్రమము - శబ్దము లక్షణము లక్ష్యమునుంగా నుండును. నవీనమార్గము రాజకీయవిద్యాంగ నిర్ణీతమార్గమే; ఇది ప్రతిలోమ మనందగినది; ఇందు వరుస-లక్ష్యము లక్షణము శబ్దమునుగానుండును.