పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోను, భర్తృహరిశతకత్రయమును సంపూర్ణాంధ్ర వ్యాఖ్యతోను తెనుగుపద్యములతోను ముద్రించిరి. రఘువంశ కుమారసంభవముల తొలి యాఱుసర్గలను తెనుగు టీకాతాత్పర్యాదులతో ముద్రించిరి. శాస్త్రులవారు ప్రకటించిన సంస్కృతగ్రంథములలో నొక విశేషముగలదు. ఉపాథ్యాయునితో పనిలేకయే నాటకాంతము సంస్కృతమందు సాహిత్య మలవరచుకొనవచ్చును. తొలుత అమరము శబ్దమంజరులను ముద్రించినారు. వీనిచే నొకపాటి యర్థజ్ఞానమును శబ్దజ్ఞానమును కలుగును. బిల్హణచరిత్ర ఏపాటి శబ్దజ్ఞానము కలవారైనను చదువవచ్చును. దీనికి లఘుటీకను శాస్త్రులవారు ముద్రించినారు. వెనుక చదువదగినవి రఘువంశ కుమారసంభవములు. వీనికి టీకాతాత్పర్యాదులు చేర్చినారు. ఆవెనుక మేఘసందేశము. ఇవిగాక భోజవిక్రమార్కచరిత్రములను పూర్వము ముద్రించినవానిని మరల టీకలతోముద్రించిరి. ఇవి సులువైనవచనగ్రంథములు. హితోపదేశ దశకుమారచరితములను తెనుగు తర్జుమాలతో ముద్రించిరి. తర్వాత నెవరిసాయమునులేకయే చదువగలుగు ప్రజ్ఞకలుగును గాన పంచతంత్రమును, మూలముమాత్రము, ముద్రించిరి. వెనుక రసమంజరీ అమరుకావ్యములు - శృంగారరసమయములు. నాటికలలో సులువైన పియదర్శికను, ఒకపుటయందే ఒకవైపు అనువాదము, మఱియొకవైపు సంస్కృతమూలము, అడుగున నాటకలక్షణాది సకలవిషయంబులును తెలియునట్టివ్యాఖ్య, మొదలైనవానితో పుష్కలముగ ముద్రించిరి.