పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13-ప్రకరణము

ఆంధ్రభాషాభిమాని సమాజము

ఆంధ్రనాటకరంగమును అభివృద్ధికి దెచ్చుటకు అత్యుత్తమకృషిగావించినవారు మన శాస్త్రులవారే. శ్రీ శాస్త్రులవారి జీవితము భాషాసేవకే అర్పితము. అందొకభాగము మొదటి నుండియు భరత సూత్రానుసారులగు నాటకప్రయోగములకే ధారవోయబడినది. శాస్త్రులవారు దాదాపు ముప్పదిసంవత్సరములు సంస్కృతాంధ్రనాటకములను తమశిష్యులకు తాము స్వయముగానేర్పి ప్రదర్శింపించుచుండిరి. క్రిశ్చియన్కాలేజిలో ప్రవేశించిన కొలది దినములకే సంస్కృతాంధ్ర నాటకములను తమ విద్యార్థులచేత నాడింపించుటకు మొదలిడిరి. మదరాసులో సంస్కృతవిద్వాంసులు, సుప్రసిద్ధన్యాయవాదులును బహుగీర్వాణనాటకకర్తలును నైన శ్రీ టి.ఎస్. నారాయణశాస్త్రిగారి వంటి వారనేకులు మనశాస్త్రులవారి శిష్యులై ఈ నాటకములలో పాల్గొని పాత్రథారణ మొనర్చుచుండువారు. కాలేజిలో ప్రతి సంవత్సరాంతము ఆయాసంవత్సరము చదివిన నాటకమునాడుట ఆచారమై యుండెను.

ఇతరులచే ప్రదర్శింపించుట కసాధ్యమైన కష్టతరనాటకములను సయితము శాస్త్రులవారు జనరంజకములం గావించుచుండిరి. ఉత్తరరామ చరిత్రనాటకమును ఎల్లవారును ప్రదర్శనీయముకాదని వదలివేయుచుండిరి. దీనిని శాస్త్రులవారు ప్రదర్శింపించినారు. వారే తమ యుత్తరరామచరిత్రయొక్క యుపో