పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/854

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగరకవృత్తాన్ని అనుసరించి 'యక్షరాత్రి' నాడు మదిరాపానం చేసి మదోన్మత్తమైన ఒక నాయిక సురాచషకంలో ప్రతిబింబించిన చంద్రునితో చేసిన ఉన్మత్త ప్రలాపాన్ని ఒక మహాకవి -

"ఓ చంద్రుడా! ఎందుకీ మధుపాత్రలో ప్రతిఫలిస్తావు? మీ రోహిణీదేవిని తలవెంట్రుకలు లేనిదానినిగా చేయిస్తాను. పాత్ర జోలికి వస్తున్న వారిని ఈ మద్యముతో కలిపి నిన్ను గూడా మింగుతాను జాగ్రత్త! దగ్గరకు రాకు. మా రాజు కోపానికి, రోహిణీ దేవి కోపానికీ గురి ఔతావు. మా గుంపులో దేనినో కామించి వస్తున్నట్లున్నావు. లేక పోతే నీకీ క్షయ ఎక్కడినుంచి వస్తుంది? నీవు ఇతర స్త్రీలంపటుడ వని నీ భార్యలకు అనుమాన మున్నట్లున్నది. లేకపోతే మధు పాత్రలో ప్రతిబింబించిన నిన్ను ఈ తారలు ఎందుకు అనుసరిస్తున్నవి? నిన్ను ఎవ్వతో రమ్మని ఆశపెడుతున్నట్లున్నది. అందుకనే ప్రతి రాత్రీ పశ్చిమదిక్కుకు వెళ్లుతున్నావు” అని అతిరసస్ఫూర్తితో భావించాడు.

చంద్రుణ్ణి మహాకవులు నానావిధాలుగా ఊహించారు. ఒకరు 'అత్రిమునిలోచన భూషికా' అంటే, మురారి మహాకవి 'జ్యోత్స్నా కరంభ' మన్నాడు. తెల్లవారు జామున చంద్రుణ్ణి పేలపిండి కలిపిన పెరుగు ముద్ద అన్నాడు భోజనప్రియుడైన ఒక కవి రాజు. 'నభస్సీమంతినీ సిందూర రేఖ' అనీ, 'గగనసరోవరహంస' మనీ, 'ప్రాక్సతీలలాట తిలక' మనీ, 'గగనకాసార పోత' మనీ, 'అప్సరస్త్రీ కరసరోజ చమక' మనీ అనేకంగా పోలికలు కనిపిస్తున్నవి. సరోజినీదేవి అతణ్ణి ‘A castemark on the azure brow of heaven' అని అన్నది. ఒకానొక ఆధునిక కవి అష్టమి చంద్రుణ్ణి చూచి ‘అప్సరఃప్రణయినీ కబరీచ్యుత మాల' అన్నాడు. ఉదయించే చంద్రకాంతిని 'అభినవఖరయోషిత్క షాయకంఠ కాంతి' అని ఉపమిస్తే, తెలుగు కవి ధూర్జటి చంద్రోదయసమయాన 'శీతగభస్తి బింబశివాలింగంగా దర్శించి' పూర్ణోపమగా ఇలా ప్రస్తరించాడు :

మ. "ఉదయగ్రావము పానవట్ట మభిషేకోదప్రవాహంబు వా 8, దరీధ్వాంతము ధూపధూమము. జ్వలద్దీప ప్రభారాజి కౌ ముది, తారానివహంబు లర్పిత సుమంబుల్గా, తమోదూర సౌ ఖ్యదమై శీతగభస్తిబింబ శివలింగ బొప్పు ప్రాచీదిశన్.”

సాహిత్యంలో చంద్రుని సమగ్రస్ఫూర్తిని బహిర్గతం చేసేటట్లు 'అల్లసాని అల్లిక జిగి బిగువు'లతో కూర్చిన వర్ణన :854 వావిలాల సోమయాజులు సాహిత్యం-4