పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/835

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులాసా కబుర్లు


ఉదాత్తమైన విషయాల మీద నిలిచి అలోచించటానికి మనసు 'మొరాయించి' నప్పుడు ఉబుసుపోక కొందరు ఉత్తములు కూడా కులాసా కబుర్లు చెప్పుకుంటారు. ఇది కేవలం కించిత్కాలక్షేపార్థం. కొందరు ఆ పని తప్ప మరో పని చెయ్యలేరు. ‘అసిధారా వ్రత దీక్షితుడి’ వలె జీవితాన్ని ఆద్యంతమూ ఈ 'మహోత్కృష్ట' కర్మలోనే వారు గడుపుతారు. అయితే వారికి వ్రతుల మన్నమాట తెలియకపోవచ్చు. దీనికి మూలకారణం జీవితాన్ని 'సింహావలోకన' చేసే జిజ్ఞాసకు బుద్ధి నిరంతరమూ నిద్రావస్థను పొందటమే. వారి వృత్తికి మనస్సు ఎన్నడూ 'మరణ బాధ' పొందనవసరం లేదు. ఆలోచనా, పర్యాలోచనల మధ్య 'డోలాయమానం' కావటం అది స్వప్నావస్థలోనైనా అనుభవించి ఉండదు. విసుగు లేకుండా, అణుమాత్రమైనా 'టెంపో' చెడకుండా 'చిన్మయ జ్యోతి' దర్శించేటప్పుడు పొందే 'చిదానందానుభూతిలో శ్రోతలను ఆకట్టే ప్రజ్ఞ దానికి అవసరం. దానికీ సహజ ప్రతిభ ఉండాలి. వ్యుత్పన్నతను అది లోకానుభవ పరిశీలనలవల్ల అజ్ఞాతంగానూ, అననుభూతంగానూ పొందుతుంది. ఇంత మాత్రం చేత ఈ కబుర్ల రాయుళ్ళ మనస్సుకు మాంద్యం లేదని కాదు. అది ఊర్ధ్వంగా, ఎగరలేని పక్షివంటిది; పని చేయదని కాదు. 'మందమైన మనస్సు పిశాచాలకు ప్రియమైన కర్మాగారం' అనే ఇంగ్లీషు సామెత ఇందుకోసమే పుట్టింది. ఇటువంటి ‘మందబుద్ధులలో నుంచే సైతాను అతని శిష్యులను స్వీకరిస్తాడు.' క్రీస్తు 'కర్మ యోగులలో నుంచే అతని అనుచరులను గ్రహిస్తాడని ఓ తాత్వికుడన్నాడు. ఇందులో అనంత సత్యం గర్భితమై ఉంది; అందువల్లనే కులాసా కబుర్లు చెప్పేవారు నిరంతరమూ శ్మశాన జీవితం గడుపుతారని తాత్త్వికులంటారు.

స్వతస్సిద్ధంగా ఉత్తమ విషయాన్ని గురించి ఆలోచించక కులాసా కబుర్లు చెప్పుకునే వారిలో ఉండే మాంద్యం కొన్ని విధాలైన కార్యశూరుల్లోనూ ఉంటుంది. ఇటువంటివారు ఒక్కొక్కప్పుడు ఉత్తమ క్రియాదక్షులనూ, జిజ్ఞాసువులనూ చూచి పరిహసిస్తుంటారు. జాన్సను రాత్రిళ్ళు ఏకాంతంగా కావ్యకర్మలో మేల్కొని ఉదయానంతరం నిద్రపోతుండేవాడు. ఆయన్ను చూచి ఒకప్పుడు ఇటువంటి వారు కొందరు పరిహసించారు. ఆ మహాశయుడు ఈ కోటిలో చేర్చదగినవారిని గురించి ____________________________________________________________________________________________________

ఇతర వ్యాసాలు

835