జిజ్ఞాస చేసి 'ఒకడు సాలీళ్ళను పట్టుకొని సూక్ష్మదర్శితో దానికెన్ని కళ్ళున్నవో
పరిశీలించటానికి జీవితమంతా వ్యర్థం చేస్తున్నాడు; మరొకడు అందమైన పూలలో
పుప్పొడిని విడదీసి విచ్ఛేదయంత్రమందు కాలం గడుపుతున్నాడు. కొందరు గాలుల
రాకపోకలను పరిశీలించి వాటిని 'ఉల్టా సీదా' చెయ్యవచ్చు ననే తృప్తితో
చనిపోతున్నారు. ఇంతకంటే ప్రముఖులు కొందరు రంగులేని రెండు పానీయాలను
కలపటంవల్ల కొత్త రంగు వస్తున్నదని గమనించి, ఒక మహత్తర విషయాన్ని దర్శించి
లోకోపకారం చేశామన్న తృప్తితో దేహయాత్ర చాలిస్తున్నారు. వీళ్ళందరినీ
మనోమాంద్యులని అనవలసిన స్థితికి నన్ను పురికొల్పుతున్నారు' అని అన్నాడు.
ఆయన చెప్పినట్లు ఇటువంటివారిలో మానవత్వం లుప్తమైపోతుంది; పైశాచిక జఠర
ఉంటే ఉండవచ్చు.
నిశితంగా ఏ విషయాన్నైనా ఆలోచించవలసిన అగత్యం లేని ఖాళీ మనస్సూ, అతివాచాలమైన జిహ్వా రెండూ ఏకోదరాలు. గోరంతలను కొండంతలు చేసి ఆలోచించటం శూన్యమైన మానసానికీ, నీలాపనిందలకు రెక్కలు కట్టి లోకంలో ఎగరవెయ్యటం వాచాల జిహ్వకూ లక్షణం. కులాసా కబుర్లు మాత్రమే చెప్పగల వాడికీ రెండూ తప్పకుండా ఉండితీరుతవి.
కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే ఏ 'బృందం' దగ్గరికైనా వెళ్ళి ఓ చిరునవ్వు పారేసి 'ఏమండోయ్ ఏం మాట్లాడుకుంటున్నా? రని ప్రశ్నిస్తే, రింగు లీడరును చూపించి 'మనవాడు ఏమేమో కోసేస్తున్నాడండీ' అని అతని ముఖాననే అనేస్తుంటారు. దానికి అతని అంగీకారం ఉండీ, ఉండనట్లు 'కబుర్ల రాయుడు' స్మేరాననుడౌతాడు. ఏ దేశంలోనైనా కబుర్లు చెప్పుకునే వాళ్ళు బృందాలుగా ఏర్పడి, విషయాన్ని బట్టీ, కాలాన్ని బట్టీ వ్యక్తులు మారిపోతూ కాలక్షేపం చేస్తుంటారు. వారి మధ్య గ్రహరాట్టులా కబుర్ల రాయుడు'. అతని ‘వాచామగోచర వాచాల విన్యాసాలతో, శ్రోతల దృక్సరోజతోరణ మాలాలంకృతుడౌతూ, ఉన్నతాసనాన్నీ, ఉత్తమ గౌరవాన్నీ పొందుతుంటాడు. అతగాడు 'వాక్రుచ్చే' అన్నీ సర్వాబద్ధాలనీ, చట్టసమ్మతాలు కానివనీ 'మనో వాక్కాయ కర్మలా' వ్యక్తీకరిస్తున్నా అతనిని మానమనటం గానీ, శ్రోతలు వినకపోవటం గానీ జరగదు. ఇందుకు ప్రధాన కారణం అతని మాటల్లో ఉన్న 'అయస్కాంత శక్తి'. అది అతడికి ఎలా లభించిందని ప్రశ్నించి చూస్తే వినేవాళ్ళు ఇచ్చిందే! ఉబుసు పోకకు కబుర్లు చెప్పే వ్యక్తులు ఆ సంఘాలు గానీ, మానవ సమాజంగానీ ఇచ్చే గౌరవ మర్యాదలను పరిశీలిస్తే మానవజాతికి కట్టుకథలన్నా, అసత్యవాక్పాటవమన్నా ఎంత ఆసక్తో అవగతమౌతుంది. అందుకనే ఎక్కువ మందికి కులాసా కబుర్లే 'ఖుషీ'గా
836
వావిలాల సోమయాజులు సాహిత్యం-4