సాహిత్య విద్యార్థులకోసం ఆయనెన్నో వ్యాసాలు రాశారు. ఒక కావ్యఘట్టాన్ని పరిచయం చేసేటప్పుడు కూడ మూలగ్రంథం, మూలరచయిత, అనువాదకుడు, కావ్యతత్వం, కథ, పాత్రచిత్రణ, విశేషాలు వంటి విషయాలతో వ్యాసం సమగ్రంగా ఉంటుంది. పాఠకుడు సమాచారం కోసం మరొక చోటికి పోవలసిన అవసరముండదు. ఒక నాటకం గురించి రాస్తే సంపూర్ణంగా నాటక లక్షణంతో అన్వయించి చెప్తారు.
ఆయన కవి, నాటకకర్త, సహజంగా భావుకుడు కాబట్టే ఆయన హృదయం ఒక రచనను చూడగానే రసార్ద్రం అవుతుంది. దానిపై అపారమైన ఆదరం కలుగుతుంది. ఆ కవి లేదా రచయితపై స్నేహభావం జనిస్తుంది. ఆ రచన లేదా రచయిత గురించి ఆయన రాయడం ప్రారంభించగానే ఈ లక్షణాలన్నీ ఒక్కసారిగా ఆయనను ఆవరిస్తాయి.
వావిలాల సోమయాజులుగారు పుంఖానుపుంఖంగా వ్యాసాలు రచించినా, వారి వ్యాసాల సంపుటి 'మణి ప్రవాళము' ఒక్కటే గ్రంథరూపం ధరించింది. దీనిలోని ఎనిమిది వ్యాసాలూ సృజనాత్మక వ్యాసాలే.
ఈ సంపుటిలోని పది వ్యాసాలు వివాహం గురించేనంటే ఆయన ఏ విషయాన్నయినా ఎంత విపులంగా పరిశీలిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.
వావిలాల సోమయాజులుగారు తమ సాహిత్యవ్యాసాలలో ప్రాచీనాధునిక తెలుగు సాహిత్యాలు రెండింటినీ సమదృష్టితో చూశారు.
సాహిత్యాన్ని, సంస్కృతిని, లోకం తీరును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడడమే కాక వాటిని చూడవలసిన దృష్టిని కూడా మనకు సోమయాజులు గారు అందించారు.
ఈ వ్యాసాలను చదవడం ద్వారా ఆ దృష్టిని అందుకోవడమే పాఠకునికి కలిగే మహోపకారం.
డి. చంద్రశేఖర రెడ్డి