సత్యభామమ్మవారు పారిజాతాపహరణ సందర్భమున స్వర్గమునందలి మందాకిని
యందు జలక్రీడ లొనరించుచుండ -
మ. [1]ఎల దేఁటుల్ దమ వాలుఁ గన్గవలపై నిందీవరభ్రాంతిచే
మెలఁగన్ జేరలఁ గప్పుకో నలవిగామిం జీదరం జెంది యి
చ్చలఁ గాంక్షించిరి నిర్నిమేష జలజాస్యల్ మానుషత్వంబు న
య్యళిభీతి న్ముకుళీకృతాక్షి యగు సత్యాకాంత నీక్షించుచున్.”
[2]ప్రతివర్ష వసంతోదయ కుతుకాగత సుకవినికర గుంఫిత కావ్యస్మృతిరోమాంచ విశంకిత చతురాంతఃపుర వధూప్రసాధన రసికుఁ' డగు శ్రీరాయలవారు గావ్యోప వనవిహార మొనర్చుచు 'వాణీకుంభవక్షోజ నాట్యాయత్తంబగు భీమతంత్రిపయి బాహాటించు' నాముక్తమాల్యద వాసనలకుఁ దానె చొక్కుచుఁ నున్నవేళ 'నప్పాజీ’ యనుమతితో వారినిఁ గలసికొంటిని.
అప్పుడు వారు విలిబుత్తూరు వీధులలో జరించుచు నొక నాఁడు గర్గానిన విచిత్ర చిత్రమును గూర్చి తాము చెప్పికొనిన :
ఉ. [3]"వేవిన మేడపై వలభి వేణికఁ జంట వహించి విప్పగాఁ
బూవులు గోట మీటుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కామి శం
కావహమౌ కృతాభ్యసన లౌటను దంతపు మెట్లవెంబడి
న్జేవడి వీణ మీటుటలు జిక్కెడలించుటలు న్సరింబడన్.”
యను కావ్యమును సాభిలాషముగఁ జదివికొనుచు నానందించుచున్నారు. అప్పుడట కొక వేత్రపాణి వచ్చి చిన్నా దేవమ్మగారి రాక నెఱింగించినాఁడు. నేను వారి యుత్ప్రేక్షకు హృదయమొగ్గి యనుజ్ఞఁగైకొని ప్రాసాదమునుండి బయల్వెడలితిని.
భ్రమరాన్వేషణమును జీవితాదర్శములలో నొక్కటిగఁ బెట్టుకొనిన నేనొకనాఁటి బ్రాహ్మీముహూర్తమున నేకాంతముగ నొక రమణీయ మార్గమునఁ బయనించుచుండ నన్నిరువురు పాంథులు వచ్చి కలిసికొనిరి. వారి సంభాషణమున నిరువురును మహాకవు లైనట్లు నా కవగతమైనది.
'సఖ్యం సాప్తపదీన' మని పెద్ద లనినారు గదా! అనతికాలములో వారికిని నాకును గాఢమైత్రి యొదవినది. అందొకరు పింగళివారు; రెండవవ్యక్తి భట్టుమూర్తి. కుశలప్రశ్నాదికము ముగిసిన పిమ్మటఁ గైమోడ్చి కుతూహలముతో వారిని 'స్వామీ!
తమ కావ్యవనవాటికల మా భ్రమరము లెట్లున్న' వని ప్రశ్నించితిని.- ↑ 85. ఎలదేఁటుల్ పారిజా ఆ. 4. ప. 14
- ↑ 86.ప్రతివర్ష వసంతోదయ - పారిజా ఆ 1 ప 130
- ↑ 87. వేవిన మేడపై - ఆముక్త. ఆ. 1, ప. 62
వావిలాల సోమయాజులు సాహిత్యం-4