పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భట్టుమూర్తి కళాదుఁడు. పోగరపనితనము మెఱయు నేమేమో ప్రవచించి గిరికాదేవి యందచందముల వర్ణించి యపుడు :

శా. 88[1]"నానాసూన వితాన వాసనల నానందించు సారంగ మే
    లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కాకం దపంబంది యో
    షానాసాకృతిఁ బూని సర్వసుమన స్సౌరభ్యసంవాసియై
    పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబు నిర్వంకలన్.”

అని చెప్పినాఁడు. వెంటనే పింగళివా రందుకొని "ఒహో! బాగున్నది. 89[2]శ్రీహర్షులవారి పద్మము తపస్సుచేసి దమయంతీ పాదరూప మైనదని మీ గంధ ఫలి గిరికానాసిక యైనట్లున్న' దని సాభిప్రాయముగఁ బలికినారు.


దృష్టి నాపై నిల్పి పింగళివారు మా కావ్యవనమున మఱియొక వైచిత్రి పొడకట్టినది. 90[3]నిజాన్వయశత్రువుఁ జంపక ప్రసూనంబుఁ గరంబు గెల్చుట మనంబునఁ బెట్టి మా ప్రభావతీదేవి నాసికాపార్శ్వయుగ్మంబున నిత్యసేవకతఁ గ్రాలెడు నీక్షణతారకాఖ్య రోలంబకదంపతుల్ పెనువళావళి నెంతయు సంభ్రమంబునన్' అని సెలవిచ్చినారు.

భట్టుమూర్తి, పింగళివారి సెలవు గైకొని నాపై నొక మందస్మితమును బాఱవైచి ప్రక్కదారినఁ బయనించిరి. పిమ్మట సూరనార్యునితోఁ గలసి నే 'నపూర్వలక్షణలక్షి తమైన' కళాపూర్ణోదయోద్యానమునకు వెడలితిని. అట మధురలాలసను నెచ్చెలి పిండుతో సరససల్లాపములఁ బ్రొద్దుపుచ్చు చుండఁ గని వారి చమత్కృతుల జిత్తమునకు బరిపుష్టిఁ జేకూర్చుకొంటిని. వారికి జలక్రీడకు సమయమైనది. సరసిలోఁ బ్రవేశించినారు. “తత్కారణవీచికాచలితకంజముల న్మధులోలభృంగముల్ వారక సారెకు న్నెగసి వ్రాలుచు నొప్పెఁ దదంబు దేవతల్ నేఱుపుతోడ నాఁడు హరినీలఁపు టచ్చనగండ్ల కైవడిన్.” అంతటితో నే నట నుండుటకు వీలుగా లేదు.

అది యొక విచిత్రవనము. అట మన మల్లెలు మొల్లలు, కుందక కురవకములు, క్రముకపున్నాగములు కనుపింప లేదు. అతి వినూతనముగ నున్నది. 'నవ మి త్యవద్యమ్' ప్రవేశించి పర్యటన మారంభించితిని. మరందలుబ్ధ షట్పదపాళి సేకరించిన యొక మధుకోశముపై నా దృష్టిపడి యట్టె నిరవధికానందమున నిల్చిపోయినది. నన్నుఁ గని యట దూరముగ ధ్యానోపవిష్టుఁడై యున్న యొకజిజ్ఞాసువు91[4]నిమీలిత నేత్రముగలఁ బొడకట్టితినేమో! 'ఎవరది స్వామీ! తదేకదృష్టితోఁ దా మా మధుకోశము

నట్లు పరీక్షించుచున్నా' రని ప్రశ్నించినాఁడు.
  1. 88.నానాసూన వితాన - వసు. ఆ. 2, ప. 47
  2. 89.శ్రీహర్షుని నైషధమున పద్మము తపమొనర్చి దమయంతీపాదరూపము నొందినది. ఈ భావమునే గ్రహించి భట్టుమూర్తి యీ రచన కావించి యుండునని విజ్ఞుల యూహ
  3. 90. నిజాన్వయ శత్రువు ప్రభావతి ఆ. 2, ప. 70 తత్కారణవీచికా కళాపూర్ణోదయము ఆ. 6
  4. 91. జిజ్ఞాసువు - మారిస్ మేటర్ లింక్, భ్రమరజీవితమును గూర్చి ప్రత్యేక గ్రంథరచన మొనర్చినాడు

మణిప్రవాళము

53