Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    మధురనిశార్ధభాగధునీవిధాప్రియా
        హేలామనోజసాహిత్యవశత

తే. శిశిరహేమంతశుచిశరత్సేవ్యమానుఁ
    డై మహారాజవైభవోద్దామమూర్తి
    కూడి ఋతురాట్సభానలకూబరుండు
    మాధవుఁడు వచ్చె సుమసుకుమారమూర్తి.”

చిలుకలతేరు నెక్కి జైత్రయాత్రకు బయల్వెడలు వేళ సేనాసమేతముగ వనవీథులఁ బయనింప [1]'ప్రత్యగ్రసాలాగ్రహర్మ్య విటంకంబులు ప్రాఁకి వల్లివనజాస్యల్ సల్లిరుత్ఫుల్ల పల్లవహస్తంబుల భావిభావుక ఫలోల్లాసంబుతోఁ గొవ్విరుల్.'

ఉత్కంఠాపనోదితకలకంఠకంఠములతో వనలక్ష్మి 'నందనవనసుందరి నీ న్నందగాని రానిచ్చెనె?' యని సాకూతముగఁ బ్రశ్నించినది. ఆమె 'శోభా నవతరుణిమ నాశుష్క జీవతరువుల కిఁక, ఋతునేతా! వసంతా!!" యను ప్రమోదోన్మత్తమధుర గానమున మంజులముగ్ధనృత్య మొనర్చి యతని కాతిథ్య మిచ్చినది.

'మన సఖుఁడు, గురుఁడు దైవ' మీ మాధవస్వామియని మనసారనమ్మి మనోవాక్కాయకర్మల నాజ్ఞానువర్తియై మెలఁగు మలయమారుతుఁడు వసంతుని అభ్యుదయపరంపరాభివృద్ధి నర్థించుచు నానందాబ్ధి నోలాడుచు బహురూపముల ధరించి పొంపిళ్లు వోవుచున్నాడు. ఇతఁడు వనప్రియ కడకు వసంతాగమన వార్తఁ గొనిపోయి నపుడామె ముఖసమీరముతో గౌరవపురస్సరముగ నెదురురా 'నిలువెల్లఁ బొంగిపోయి యొడలెల్లఁ గాళ్లుగ వడిబారు నదియై' సకలచారీకరణాంగ హారచతురనృత్య మొనర్చినాఁడు. ఇది గమనించిన మన ప్రబంధపరమేశ్వరుఁడు :

చ. [2]ఇదె చనుదెంచెఁ జైత్రమని యెల్లవనంబులకుం బ్రమోదముల్
    బొదలఁగ మేలివార్తఁ గొని బోరన వచ్చిన దాడికాఁ డనన్
    మృదువనదేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
    పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.”

అని వర్ణించినాఁడు.

వసంతుఁ డతని యనుంగునెచ్చెలి యగుట నతఁడు వచ్చునపు డెదురేఁగి

సుగంధసేకరణ మిచ్చి మిత్రునికెత్తని కీర్తిధ్వజమై మలయానిలుఁ డొప్పినాఁడు.
  1. ప్రత్యగ్ర సాలాగ్ర - వసు చరి. ఆ. 1, ప. 132
  2. ప్రబంధ పరమేశ్వరుఁడు - ఎఱ్ఱన నృసింహపురాణము ఆ. 2 ప. 60

____________________________________________________________________________________________________

40

వావిలాల సోమయాజులు సాహిత్యం-4