Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇతడు ద్వేషరహితుడు, నిత్యసంతోషి, గణిత శాస్త్రవేత్త, ముహూర్తగుణ దోషజ్ఞుడు, వాగ్మి, సూక్ష్మబుద్ధి, నిత్యకర్మలలో ఆసక్తి కలవాడు, అయి ఉండాలెనని శాస్త్రం చెప్పుతున్నది. దైవజ్ఞుడు పూజలు పొందిన తరువాత ఇష్టదేవతా గురు ప్రార్థనలతో 'పంచాంగ శ్రవణం' ప్రారంభిస్తాడు.

తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడింది పంచాంగము. సంవత్సరాదిని పంచాంగం విన్న వాళ్ళకు 'క్రతుఫలం' చెప్పి ఉంది. నిత్య నైమిత్తిక కామ్య కర్మల్లో వేటికైనా భారతీయులకు కాలజ్ఞానం అవసరం. అంతేకాక వర్షాలు, కార్తెలు, ధనధాన్య సమృద్ధి మొదలైన వాటిలో జ్యోతిష్కులు చెప్పినట్లే జరుగుతూ ఉండటంవల్ల ప్రజలు అత్యాదరంతో ఈ పంచాంగ శ్రవణం చేస్తారు.
దైవజ్ఞుడు పంచాగ శ్రవణానికి (వినిపించటానికి) ముందు అనంతమైన కాల స్వరూపాన్ని విశదం చేస్తాడు. ఇది పంచాంగాలకు పీఠికాభాగంలో ఉంటుంది. సంవత్సరాధిపతులను గురించీ, వారిచ్చే ఫలితాలను గురించీ చెప్పి, తరువాత ఆదాయకందాయాలనూ, రాజపూజావమానాదులను నిరూపిస్తాడు. పుష్కరాలు గాని, అర్ధోదయ మహోదయాలు గాని ఉంటే వాటి విశేషాలను నిరూపిస్తాడు. గ్రహణ విశేషాలను పేర్కొంటాడు. పండితులు వేసే ప్రశ్నలకు సమాధానాలిచ్చిన తర్వాత దైవజ్ఞుడు తన ప్రసంగాన్ని క్రింది పంచాంగ శ్రవణఫలశ్రుతితో పూజ చేస్తాడు. ప్రజలు వడపప్పు, పానకాలు పుచ్చుకొని సంవత్సరం విశేషాలను గురించి ముచ్చటించుకుంటూ ఇళ్ళకు చేరుకుంటారు.
"శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యత వృణామ్ | ఆయుర్వృద్ధి ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసుసాధనం సముచితం పంచాంగ మాకర్ణితామ్ ||"
అథఃసూచీపట్టిక

1. "ద్విపరార్థాత్మకః కాలః కథితో యో మయా తవ
తదహస్తస్య మైత్రేయ విష్ణో రీశస్య కథ్యతే” విష్ణు పురాణము 6. అ.గ. 4 అధ్యా. శ్లో. 41

2. "శతం హితస్య వర్షాణాం పరమిత్యభిధీయతే
పంచాశద్భి స్తథా వరైః పరార్థమితి కీర్త్యతే" మార్కండేయ పురాణము 46 అధ్యాయ. శ్లో 42




380 వావిలాల సోమయాజులు సాహిత్యం-4