Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యవహరిస్తున్నాము. విష్ణు పురాణాదులు “రెండు పరార్థ కాల పరిమితి ఉన్న బ్రహ్మపతనము శ్రీమహావిష్ణువుకు ఒక దిన" మని పలుకుతున్నవి.' సచ్చిదానంద స్వరూపియైన పరమేశ్వరుని లీలావిలాసం చేత త్రిగుణాత్మకమైన సృష్టి కలుగుతున్నదనీ,

పరమేశ్వరుడు అపరిచ్ఛిన్నుడు కనుక బ్రహ్మతో సృష్టి కాలం ఆరంభమౌతున్నదనీ గమనించిన మన ప్రాచీనులు కాలాన్ని కొలవటానికి నాలుగు మానాలు ఏర్పరిచారు. 1. మనుష్య మానము 2. పితృమానము 3. దేవమానము 4. బ్రహ్మమానము. మనం మానవ లోకంలో నివసిస్తున్నాము. మనకు మానవమానం ప్రమాణం. మనకు మన మానంలోనే చెపితే అర్థమౌతుంది. కనుక మనవారు మానవేతరమైన మానత్రయాన్ని మానవమానంలోనే లెక్కించి చూశారు.

2


వాడియైన సూదిమొనతో తామరసదళాన్ని గుచ్చటానికి పట్టే కాలం ఒక త్రుటి. నూరు త్రుటులు ఒక లవము. ముప్పది లవాలు ఒక నిమేషము. పదునెన్మిది నిమేషాలు

ఒక కాష్ఠ. ముప్పది కాష్ఠలు ఒక కల - దీనికి ప్రాణము నామాంతరము. ఇది ఒక గుర్వక్షరోచ్చారణకు పట్టే కాలం. ముప్పది కలలు ఒక ఘటి. పది గుర్వక్షరోచ్చారణ కాలం ఒక ప్రాణం. ఆరు ప్రాణాలు ఒక వినాడి లేక విఘటిక. అరవై విఘటికలు ఒక అహోరాత్రము (దినము). పదిహేను దినాలొక పక్షం. రెండు పక్షాలు ఒక మాసం.

రెండు మాసాలు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనము. రెండు అయనాలు ఒక సంవత్సరము లేదా సౌరాబ్దము. ఇది మానవమానం! మానవ మానంలో రెండు పక్షాలున్నవి. ఇందులో శుక్లపక్షం పితరులకు పగలు. కృష్ణపక్షం రాత్రి. అంటే మన మాసం పితరులకు ఒక అహోరాత్ర మన్నమాట. ఇది పితృమానం!!

మానవ మానాన్ని అనుసరించి ఆరుమాసాలు ఉత్తరాయణము. ఆరు మాసాలు దక్షిణాయనము. ఇందులో మొదటిది దేవతలకు పగలు, రెండవది రాత్రి. అంటే మానవుల ఒక సంవత్సరము దేవతలకు ఒక అహోరాత్రము. దీనిని బట్టి మూడు వందల అరువది మానవ వత్సరాలు దేవతలకు ఒక సంవత్సరము. పన్నెండువేల దేవ సంవత్సరాలు దేవతల కొక యుగం. ఇది మనుష్య మానంలో 4,32,000 సంవత్సరాలు. దీనికి మహాయుగమని నామం. ఈ దేవయుగంలో మన కలి 4,32,000, ద్వాపరం 8,64,000, త్రేత 12,96,000 కృతయుగం 17,28,000. వెరసి 43,20,000 సంవత్సరాలు ఇమిడి ఉన్నా యన్నమాట. ఇది దేవమానం!! 362 వావిలాల సోమయాజులు సాహిత్యం-4