కృష్ణద్వైపాయనుడు - వేదవ్యాసుడు
వైదిక సాహిత్యంలో ఎక్కడా వ్యాసశబ్దం కనిపించదు. తరువాతి కాలములోని తైత్తిరీయారణ్యకంలోనూ, సామవిధాన బ్రాహ్మణంలోని వంగవంశ క్రమంవల్లనూ (Vedic Index II P. 339) కేవల వ్యాసశబ్దమే కాని కృష్ణద్వైపాయన, పారాశర్య శబ్దాలు కనుపించవు. కృష్ణ ద్వైపాయనులు ప్రత్యేక వ్యక్తులని కూడా ఒక అభిప్రాయం చారిత్రకులలో ఉంది. కాని “ఆంధ్ర మహాభారత భగీరథుడు నన్నయ్య భట్టారకుడు కృష్ణ ద్వైపాయన మునివృషభాభిహిత మహాభారత బద్ధనిరూపితార్థ మేర్పడ" రాజరాజు తన్ను భారతాంధ్రీకరణము చేయమని కోరినట్లు వ్రాయటం వల్ల, కృష్ణద్వైపాయనుల నిద్దరినీ ఒక వ్యక్తిగానే స్వీకరించినట్లు కనిపిస్తున్నది. సాత్యవతేయుడే భారత రచయిత అయిన వ్యాసుణ్ణిగా తిక్కయజ్వ భావించి, "సాత్యవతేయ సంస్కృతి శ్రీవిభవాస్పదం బయిన చిత్తముతో” అన్న భారతావతారికతో పలికినాడు. కానీ సాత్యవతేయుడు కౌరవవంశకర్తగాని పంచమ వేదకర్తకాడు. పంచమ వేదకర్త పారాశర్యుడని పార్జిటరు మహాశయుడు అభిప్రాయమిచ్చినాడు. (A.I.H.T.-70) దేశీయ చరిత్రకారుడు భగదత్త వైదిక వాఙ్మయ చరిత్రలో వ్యాసవంశాన్ని సమన్వయం చేయటానికి యత్నించాడు. ఆయన అభిప్రాయాన్ని అనుసరించి "అనాది కాలంలో బ్రహ్మ అనే మహర్షి ఒకడుండేవాడు. ఆయన కుమారుడు వశిష్ఠుడు. వశిష్ఠుని పుత్రుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. అతడు మత్స్యగంధి వల్ల ఒక కానీనుణ్ణి పొందినాడు. అతడే ద్వైపాయనుడు. తల్లి 'కృష్ణ' కాబట్టి అతడు కృష్ణద్వైపాయనుడైనాడు" (పే. 61) కానీ అంత స్వల్పంగా కృష్ణ ద్వైపాయన సాత్యవతేయులను సమన్వయం చేసి ఒకే వ్యక్తి అనటానికి అవకాశం లేదు. పారాశర్యులు నలుగురైదుగురు కనిపించటం వల్ల, వేదవిభాగం చేసిన పారాశర్యుడెవరో ఇంతవరకూ నిశ్చితం కాలేదు. ఇది భావి పరిశోధనలవల్ల నిరూపితమౌతోంది.
వ్యాసుడు - మహాభారతము
కృష్ణ ద్వైపాయనుడు వేదవిభాగం చేసినట్లు సమస్త పురాణాలూ సాక్ష్యమిస్తున్నవి. ఆయన నాలుగు వేదాలనూ నలుగురు శిష్యులకు - సుమంతుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమినులకు - ఒప్ప చెప్పినట్లు మహాభారతం వల్ల వ్యక్తమౌతున్నది. (1.6324; XII 342-13025) అతి ప్రాచీనకాలంనుంచీ భారతదేశంలో జనశ్రుతిలో (Tradition) ఉన్న ఉపాఖ్యానాలనూ, ఇతిహాసాలనూ, కథాగాథలను గ్రహించి అష్టాదశ సంస్కృతి 357