శ్రీ వేదవ్యాస “నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే! ఫుల్లారవిందాయతపత్రనేత్ర! | యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ||"
వ్యాస భగవానుడు భారతీయ జ్ఞానజ్యోతి. అతడు సమస్త విద్యాసాగరాలను ఆపోశన పట్టిన అగస్త్యుడు. విశాల భారతాన్ని ప్రప్రథమంలో వీక్షించిన దార్శనికుడు. జాతి కంతటికీ ఏకైక సాంస్కృతిక శక్తిని ప్రసాదించిన గురుదేవుడు. వేదవిభాగం చేసి, అష్టాదశ పురాణములను నిర్మించి 'పంచమ వేదమై పరగిన భారత సంహితను సృజించిన మహిమోపేతుడు వ్యాసుడు.
వ్యాసుడు : బిరుదము
"విద్యాస వేదాన్ యస్మాత్, వివ్యాస ఏకం వేదం చతుర్థా" అనే వ్యుత్పత్తులలో దేన్ని గ్రహించినా 'వ్యా' శబ్దం ఈ మహానుభావుడికి వేదవిభాగం (విస్తరణం) వల్ల కలిగిందని తెలుస్తుంది. వేదంలో యజ్ఞ యాగాది క్రతువులకు సంబంధించిన విధ్యర్థవాదక మంత్రాలను విస్తరించటం వల్ల ఆయనకు వ్యాసబిరుదం వచ్చిందని భారతీయ చారిత్రకు లందరూ అంగీకరిస్తున్నారు. యజ్ఞాన్ని నడిపించేవారు హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మలు. వీరు యజ్ఞం చేయవలసిన సందర్భాలలోనూ, చేయించవలసిన సమయాలలోనూ చెప్ప వలసిన మంత్రాదులను ప్రత్యేకంగా అనేకమంది మహర్షులు 'వ్యాసునికి' పూర్వమే చేసినట్లు అర్థమౌతున్నది. అందువల్ల ప్రధాన వ్యాసుడైన కృష్ణద్వైపాయన వ్యాసుడికి పూర్వం ఇరువది ఆరుగురు వ్యాసులున్నట్లు వాయు పురాణంలోని 23వ అధ్యాయంం వల్ల తెలుస్తున్నది. బ్రహ్మాండ పురాణంలో నూ, మరి యితర పురాణాలలోనూ శక్తి పరాశరాదులు వ్యాసులని ఉంది. వాయుపురాణంలో ఒక వ్యాసుడు భరద్వాజుడు. ఇదేవిధంగా సామవేదాచార్యు డనిపించుకున్న ద్వైపాయనుడికి కొంతగా పూర్వులూ, పూర్వ వ్యాసులూ అయిన కుధుమి, హిరణ్యనాభ, కౌసల్య, లౌగాక్షులు పురాణాదులవల్ల వ్యక్తులౌతున్నారు.