Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంక్రాంతి - సూర్యోపాసన



“బ్రహ్మస్వరూప ముదయే
మధ్యాహ్నేతు మహేశ్వరమ్‌।
సాయం ధ్యాయే త్సదా విష్ణుం
త్రిమూర్తిశ్చ దివాకరః ॥”

'వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి. వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి.' సంక్రాంతి మూడుదినాల పండుగ. అంధ్రులూ, తమిళులూ ఈ పండుగను మిగిలినవాటికంటే విశేషంగా గౌరవిస్తారు. దేశాచారాలు ఎన్ని విధాలుగా మారినా ప్రధానోద్దేశం మాత్రం సూర్యోపాసన. సంక్రాంతి పండుగ ముఖ్యంగా కాలంలోని మార్పును సూచిస్తుంది. సూర్యభగవానుడు సంక్రాంతి నాటికి ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించి (డిసెంబరు 21) రెండు వారాలు దాటి ఉంటుంది. కానీ ఉత్తరాపథానికి ఆది అయిన మకరంలో పుష్య శుద్ధ పూర్ణిమ (జనవరి 14) నాడు గాని ప్రవేశింపడు. అందువల్ల ప్రాచీన కాలంనుంచీ సూర్యుని ఉత్తరాయణమును సంక్రాంతినాటినుండే పరిగణించటం భారతీయ సంప్రదాయం.

ఆంధ్రదేశంలో 'కన్యకలు' ధనుర్మాసారంభం నుంచీ “గొబ్బిళ్ళు” పెట్టుకుంటారు. ఇంటి ముందు రంగవల్లికలు తీర్చి, గోమయంతో అర్ధగోళాక్ళతులుగా 'గొబ్బిళ్ళు' చేసి పసుపు కుంకుమలతో అలంకరించి, పూల గొడుగులతో నిలుపుతారు. వీటిని చూస్తుంటే పురాతన బౌద్ధ స్తూపాలు జ్ఞప్తికి వస్తుంటవి. స్తూపానికి 'గొబ్బ' అనే పర్యాయపదం ఒకటి బౌద్ధ సాహిత్యంలో కనిపిస్తుంది. దానికి, 'గొబ్బి'కీ సన్నిహిత సంబంధం ఉన్నదని ఊహింపవచ్చును. అనాది కాలంలో బౌద్ధమత ప్రాబల్యం మూలంగా ఇది మన దేశంలో నిలిచి ఉంటుంది. కొందరు ప్రాతఃకాలంలో సగం ఉదయించిన సూర్యుణ్ణి చూచి స్ధపతి (Architct) స్తూపరూపాన్ని చిత్రించి నిర్మించాడని అభిప్రాయ మిచ్చారు. బౌద్ధుల కాలపు స్తూపారాధనము (సూర్యారాధనము) తరువాత హిందూ సంఘంలో గొబ్బి పూజగా ఏర్పడి ఉంటుందని నా అభిప్రాయము. ఇది ద్రావిడ సంప్రదాయమనీ, ఆంధ్రదేశంలోకి ప్రాకివచ్చిందనీ కొందరు సాంఘిక శాస్త్ర వేత్తల అభిప్రాయం ఒకటి ఉన్నది. (M. N. Srinivas's - Folk songs, Journal of the ____________________________________________________________________________________________________

సంస్కృతి

345