పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ. “వెలిగించుచుందురు విమలార్యమానినీ
               తిలకంబు లెల్లెడ దీపరాజి,
       పట్టించుచుందురు ప్రమదామణుల్ నిజ
               సుతులచే దివటీలు పతులు చూడ
       ప్రేలించుచుందురు వివిధంబులౌ బాణ
               సంచులు బాలురు సంబరమున,
        కట్టించుచుందురు కమనీయ వస్త్రముల్
               క్రొత్త యల్లుండ్రచే నత్తమామ

తే. లాత్రపడుచుందు రెల్ల రా రాత్రమందు
       పరమ తేజోమయంబగు ప్రకృతి జూడ
       భారతీ భాగ్యరేఖా ప్రభావ మిటులు
       వెలుగు నన దోచు దీపాళి విధము గనగ.”

అని అన్నాడు.

ఔత్తరాహులు వెలిగించే దీపావళికి మరొక అభిప్రాయం ఆధారం. సుఖప్రసూతలు కాలేక మరణించినవాళ్ళూ, బలవన్మరణాన్ని పొందిన వాళ్ళూ భూతరూపాలతో తిరుగుతుంటారని వాళ్ళ నమ్మకం. వారిని పారద్రోలటానికని వారు దీప సమూహాన్ని వెలిగిస్తారట!

దీపావళి మహోత్సవాలలో మందు సామాన్లు కాల్చటం బాబరు చక్రవర్తితో ప్రారంభించింది. అందువల్ల ప్రమిదల్లో దీపాలు వెలిగించటమే ప్రధానంగా భావించే అలవాటు కనిపిస్తున్నది. కన్యకలు తాళపత్రాలతో గుమ్మటాలు చేసి దానిలో దీపం పెట్టి, గిరగిరా త్రిప్పుకుంటూ పాటలు పాడుతారు. గ్రామసీమలలో చొప్పకట్టలు కట్టి ఊరి బయట త్రిప్పి చివరకు అన్నిటినీ ఒకచోట చేర్చి నరకాసురుణ్ణి దగ్ధం చేసివచ్చినట్లుగా తిరిగి వస్తారు. దీపావళి పండుగ సయాం దేశంలో కూడా జరుగుతుంది. వారూ కార్తిక మాసంలో మనవలెనే ఆకాశదీపాలు ఉంచుతారు. బోర్నియోలో కూడా దీపావళి ఒకనాడు జరిగినట్లు పురాతత్త్వవేత్తలు చెబుతున్నారు. తూర్పు బోర్నియోలో కుటై నదీప్రాంతాన 'మౌర కామన్' అనే ప్రదేశంలో బయటపడ్డ క్రీ.శ.400 నాటి సంస్కృత శాసనం మూలంగా, ఆ దేశపురాజు 'మూలవర్మ' చరిత్ర బయట పడినది. అందులో అతని దానాలు పేర్కొన్నారు. దీపమాలికలతో తిలా పర్వత దానం చేసి ఆకాశదీపాలు ముఖ్యపట్నంలో - దీపావళి మహోత్సవానంతరం ____________________________________________________________________________________________________

సంస్కృతి

343