Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


దినము 'మిఠాయి' పంచిపెట్టి పేదసాదలకు సంతోషం కలిగించి, మూడవ దినం దస్తరాలను పూజిస్తారు. సాయంత్రం శారదాపూజ చేస్తారు. 'మిఠాయి' పంచి పెట్టటం వల్ల దుష్టశక్తులకు తృప్తి కలిగిస్తున్నామని వారు భావిస్తారు. శారదాపూజనాడు సర్వసామాన్యంగా జైనవర్తకులు పురోహితుణ్ణి పిలిపించి అతనిచేత పూజ చేయిస్తారు. అతడు దస్తరాల మీద 'శ్రీ' వ్రాస్తాడు. అది మేరుపర్వత రూపంలో ఉండవలెనని నియమం. అందువల్ల ముఖ్యంగా బేసి సంఖ్యగా ఉంటుంది. దస్తరం మీద ఒక పాత 'రౌప్యము' ఉంచి పూజిస్తారు. దాన్ని సంవత్సరాంతం వరకూ చలామణి అయ్యే ధనంలో కలపరు. అది అధికదనం తెచ్చి యిచ్చే వస్తువని వారి నమ్మకం. మరుసటి దినం బంధువులూ, స్నేహితులూ కలిసి క్రొత్త గుడ్డలు కట్టుకొని సద్దోష్ఠితో, సంగీత వ్యాపారాలతో కాలక్షేపం చేస్తారు.

హిందువులకు 'దీపావళి' దినం లోపరహితమైనది. మొదటిసారిగా అల్లుణ్ణి తీసుకోరావటానికిగానీ, చిన్నపిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభించటానికీగానీ, వ్యాపారారంభానికి గానీ అంతకంటే మంచిదినం మరొకటుండదని వారి అభిప్రాయం. ఇటువంటి సందర్భాలలో జ్యోతిష్కుని పిలిపించి ప్రశ్నించ వలసిన అగత్యం లేదు.

దీపావళి వస్తుందనగానే ఇళ్ళకు వెల్ల వేయించి పసుపుకుంకుమలు పెట్టి రమ్యంగా అలంకరిస్తారు. ఆ నాడు భారతీయు లెరిగిన రేఖా శాస్త్రమంతా వ్యక్తమయ్యేటట్లు అంతర్గృహాలలోనూ, బాహ్య తోరణ ప్రదేశాలలోనూ చిత్రాతి చిత్రమైన రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. ప్రాచీన కాలంలో ఈ నాడు గృహాలంకరణం కోసం తండుల కుసుమ బలివికారాదులైన కళలను స్త్రీలు ప్రత్యేకంగా అభ్యసించేవారని తెలుస్తున్నది. తోరణాలు కట్టటము ప్రాచీన భారతీయులు ఒక కళగా అభివృద్ధి పొందించారు. రాజనగరాలలో 'కలువడాలతో' స్తంభ వీధులను 'దీపావళి' పండుగనాడు అలంకరించేవారట. నరక చతుర్థినాడు తెల్లవారు జామున లేచి తలంటు స్నానం చేస్తారు. ఇది నరకాసురుడు చనిపోతూ కోరుకున్న కోరికట. అతని మృత్యు దినాన లోకంలో జనమందరూ అభ్యంగనం జేసి నూతన వస్త్రాలను ధరించేటట్లుగా వరమీయవలసిందని శ్రీకృష్ణుని కోరుకున్నాడట. పిండివంటలతో తృప్తికరమైన భోజనం చేసి, మర్నాడు కొత్త అల్లుళ్ళకి నూతన వస్త్రాలు కట్టబెట్టి ప్రొద్దు కుంగగానే మతాబులు, ఔట్లు, కాల్చుకుంటారు. 'భారతీ భాగ్య ప్రభావం' ఇటువంటిదని నిరూపించేటట్లుగా ఉంటుంది ఆ నాటి సౌభాగ్యము. అందువల్ల ఆ నాటి వెలుగును చూసి ఒక కవి -

342

వావిలాల సోమయాజులు సాహిత్యం-4