Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



సీ. [1]పొల పొల విరిసి పోవుచు నల్పు విఱుఁగుచు
          మొల్లమ్ము చెడిన మొగిళ్ల వలన
      పసి పసరేదు మవ్వఁపు సన్నజాజి మొ
          గ్గల తొలివిప్పు నా వెలఁదు లగుచు
      నెడ పడ్డ వానల జడులచేఁ జెమ్మ లా
          రిన లేఁత పొరగాలి పనల వలన
      మరు సెలకట్టె మాదిరి దూసి చను కమ్మ
          గేదఁగి తావులై స్వాదులగుచు

తే. చివర తెలిదారముల నూఁగు జిలుఁగులొలయ
     పొట్లపూవలెఁ బెరఁటిలోఁ బొలుపు లగుచు
     నలరు నేడాకులనఁటి మొవ్వాకు జిగికి
     నెలవులు శరత్తు తలిరు వెన్నెలలు ...'

[2]సాంద్రచంద్రికలు 'నెలయను వెండికుండఁ గడు నించి నిశాచకోరనేత్ర యంబరాహ్వయ మహానటమూర్తి మహాభిషేక మొనర్పఁగ నెల్లదిక్కులఁ బ్రవహించెడు పాలవెల్లి' యననొప్పును. అంతియ కాదు. కొన్ని సమయముల :

మ. [3]"అమృతం బాసవ మంగ రాగ ముదయో ద్యత్కాంతిచేలంబు చి
      హ్నమునుంగా శశిరేవతీరమణుఁ డున్మాదంబు మీఱం దమో
      యమున నృంగము నొంది పాఱఁ గరసీరాలోడితం జేయ వ
      చ్చె మరుద్వాహిని దాని దేర్పనన మించెం జంద్రికాపూరముల్.'

చంద్రికావిశిష్టములైన రాత్రులందు చకోరలీలలు చిత్రాతిచిత్రములైనవి. ఈ పులుఁగుల చేష్టలఁగని మహాకవులు మనోహరవర్ణన లొనర్చినారు. వాని భోజన ప్రియత్వమును గన్నులారఁ గాంచిన యొక కవిచంద్రుఁడు:

సీ. [4]నునులేఁత వెన్నెల కొనలు మెల్లనఁ ద్రుంచి
             పిల్లతండులకుఁ బెట్టు నవియుఁ
      జవియైన వెన్నెల చంచులఁ గబళించి
             యింపారఁ బ్రియుల కందిచ్చు నవియుఁ
      గడఁగి యింతటఁగాని వడఁదేర దనుభంగిఁ
             దనర వెన్నెలవెల్లి మునుఁగు నవియుఁ
      బగలింటి యాఁకలి పాయఁ బైపైఁబడి
             ముదురు వెన్నెలఁ గ్రోలి పొదలు నవియు

  1. పొలపాల - విశ్వనాథ ఋతుసంహారము
  2. సాంద్రచంద్రికలు - మూలము - ప్రభావతీ ప్రద్యు, ఆ. 4, ప. 125
  3. అమృతం బాసవ - పారిజా. ఆ. 2, ప. 47
  4. . నునులేఁత - అనంతామాత్యుని భోజరాజీయము

____________________________________________________________________________________________________

34

వావిలాల సోమయాజులు సాహిత్యం-4