పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మొదట ఆ స్త్రీని బృందంలోకి ఎవరు తీసుకొని వస్తారో అతనికి ఆమెవల్ల కలిగే సంతానం లభిస్తుంది. ఇదే రీతిగా ఒక తంతువు ననుసరించిగానీ, ఆచారాన్ని అనుసరించి గానీ ఒకరినొకరు వివాహం చేసుకోకుండానే అందరూ కలిసి ప్రణయ సామ్యాన్ని (Sex Communism) పొందుతుంటారు” అని.

టిబెట్టు, సిక్కిమ్, బూటానులలో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు కలిసి సమాన స్వామ్యలలో ముగ్గురు నలుగురు అక్కచెల్లెళ్ళను వివాహం చేసుకునే ఆచారం అమలులో ఉండేది. పెద్ద భార్య సంతానము పెద్దవానికీ, రెండవ భార్య సంతానము రెండవ వానికీ, మూడవ భార్య సంతానము మూడవ వారికీ, ఈ రీతిగా చెందుతుంది. ఇందులో ఎవరికైనా సంతానం లేకపోతే వాళ్ళ వాళ్ళ అనుమతిమీద పంచుకుండేవారు.

తోడాజాతిలో కుటుంబంలో పెద్ద కుమారుడు పెళ్ళి చేసుకుంటాడు. అతనికి అయిదారుగురు తమ్ములుంటే ఆ భార్య అందరినీ భర్తలుగా స్వీకరిస్తుంది. వారికి ఆమెతో కామ వ్యాపారము చేయగల వయస్సు లేనప్పుడు కూడా వారామెకు భర్తలే. వారు పెద్దవారయిన తరువాత ఆమె వారితో సంభోగ సంబంధాన్ని నెరపుతుంది. ఆ భార్యకు చెల్లెళ్ళుంటే వారు అక్క భర్తలకు న్యాయతః భార్య లౌతుంటారు. కులంలో ఆడవాళ్ళు తక్కువైనప్పుడు కొన్ని సమయాలలో అయిదారుగురు అన్నదమ్ములకు ఒకటే భార్యగా కూడా ఉంటుంది. ఇద్దరన్నదమ్ములకు ఇద్దరు భార్యలు సమస్వామ్యంతో కూడా ఉండవచ్చును.

లంకలో క్రీ.శ. 1818లో ఒక చట్టం జరిగింది. దానిని అనుసరించి ఇద్దరు ముగ్గురు భార్యలు సమస్వామ్యంతో ఉండవచ్చునని తీర్మానమైంది.

సఖాలిన్ ద్వీపానికి సంబంధించిన గిల్సన్ జాతిలో కూడా ఒకానొక కాలంలో 'బృంద వివాహం' ఆచారంగా ఉన్నదని చెప్పటానికి తగిన ఆధారాలు కనిపిస్తున్నవి. 'ఈ నాటికీ వారిలో ఒక వ్యక్తికి అన్న భార్యలతోనూ, భార్య చెల్లెళ్ళతోనూ వైవాహిక సంబంధం కలిగి ఉండే స్థితి ఉన్నది. వారి జీవన విధానంలో సాంఘిక, ఆర్థిక, సామ్యం కనిపిస్తున్నది' అని ఏంజెల్సు మహాశయుడు అభిప్రాయమిచ్చి ఉన్నాడు.

వివక్షా రహితమైన కామోపభోగం ఉన్న కాలంలో ఏర్పడ్డ సంసారాల వల్ల బృంద వివాహ విధానము అమలులోకి వచ్చింది. అంతకంటే విశేష నాగరికతలను తెలియ పరిచే పునలియన్ వివాహ విధానానికి ఇది పూర్వ రూపము. అన్నదమ్ములు ఒక కుటుంబానికి, అక్కచెల్లెళ్లు ఒక కుటుంబానికి చెందటమనే లక్షణం ఏర్పడ్డ ____________________________________________________________________________________________________

సంస్కృతి

235