Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజమార్గ ప్రతోళికా సౌధాగ్రములు ధరించిన కలువడములతోఁగాని కమనీయ సుస్వాగత మొసఁగ లేదు. శ్వేతవసనాంగరాగములతో శుభ్రనవ మల్లికాకుసుమ కుట్మలాలంకృతయైగాని శుక్లాభిసారిక కాంతునభిసరింపలేదు. సహగమనసమయము లందుఁ బితృవనవిహారమున కేఁగుచున్న పుణ్యవనితలఁ బుష్పలోకము ప్రణయాభిభూతయై యనుసరించినది. 'శ్మశానకుసుమన్యాయ' మబ్బినను గణుతింపక ప్రసవకులము స్నేహస్వరూపనిరూపణ మొనర్చి కీర్తిగడించి లోకమునకు గుణపాఠము నేర్పినది.

చతుర్విధాలంకరణములలోఁ గుసుమాలంకరణ మమలినమైనది. ఇయ్యదియే యాద్యమైనది. నేఁటి భూషాలంకరణముల చరిత్ర నన్వేషింప నవి యన్నియు నొకనాఁటి పౌష్పాలంకరణములని వెల్లడి యగుచున్నది. ఈ సహజ సుమాలంకరణ సౌభాగ్యగరిమను గూర్చి సకలర్తుసంపదలు గల యలకాపుర మందలి పురంధ్రీమణుల నడిగిన వీనుల విందుగ వినిపింతురు. 13[1]వారు లీలాకమలహస్తలు, బాలకుందాను విద్దలు, లోధ్రప్రసవ పరాగముచేఁ బిశంగిమశ్రీ వహించిన మనోహరాబ్జముఖలు, నవకురవక కేశపాశలు, చారుశిరీషకర్ణలు, ఆషాఢప్రథమ దివసమేఘదర్శనాయత నీపసుమాలంకృత సీమంతినులు”.

'స్త్రీల చిత్తము కుసుమసుకుమార' మని 14[2]"మహాకవి భవభూతి ప్రవచనము. వారికి నుద్యానపుష్పములకును సన్నిహిత స్నేహము, పుష్పవనవిహారసమయములఁ బ్రబంధనాయికలును బూఁదీవలు నన్యోన్యము మార్పునొందుట కవిలోక సిద్ధము. లతావనితలకు దోహద సేవ యొనర్చుట వా రెఱిఁగినట్లు వన్నె కెక్కిన వనపాలకు లైన నెఱుఁగ రనుటలో నతిశయోక్తి యిసుమంతయైన లేదు. లేకున్న కమలహస్తల కరస్పర్శతోఁగాని మాకందము పల్లవింపకుండుట, కోమలాంగుల యాలింగనకళా ప్రక్రియలతోఁ గాని కురవకము కుట్మలింప కుండుట లెట్లు పొసఁగును? అలివేణుల వీక్షణములో నే యమృత మున్నదో, తిలకము కులికి పుష్పించుచున్నది. అశోక మంత కంటెను జాణ; చరణాహతి కలుగు వఱకును జలింపదు. కంబుకంఠి గీతామృతమునఁగాని కిసలయింపని ప్రియాళువు కళాప్రియ యనుటలో నౌచిత్య మున్నది కదా! ముగ్ధహాసల ముఖరాగమున జంపకము, నర్మభాషిణుల సరసహాసమున మేరువు, సీమంతినుల సీధురసముచే వకుళ, పద్మనేత్రల ప్రౌఢముఖవిలాసశ్రీల సింధువారము, కామినీమణుల కమనీయసల్లాపములఁ గర్ణికారము కుసుమించుటలు

చూడ, నా లతాతరువుల రసికత యన్యప్రాణిలోకమున కతీతమైన దని తోఁచకమానదు.

  1. వారు లీలాకమల - కాళిదాసు మేఘసం. సర్గ 2, శ్లో. 2
  2. భవభూతి (క్రీ.శ. 730 ప్రాంతము) మాలతీమాధవము, ఉత్తరరామచరిత్ర, మహావీరచరిత్ర లనెడి నాటకత్రయమునకుఁ గర్త; పదవాక్యప్రమాణజ్ఞుఁడు

____________________________________________________________________________________________________

22

వావిలాల సోమయాజులు సాహిత్యం-4