ఈ పుటను అచ్చుదిద్దలేదు
రాణా "తప్పక సంతోషముతో తీర్చెదను" అని పలికెను. "మేము ఎంతకాలము మిమ్ము సేవించితిమి! మా జన్మ దేశమును నాశనము చేయకుడు. వాగ్దానమును ఇండు. తృప్తితో మరణింతును" అని బైర్సీ తన కోర్కెను రాణాకు తెలిపెను.
“నిన్ను పోలిన వీరులను ఎందరినో కన్న దేశమును పాడుచేయుటకు నా మనస్సు ఒప్పుట లేదు. నీకు వాగ్దానము చేయుచుంటిని. మీ దేశముపై దండెత్తను. ముందు పంపిన సైన్యములను ఇప్పుడే పిలువనంపెదను. మీ రాజుకు మీ వీరకథ చెప్పి పంపించి నేడో రేపో అతనితో సంధి కావించుకొనెదను. ఇదిగో ప్రమాణము” అని బైర్సీ చేతిలో చేయి ఉంచెను.
“మహాప్రభూ!" అని మహానందముతో రాణాను సంబోధించి, ఆయన చేతిని గుండెపై నిడుకొని బైర్సీ ప్రాణములు విడచెను.
దేశ గౌరవమే జాతి గౌరవము, వ్యక్తి గౌరవము!