Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/906

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేశాభిమానము

పూర్వము రాజపుత్రస్థానమున అనేక రాజ్యములు ఉండెను. అట్టివానిలో చిత్తూరు ప్రసిద్ధికెక్కినది. చిత్తూరు మహారాజా మిక్కిలి బలవంతుడు.

చిత్తూరు రాజ్యము చుట్టుపట్ల హారావతి, బుందీ అను రెండు చిన్న సంస్థానములు ఉండెను. ఈ రెండు సంస్థానములను పాలించు ప్రభువులు పరమమిత్రులు.

బుందీ సంస్థానాధిపతి హమీ అతి ధైర్యసాహసములు కలవాడు. ఆడిన మాట తప్పనివాడు. ఇతడు పూర్వము హారావతి ప్రభువుకు “నీకు ఎట్టి ఆపద వచ్చినను నేను సాయమొనర్తును" అని వాగ్దానము చేసెను. ప్రాణములనుకూడ ఇచ్చి అతనికి తోడ్పడుటకు ఎల్లవేళల అతడు సంసిద్ధుడుగా ఉండెను.

చిత్తూరు మహారాణాకు 'బలవంతుడను నా కేమి?' అను గర్వము అధికము. అతనికి కావలసినంత సైన్యబలము ఉన్నది. కలహమునకు కాలుద్రువ్వి చిన్న సంస్థానములపై దండెత్తి ఆ సంస్థాన ప్రభువుల యొద్దనుండి అతడు కప్పములు విపరీతముగ గ్రహించుచుండెను. అందుచే చిన్న సంస్థానములలోని ప్రభువులు ప్రజలు విపరీతముగ బాధలు పడుచుండిరి.

'హారావతి మిక్కిలి చిన్న సంస్థానము. రాణా కన్ను దానిపై బడినది. దానిని జయించి చిత్తూరు రాజ్యమున కలుపవలయును' అని అతనికి కోర్కె కలిగెను. ఆ అభిలాషను తీర్చికొనుటకు గొప్ప సైన్యమును సిద్దమొనర్చెను. “చిన్న పామె ఐనను పెద్ద కర్రతో కొట్టవలయును” అని అతని సిద్ధాంతము.

చిత్తూరు రాణా తన సైన్యముతో బుందీ సంస్థానము మీదుగ హారావతి పైకి దండెత్తిపోవుచుండెను. ఈ వార్త చారుల వలన బుందీ ప్రభువగు హామోకు తెలిసినది.

“ఎట్టి ఆపదలు వచ్చినను నీకు నేను సాయపడుదును” అని బుందీరాజు పూర్వము మిత్రుడైన హారావతి ప్రభువుకు మాట ఇచ్చెను కదా! తప్పుట ఎట్లు?


906

వావిలాల సోమయాజులు సాహిత్యం-3