నన్ను పిలిపించుచున్నాడు. మనకు మంచి దినములు వచ్చుచున్నవి” అని భార్యకు ధైర్యము చెప్పెను.
బ్రాహ్మణుడు మరునాడు సాయంకాలము నాలుగు ఘడియలకు పాదుషా దర్శనము చేయవలయును. ప్రతి నిత్యమును అతనికి అనుష్ఠానమును పూర్తి చేసికొని దేవతార్చన చేసి భుజించువేళకు నక్షత్రదర్శనము అగుచుండును.
ఉదయము లేచి అనుష్ఠానము కొంత తగ్గించుకొనెను. దేవతార్చన క్లుప్తముగ పూర్తి కావించి భుజించెను. దర్బారుకు బయలుదేరెను.
తాఖీదు చూపించుటచే ఆ బ్రాహ్మణుని పహరావారు వాకీరులలో అడ్డు పెట్టలేదు. దర్బారు ప్రాంతమునకు వచ్చిన తరువాత ప్రభువు అతనిని ఎందుకు పిలిపించి ఉండును? అను ఆలోచన కలిగినది. ఏమైనను తప్పదు తాఖీదు వచ్చినది. ధైర్యముతో గుండె రాయి చేసికొని పాదుషా దర్శనము చేయ నిశ్చయించెను.
భయభక్తులతో బ్రాహ్మణుడు అనేకమార్గములు గడచి దర్బారు కడకు చేరెను. పాదుషాకు దూరమునుండి మర్యాదను అనుసరించి సలాము చేసి వినయము ఉట్టిపడ నిలువబడెను. బ్రాహ్మణుడు కడు పొట్టివాడు, పాదుషా దృష్టి అతనిపై బడెను. ప్రక్కన నిల్చిన నజీరు, తాము తాఖీదు పంపి పిలిపించిన బ్రాహ్మణుడు ఇతడే అని విన్నవించెను.
ఆ బ్రాహ్మణుడు ఎవరో పాదుషాకు జ్ఞప్తికి వచ్చినది. పరికించి చూచి "పొట్టివానికి పుట్టెడు బుద్ధులు అందురు. వీని సామర్థ్యము ఏమో, ఏడురూపాయల జీతముతో ఎట్లు భార్యను ఏడు అంతస్తుల మేడపై నిల్పునో చూచెదను" అని పాదుషా మరల నిశ్చయించెను.
"ఏమయ్యా! బ్రాహ్మణుడా! మా యొద్ద ఉద్యోగము ఒకటి ఉన్నది. జీతము ఏడు రూపాయలు మాత్రమే. నీకు ఇచ్చిన చేసెదవా?" అని పాదుషా బ్రాహ్మణుని ప్రశ్నించెను.
ప్రభువు తనను పిలిపించినది భార్యతో కలహించు వేళ ఉద్యోగములు అన్నియు మహమ్మదీయులనే అని అన్నందుకు శిక్షించుటకై కాదని ఆ ప్రశ్నతో అర్థమైనది. లేచి వచ్చిన పంచ ప్రాణములతో అతడు: