అప్పుడు అక్బరు చక్రవర్తి రాజ్యము చేయుచుండెను. అతని సామ్రాజ్యము అతి విశాలమైనది. భారతదేశములోని అధిక భాగము అందు ఇమిడి ఉన్నది. సమర్థులైన మంత్రుల సహాయమున ఆ గొప్ప సామ్రాజ్యమును అక్బరు కడు సమర్థతతో పాలించుచుండెను.
ఆనాటి ప్రజలు శాంతిసౌఖ్యములను అనుభవించుటకు ఆ చక్రవర్తి ఏర్పాటుచేసిన చట్టములు కట్టుదిట్టములు కారణము. రాజోద్యోగులు ప్రజలకు అన్యాయము చేయుటకు గాని, లేని ఆపదలను కల్పించుటకు గాని, లంచములు పుచ్చుకొనుటకు గాని జంకుచుండిరి.
వారి ప్రవర్తనమును గూర్చి తనకు నివేదించుటకు అక్బరు గూఢచారులను నియమించెను. అంతటితో అతడు తృప్తి పడలేదు. మారు వేషములతో తానే ప్రజలమధ్య తిరుగుచు వారి సంభాషణములను వినుచుండెడివాడు. అవసరము ఐనచో వారి కష్టములను తీర్చుటకు తగిన చర్యలు తీసుకొనుచుండెడివాడు.
ప్రతినిత్యమును రాత్రులందు కొంతకాలము ముఖ్యపట్టణము ఐన ఢిల్లీలో మారువేషమున తిరుగుట అతని దినచర్యలలో ఒకటి. అట్టి సమయములందు అక్బరు పాదుషాను రాజా బీర్బల్ అనుసరించేవాడు.
బీర్బల్ సంభాషణమున కడు చతురుడు. ఇతని ప్రతి వాక్యమున హాస్యము ఉట్టిపడుచుండును. అందుచే ఇతనిపై పాదుషాకు ప్రేమ మిక్కుటము, క్రమముగ ఇతడు చక్రవర్తికి వేడుక చెలికాడు అయ్యెను.
ఒకనాడు అక్బరు చక్రవర్తి రాజా బీర్బల్ ఇరువురును నగరమున రాత్రివేళ సంచారము బయలుదేరిరి. ఆ పట్టణమున ఒక బ్రాహ్మణవీథికి వచ్చిరి. ఆ వీథిలో ఒక పూరింటినుండి చిన్న వాక్కలహము వినుపించుచుండెను. అక్బరు చక్రవర్తికి అచ్చట ఆగి దానిని వినుటకు కుతూహలము కలిగెను.