Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/896

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మర్యాద రామన్న “ఇందుకు సమాధానము ఏమి?” అన్నట్లు హరగుప్తుని వంక చూచెను. హరగుప్తుడు “నా మిత్రుడు ఇష్టము వచ్చినంత కుమారునికి ఇమ్ము అనినాడు. నాకు ఈ వేయినాణెములను ఈ ధర్మగుప్తునికి ఇచ్చుట ఇష్టము. ఇవిగో! నా వెంటనే కొని వచ్చినాను. వీనిని అతడు తీసికొనునట్లు చేయుడు. నన్ను అల్లరిపాలు చేయకుడు” అని నివేదించెను.

సూక్ష్మబుద్ధితో ఆలోచించి మర్యాదరామన్న "హరగుప్తా ! నీ మిత్రుడు కుమారుడు పెద్దవాడు ఐన తరువాత తాను ఇచ్చిన పదివేల సువర్ణములకుగాను ఇష్టమైనంత ఇమ్ము అనినాడు. నీవు అంగీకరించితి. కాని యిప్పుడు దానికి నీవు విపరీతమైన అర్థమును చెప్పుచుంటివి" అనెను.

హరగుప్తునకు మిత్రుని వాక్యములలో మరియొక అర్థము ఉన్నట్లు అప్పుడు బోధపడినది. సూక్ష్మబుద్ధియైన రామన్న ఏమి అర్థము చెప్పునో అని సభలోనివారు అందరు చెవులు రిక్కించి వినుటకు కుతూహల పడుచుండిరి.

మర్యాద రామన్న "హరిగుప్తా ! నీ మిత్రుడు కడు తెలివిగలవాడు, నీ కుటిలబుద్ధి ఊహించియే ఇష్టము వచ్చినంత ఇమ్ము అనినాడు. ఇష్టమునకు నీవు ఇతరులకు ఇచ్చునది అని ఉద్దేశించి పుచ్చుకొనునాడే ఎక్కువగా కాజేయతలచితిని. నీవు పుచ్చుకొనునదియే నీ ఇష్టము. తన కుమారునికి ఇష్టమైనది ఇమ్మని నీ మిత్రుడు నందివర్ధనుని అభిప్రాయము. నందివర్ధనుని పుత్రుడైన ఈ ధర్మగుప్తునికి అతని తండ్రి నీ పరముగ ఇచ్చిన పదివేల సువర్ణములను ఈయక తప్పదు. ఇంతకాలమును ఆ ధనమును నీ కడ ఉంచుకొని వ్యాపారము చేసి లాభముల గడించితివి. కావున దానికై మరి రెండువేల సువర్ణములను అధికముగా నిమ్ము. అకారణముగా అధర్మపరుడివై ధర్మగుప్తుని సభకు కొనివచ్చి శ్రమ పెట్టినందుకు మరియొక వేయినాణెములను ఇమ్ము. నీ మిత్రద్రోహబుద్ధిని ప్రభుత్వము సహింపజాలదు. కావున ఈ దోషమునకు ప్రభువువారి కోశమునకు అయిదు వందల నాణెములను అదనముగ చెల్లింపుము. ఇకముందు ఎన్నడును ఇట్టి అధర్మమునకు పాల్పడకుము. పై పద్ధతిని పాటింపకున్న నిన్ను శూలముపై ఎక్కింతును!” అని తీర్పు చెప్పెను.

మర్యాద రామన్న ఒక్కొక్క శిక్ష చెప్పినపుడెల్ల హరగుప్తుని ముఖము పాలిపోవుచుండెను. తుదకు అతని ముఖమున నెత్తురుబొట్టు కూడ ఉన్నట్లు లేదు.