ప్రభాదేవి గద్గదకంఠముతో "నాథా! మీరు లేని ఈ పాడులోకమున నా బ్రతుకు ఎందులకు? మన బిడ్డ నా తమ్ముని ఇంట పెరుగును. అనుజ్ఞ ఇండు. సహగమనము చేసి నేనును మీతో దేవలోకమునకు వచ్చెదను" అని వేడుకొనెను.
అట్టి స్థితిలో నందివర్ధనుని ఇంటికి ఒక ఆప్తమిత్రుడు వచ్చెను. వాడిపోయిన మిత్రుని మొగము చూచి:
"మిత్రమా ! ఏమిటి? నీ ముఖమున ఎన్నడును శోకమును చూచి ఎరుగును. ఇందుకు కారణము ఏమి? అని ప్రశ్నించెను.
నందివర్ధనుడు "మిత్రమా హరిగుప్తా! మనము ఇరువురమును బాల్య స్నేహితులము. ఆటలయందైనను కలహించి ఎరుగము. నాకు నేడో రేపో మృత్యువు ఆసన్నమై ఉన్నది ఒక్క సహాయము చేయుము.
“నా కడ కొంత ధనము ఉన్నది. ఇది దొంగలపాలో దొరలపాలో, నా కుమారుడు ధర్మగుప్తుడు చిన్నవాడు. ఈ ధనమును నీ యొద్ద ఉంచి కాపాడి వాడు పెద్దవాడు ఐన తరువాత ఇష్టము వచ్చినంత ఇమ్ము" అని అడిగెను.
మిత్రునకు ధనము అనగా ఆశ పుట్టినది. “ముందు చేజిక్కించుకొనిన మూడవనాటి మాట! ఇవ్వవలసి వచ్చినప్పుడు జూడవచ్చును" అని మనస్సున అతడు తలపోసెను. అతడు "మిత్రమా! అది ఎంత పని! తప్పక నీ కోర్కె నెరవేర్చెదను" అని పలికెను.
నందివర్ధనుడు మిత్రునికి పదివేల బంగారు నాణెములను ఇచ్చి "తప్పక నా కుమారునికి ఇష్టము వచ్చినంత ఇవ్వవలయును సుమా!" అని చెప్పి చేతిలో చేయి వేయించుకొనెను. తరువాత కొలది కాలమునకే మరణించెను.
భర్త అంగీకరింపకపోవుటచే నందివర్ధనుని భార్య ప్రభాదేవి సహగమనము చేయలేదు. కుమారుని మంచిచెడ్డలు చూచుచుండెను.
ధర్మగుప్తుడు పెరిగి పెద్దవాడు అయ్యెను. విద్యలు నేర్చెను. వ్యాపారరహస్యములు నేర్చికొనెను. స్వతంత్రముగ వ్యాపారము సాగింపతలచెను. చేత ధనము లేదు. తల్లి అతనికి, అతని మిత్రునికడ తండ్రి దాచి ఉంచిన డబ్బు సంగతి తెలియజెప్పెను.