నందివర్ధనుడు ధర్మగుప్తుని భావిజీవితము ఎట్లుండునో తెలిసికొనతలచి ఆ జ్యోతిష్కుని కడకు వెడలెను. జ్యోతిష్కుడు, నందివర్ధనుడు ఇచ్చిన దక్షిణ తాంబులములను గ్రహించి -
"మిత్రమా! స్వల్పకాలములో నీకు ఒక గండము ఉన్నది. త్వరపడుము. నీ దానధర్మములకు దేవతలు మెచ్చిరి. నీకు త్వరలో పిలుపు వచ్చును” అని చెప్పెను.
నందివర్ధనుడు ఆలోచనలోపడెను. అతనికి మరణము అన్న భయములేదు. కాని కుమారుడు ఇంకను పెద్దవాడు కాలేదు. తనకు ముద్దుముచ్చటలు తీరలేదు. తనది గొప్ప వ్యాపారము, ధర్మగుప్తుడు పెరిగి పెద్దవాడై స్వయముగ వ్యవహారములను చక్కబెట్టుకొను వరకును వానిని చూచువారు ఎవరు? కుటుంబమునకు ఎవరు దిక్కు? ఆశ్రయించుకొని ఉన్న ఉద్యోగులు ఎట్లు బ్రతుకుదురు? తాను నిలిపిన దేవాలయము లందు పూజలు ఉత్సవములు సాగించువారు ఎవరు?
నందివర్ధనుని మనస్సు కొంతకాలము బాధపడినది. ప్రయోజనము ఏమున్నది? "మృత్యువు రాక మానదు. ఎట్టి కష్టములు వచ్చినను ఎదుర్కొనుటయే ధీరుని లక్షణము” అని అతడు నిశ్చయించుకొనెను.
మరునాడు తన భార్యను పిలిచి దుఃఖముతో అతడు ఆమెతో ఇట్లనెను, “ప్రభా! రామేశ్వరుని కృపచే కలిగిన మన ముద్దుబిడ్డను చూచుకొనుచు కాలము వెళ్ళబుచ్చ తలచితిని. కాని దైవము వేరు విధముగ తలచెను. నాకు త్వరలో పిలుపు రానున్నది. మన బిడ్డడు ఇంకను చిన్నవాడు. ఇక మీద వానిని ఎట్లు పెంచి పెద్దవానిని చేసెదవో? జాగ్రత్త సుమా!"
నందివర్ధనుని భార్య ప్రభాదేవి మహాసాధ్వి. భర్తకు పిడుగు వంటి అశుభము వినినంతనే ఆమె మూర్ఛిల్లినది. ఆమె గుండె నీరైనది. కొంత కాలమునకు తెప్పరిల్లినది. ఏమి పలుకుటకును ఆమెకు తోచలేదు. భర్త పాదములపై పడి మోకరిల్లి కన్నీరు మున్నీరుగ ఏడ్వసాగెను. నందివర్ధనుడు ఆమె కన్నీరు తుడిచి "ప్రియా! చింతించి ప్రయోజనము ఏమున్నది? కానున్నది కాకమానదు. కష్టసమయముల ధైర్యము వహించుట ధీర లక్షణము. నీవు సామాన్యురాలవు కావు. సర్వమును తెలిసినదానవు. ధైర్యము వహింపుము. ఇంటిని చక్కబెట్టుకొనుము. బిడ్డను తీర్చిదిద్దుకొనుము" అని బుజ్జగించెను.