"ప్రభూ ! మీరు అయాజ్ ఎడ అధిక ప్రేమను అనురాగమును చూపుచున్నారు. దానికి గారణము తెలిసికొని మా మనస్సు ముచ్చటపడుచున్నది" అని వేడిరి.
చక్రవర్తికి వారు ఇట్లు ఎందుకు ప్రశ్నించిరో అర్థమైనది. అతడు చిరునవ్వు నవ్వి “మీరును ఆ ఉత్తమ గుణములను నేర్చుకొని నా సేవచేయదలచినారా? మంచిది. సమయము వచ్చినప్పుడు నేనే మీకు ఆ గుణములను తెలియ చెప్పెదను" అని వారికి సమాధాన మొసంగెను.
తరువాత కొంతకాలము గడిచినది. మహమ్మదు చక్రవర్తి మంత్రులను పిల్చి వారితో ఇట్లు పలికెను. "మంత్రులారా! నా కోటకు బయట ఒక ఉద్యానవనము ఉన్నది. మీరు అందరును ఎరుగుదురు. ఒక కారణమున నేను ఈ రాత్రి మొదలు రేపు రాత్రి వరకు అక్కడనే ఉందును. మీరు ఒక్క మారు రేపు సూర్యుడు అస్తమించుటకు పూర్వము వచ్చి నన్ను కలసికొనుడు. మీరు ఇంటియందు లేకపోవుట వలన మీ కుటుంబములకు ఎట్టి లోపములును జరుగవు. ఆ విషయమున అవసరమైన చర్యలను నేను తీసికొందును.”
మంత్రులకు ఏమనుటకును పాలుపోలేదు. కాని మహమ్మదు చండశాసనుడు. తప్పనిసరి అగుటచే వారు “చిత్తము” అని అట్లే చక్రవర్తిని ఉద్యానవనమున మరుసటినాడు సూర్యోదయము మొదలు సూర్యాస్తమయమగు లోపల ఒక మారు సందర్శించుటకు అంగీకరించిరి.
చక్రవర్తి ఆనాటి రాత్రే కోటనుండి ఉద్యానవనమునకు పోవు మార్గమునందు ఎన్నెన్నో వింతలు వినోదములు ఏర్పాటు చేయించెను. రాజు తలచుకొనిన కొదువ ఏమున్నది? దేశమున ఎన్ని చిత్రవిచిత్ర వస్తువులు ఉన్నవో వానిని అన్నిటిని ఆ రాజమార్గమున ప్రదర్శించిరి. వివిధ వస్తుప్రదర్శనములతో పాటుగ వింతయైన జంతు ప్రదర్శనములు ఏర్పాటు కావింపబడెను. సంగీతసభలు, నాట్యశాలలు, కావ్యగానములు లెక్కకు మిక్కిలిగ ఉదయమునుండి జరుగుచున్నవి. గారడివాండ్రు చూపుచున్న విచిత్రమగు ప్రదర్శనములు చూచుటకు సామాన్యజనము గుంపులు చేరుచుండిరి. ఆ రాజమార్గమునందు ఎచ్చట చూచినను స్వర్గభోగము తాండవించుచుండెను. మధ్యాహ్న భోజనములు కూడా అందే ఏర్పాటై ఉండుటచే జనము ఇంటికైన పోవలసిన పని లేకుండెను. ఈ కారణమున జనము ఇసుక వేసిన రాలుట లేదు. కదంబమ