కాదినమున గయాశీర్షుడతని రెండు ఘడియల కాల మేకాంత గృహమున బంధించి యవమానించినాడు.
శిక్షననుభవించి బయటకు వచ్చిన తక్షణమే చెట్లనీడల బుద్దపాదములు కడ జదువుకొనుచున్న మంగళ, ధ్వజకేతువు లతనికిగనుపించినారు. అతివేగమున వారికడకు వచ్చి యుద్రిక్త మానసములతో 'ధ్వజకేతూ! నేనీ గయాశీర్షుని శిక్షల, నవమానములను భరింపలేకున్నాను. నాలంద యన నాకసహ్యము కలుగుచున్నది. గయాశీర్షునకు విద్య నేర్పు విధానము తెలియదు' అని తీక్షణముగ బలికినాడు.
ధ్వజకేతువు సహజమగు చమత్కార లక్షణములతో 'ఉఁ సాదు రేగినది. తల పొలమున గాని నిలువదన్నమాట!' యనినాడు. మంగళుడు గ్రంథపఠనమును జాలించి "శాతకర్ణి! ఈ గొడవంతయు నేమి"టని ప్రశ్నించినాడు.
"ఏమున్నది? నా నిత్యజీవితము నరక ప్రాయముగనున్నది. సంస్కృత వ్యాకరణము, సూత్రచింతన, కంఠస్థమొనర్పనందున చూచివ్రాత, వినయ పాఠములు, చూచివ్రాత ప్రాకృత వ్యాకరణము, సూత్ర చింతన. చూచివ్రాత అటు పిమ్మట ఖగోళము మీనమేషముల లెక్కించుట తరువాత దెబ్బలు, ఏకాంత గృహనివాసమను నవమానము, నా పాలిటి యమునివలె నా గయాశీరుడవతరించినాడు. నేనిక నీ శిక్షణావిధానమునెంతో కాలము భరింపలేను" అని శిఖిశాతకర్ణి దుఃఖముతో బలికినాడు.
మంగళుడిట్లనినాడు. “నీవు నుపాధ్యాయులనిందింప జూచుకొనకుము. దానివలన నణుమాత్రమును బ్రయోజనములేదు. కంఠస్థ మొనర్పకున్న గయా శీర్షుడు పాఠములు వచ్చినట్లంగీకరింపరు. అది వారి మార్గము.
కరుణతో నతని మిత్రులోర్తురని శాతకర్ణి యుద్దేశించినాడు. మంగళుని వాక్యములతని కసంతృప్తికలిగించినవి. "అట్లే కానిమ్ము. ఈ రసవిహీనమైన మొరటుపద్దతి నాయన యెన్నాళ్ళు సాగించునో జూచెద”నని శాతకర్ణియట నిలువ లేక వెనుదిరిగినాడు.
శాతకర్ణి ప్రవర్తన మంగళునకు నచ్చలేదు. వ్యతిరేకాభిప్రాయమును జెప్పినంతనే మిత్రునిపై నంతటి కోపమును దెచ్చుకొనుట విద్యార్థి జీవితమునకు బనికిరాదని యతని నమ్మకము. అయినను మిత్రునసంతృప్తిపరచుట కిష్టపడక మరల దగ్గఱకు బిలిచి 'శిఖీ! తొందర పడకుము. పాఠక్రమము నీకు గొత్తగ నున్నట్లున్నది. కాలము, గడచిన నీవే దాని రుచిని గ్రహింతువు. అనాడు గయాశీర్షుని విధానమును వేనోళ్ళ పొగుడుదు'వని స్నేహ పూర్వకముగ బలికినాడు.