Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంగ్లీషులో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ రచించిన నవల 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్'. ఆ కాలంలో ఈ నవల పాఠకలోకాన్ని ఎంతగానో ఆకర్షించింది. వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వ్యక్తిలోని మంచి ఒక పాత్రగానూ, చెడు మరొక పాత్రగానూ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది. ఒక వ్యక్తే భిన్న సమయాలలో మంచివాడుగానూ, చెడ్డవాడుగానూ ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది. మనిషిలోని చెడు స్వభావమే మంచి స్వభావాన్ని కూడా పూర్తిగా ఆక్రమించుకుంటే ఆ మనిషి జీవితం ఏమవుతుంది తెలియజెప్పేదే ఈ నవల.

ప్రౌఢ కవి విమర్శకులు పిల్లలకోసం సరళంగా సాహిత్య సృజన చేయడం చాలా కష్టం. వారికి అలవాటైన శైలి వారు పిల్లలకోసం రాసేదానిలోకి చొరబడుతుంది. అలా కాకుండా సోమయాజులుగారు పిల్లలకోసం సరళమైన భాషలో 'ఆండ్రూ కార్నెగీ’ జీవిత కథను రచించారు. ఒక ఉత్తమ విద్యార్థి కథను 'నాలంద' అన్న నవలికగా తీర్చిదిద్దారు. వీరు 'అగ్రగాములు' అన్న పుస్తకంలో ఝాన్సీ లక్ష్మీబాయి, లోకమాన్య తిలక్, గాంధీజీ, నేతాజీల జీవిత గాథలను పిల్లలకోసం రచించారు. ఈ నలుగురు స్వాతంత్ర్య సమర యోధుల కథలు పిల్లలలో దేశభక్తిని పెంపొందింపజేస్తాయి.

కదంబములో ఆరు కథలున్నాయి. వీటిలో త్యాగము, భ్రాతృప్రేమ, అహింస, ధర్మబుద్ధి, దేశాభిమానము ముఖ్య నీతులు. పిల్లలలో మంచి నీతిని పెంపొందించడానికి ఉద్దేశించిన కథలివి.

స్వాభావికంగా అధ్యాపకులైన వావిలాల సోమయాజులు గారు ఒకవైపు ప్రౌఢ సాహిత్యాన్ని సృష్టిస్తూనే మరోవైపు అంతర్జాతీయ ఖ్యాతిపొందిన షేక్స్పియర్ నాటకాలను అనువదించడం, అదే సమయంలో బాలబాలికల కోసం నీతికథలను రచించడం, వారికి భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దాలనే అభిలాషను తెలియజేస్తుంది.

డి. చంద్రశేఖర రెడ్డి