పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితా ముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ సంపుటులలో ఇది మూడవది.

19వ శతాబ్దం ద్వితీయార్ధంలోనే తెలుగులో నాటకరచన ప్రారంభమైనది. స్వతంత్ర నాటకాలు తక్కువగానూ, అనువాద నాటకాలు ఎక్కువగానూ మొదట్లో వచ్చేవి. అనువాదాల్లో ఎక్కువ భాగం సంస్కృత నాటకాలకు అనువాదాలు. తెలుగువారికి ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడడంతో షేక్స్పియర్ వంటి నాటకకర్తల నాటకాలను తెలుగులోకి తేవాలన్న కాంక్ష ఏర్పడింది. ఆ రోజుల్లో ఆంగ్లాధికారులు, కళాశాలల ప్రధానాచార్యులుగా ఉన్న ఆంగ్లేయులు ఆంగ్ల నాటకాల ప్రదర్శనలు చేయించారు. వాటిలో ముఖ్యమైనవి షేక్స్పియర్ నాటకాలే. షేక్స్పియర్ నాటకానువాదకులలో మొదట చెప్పుకోదగినవాడు వావిలాల వాసుదేవ శాస్త్రి. మన వావిలాల వారితో ఇంటిపేరు కలిసింది. తరువాత గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు తదితరులు షేక్స్పియర్ నాటకాలను అనువదించారు. అనువాదంలోనూ భిన్న పద్ధతులు అనుసరించారు. కొందరు మొత్తం నాటకాన్ని ద్విపద తేటగీతి వంటి ఛందస్సులలో రాయగా, మరికొందరు గద్య పద్య మిశ్రంగా కేవలం గద్యరూపంలోనూ రచించారు. కొందరు స్థలాల పేర్లు, పాత్రల పేర్లు మార్చి నాటకాన్ని ప్రాంతీయం చేసారు. కొందరు యథాతథంగా అనువదించారు. కొందరు గ్రాంధిక భాష వాడితే, మరికొందరు వ్యావహారికం వాడారు.

వావిలాల సోమయాజులు గారు మూడు షేక్స్పియర్ నాటకాలను అనువదించారు. అవి జూలియస్ సీజర్, ఆంటోని - క్లియోపాత్రా, మేక్బెత్. ఈ మూడు నాటకాలకూ ఆయన విపులమైన పరిచయం రాసారు. అథోజ్ఞాపికలు ఇచ్చారు. నాటకాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన సామగ్రి అంతా ఇచ్చారు.

నాటకాన్ని బహుసరళంగా పాత్రోచితమైన వాడుకభాషలో దాదాపు మొత్తం గద్యరూపంలోనే రచించారు. ఎక్కడో అవసరమైన కొద్దిమాత్రపు గీతాలను వాడారు. బహుళ తెలుగులో ప్రదర్శన యోగ్యంగానూ, ఆధునిక భాషలోనూ, యథామాతృకం గానూ షేక్స్పియర్ నాటకాలను అనువదించడంలో మొదటివారు సోమయాజులుగారే.