పరికించకుండా దుముకగలిగిన ప్రథమవ్యక్తిని నేనే ఐనాను. నేను ధరిస్తూ ఉన్న భంగరహితమైన దుస్తులతో నాకు సంపూర్ణమైన భద్రత చేకూరింది. అసలు నాకు ఒకరీతిగా భావిస్తే అస్తిత్వమే లేదనుకోండి! నా పరిశోధనాగార ద్వారానికి ప్రవేశముండి, ఎప్పుడూ అక్కడ సర్వసిద్ధంగా ఉంటుండే ద్రవ్యాలలో మిశ్రమాన్ని తయారుచేసికోటానికి ఒకటిరెండు క్షణాల కాలవ్యవధి ఇస్తే ఎడ్వర్టు హైడ్ అద్దంమీద పడ్డ నిశ్వాసమాలిన్యం లాగా అంతర్ధానమై పోగలడు. - ఇది మీరు ఊహించండి. అతని స్థానంలో స్వగృహంలోని పఠనమందిరంలో క్రొవ్వొత్తి దీపాన్ని సవరిస్తూ తీక్షంగా లోకుల అనుమానాలను గురించి ఆలోచిస్తూ, వాటికి తనలో తానే నవ్వుకుంటూ హెన్రీ జెకిల్ మీకు దర్శనమిస్తాడు.
మీకు ఇంతకు పూర్వమే నివేదించాను ఈ అవకుంఠనంలో నేను పొందే విలాసాలు గౌరవప్రదాలు కావని. ఇంతకంటే పరుషమైన, పదాన్ని వాటియెడ ఉపయోగించటానికి నేను ఇష్టపడను. అయితే ఇవి ఎడ్వర్టు హైడ్ ద్వారా నిర్వర్తితాలైనప్పుడు, రాక్షసకృత్యాలై పోతున్నవి. ఇటువంటి విలాసవాహ్యాళులకు వెళ్ళి తిరిగివచ్చిన తరువాత, నేను చేసి వచ్చిన కృత్యాలను తలుచుకొని నేనే నా పతనాన్ని గురించి అద్భుతావహచిత్తుడ నౌతుండేవాణ్ణి. నా అంతరాత్మలో ఈ పరిచితవ్యక్తికి స్వేచ్ఛ యిచ్చి “నీ ఆనందానికి అనుగుణంగా వర్తించి రావలసిందని ఒంటరిగా పంపేవాణ్ణి. ఈ హైడ్ స్వభావం చేతనే మహాక్రూరుడుగా అవతరించిన వ్యక్తి, అతడు చేసే ప్రతికృత్యం, అతని ప్రతిభావం స్వార్థపరత్వంతో నిబిడీకృతమై ఉంటాయి. ఒక వన్యమృగంలా ఇతరులను అనేక తరతమరీతుల్లో ఎటువంటి దారుణహింసలకైనా పాల్పడజేసి, అతడు ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. మెత్తదనం అణుమాత్రమైనా లేని పాషాణశరీరివలె అతడు దయావిదూరుడు. ఎడ్వర్డు హైడ్ చేసే దారుణ హింసాచర్యలను చూచి ఎన్నోమార్లు హెన్రీ జెకిల్ దారుభూతుడైనాడు. కానీ ఇదంతా సామాన్యమైన చట్టాలకు లొంగేది కాదు. అందువల్ల అంతరాత్మను అంతగా కలతపెట్టేది కూడా కాజాలకపోయింది. ఎందువల్లనంటే ఇక్కడ దోషి హైడ్ హైడ్ ఒక్కడే. అయితే జెకిల్ మాత్రం తీసిపోయినవాడు మాత్రం కాడు. అతడు తిరిగి తనను స్వభావాన్ని మేల్కొల్పి అంతరాత్మలో అణుమాత్రమైనా కలవరపాటు పొందకుండానే వ్యవహరిస్తుండేవాడు. అవకాశమున్నచోటల్లా హైడ్ చేసిన దుష్కృత్యాలకు తగ్గ ప్రతిచర్యలను చేయటానికి ఎంతగానో ఆతురత వహిస్తుండేవాడు. ఈ రీతిగా అతని అంతరాత్మ నిద్రాముద్రితమైంది.