మాయావినిగానీ, మోసకారినీ గానీ కాను. నాలో ఉన్న ఉత్తమ నీచలక్షణాలు రెండూ విడివిడిగానే ప్రవర్తించాయి. పగటివేళ బాధోన్మూలనానికీ, దుఃఖనివారణకూ, విజ్ఞానాభివృద్ధికీ కృషి చేస్తున్నప్పుడు నేనెంత తీవ్రంగా ఉంటున్నానో, అలాగే నా నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు కూడా అంత సహజంగానే నీచకృత్యాలను చేస్తుండేవాణ్ణి. అంతరింద్రియశక్తులను గురించీ, ఆత్మోద్ధరణ గురించీ నేను సాధించిన శాస్త్రజిజ్ఞాసల వల్ల నాకు కొంత వివేచనజ్ఞానం కలిగింది. తన్మూలకంగా నాలోని ఉభయప్రవృత్తులకూ సదసత్ప్రవృత్తులకు, నిరంతరం నాలో ద్వంద్వయుద్ధం జరుగుతున్న ఫలితంగా నాకొక నిత్యసత్యం గోచరించింది. నైతికమూ, జిజ్ఞాసాపరమూ అయిన నా వివేచనజ్ఞానంవల్ల మానవుడు ఏకవ్యక్తి కాదనే నిత్యసత్యాన్ని నేను గ్రహించాను. ఈ సత్యాన్ని నేను కొంతవరకే చూడగలిగాను. అందువల్లనే నా జీవితనౌక భగ్నమైంది. అయితే నేను, సజీవియైన ప్రతి మానవుడూ ఒక వ్యక్తిద్వయసంపుటి అని వాదించగలను. నా పరిశోధనమార్గాలను అనుసరించి, భవిష్యత్తులో కొందరు నన్ను మించి ఎన్నో విషయాలను కనుక్కోవచ్చు. అప్పుడు వారు మానవుడు బహుముఖీనాలూ, పరస్పర విరుద్ధాలూ, స్వతంత్రాలూ అయిన ప్రవృత్తుల సంపుటి అని తప్పక వాదించి తీరుతారు. ఈ విషయాన్ని నేను గాఢవిశ్వాసంతోనూ, అతిశయమైన సాహసంతోనూ ఊహిస్తున్నాను.
నా జీవితలక్షణాన్ని బట్టి నేను ఇందులో ఒకవంకనే, కేవలం ఒకవంకనే, అనంతంగా పురోగమించాను. లోకంలోని నైతికప్రవర్తనను పరిశీలించినా, జీవితాన్ని గమనించినా, నాకు మానవుని ప్రాథమిక ద్వంద్వప్రకృతి పరిపూర్ణంగా అవగతమై పోయింది. ఈ విభిన్నప్రకృతులు రెండూ నాలో ఉండటం వల్లనే పరస్పర సంఘర్షణ కలుగుతున్నదని నా అంతరాత్మ విస్పష్టంగా గమనించింది. 'నేను' అంటే ఈ రెండు విభిన్నప్రకృతుల సంపుటి అన్నమాట! - ఒక ద్వంద్వప్రకృతి. ఈ రీతిగా నేను వాదించినప్పటికీ నేను ఈ రెంటిలో ఒక ప్రకృతిలోనే పరిపూర్ణవ్యక్తిత్వంతో ప్రవర్తిస్తున్నానని అంగీకరిస్తున్నాను. ఈ రెండు ప్రకృతులనూ శాస్త్రీయపరిశోధనల ద్వారా వేరు చేయటానికి వీలుందని నమ్మాను. నా శాస్త్రీయపరిశోధనలు నాకు మార్గాన్ని చూపించటానికి ఎంతో పూర్వమే, ఈ విషయాన్ని గురించి నేను ఎన్నెన్నో ఊహలు చేశాను. మానవునిలో ఉన్న ఈ రెండు భిన్నప్రకృతులను విడదీసి భిన్నమూర్తులను రూపొందింప గలిగితే మానవజీవితంలో కన్పించే సమస్త మానసికదుఃస్థితులూ తొలగిపోతవి. సత్ప్రకృతితో అసత్ప్రకృతికి ఎటువంటి బాంధవ్యమూ లేకుండా